వీధివ్యాపారులకు చేయూత

ABN , First Publish Date - 2022-08-07T05:36:25+05:30 IST

పట్టణాల్లో బతుకుదెరువు కోసం చిన్నాచితకా పనులు చేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి స్వనిధి పథకం కింద రుణ పరిమితిని రూ.50వేలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బ్యాంకుల నుంచి మొదటి విడత రూ.10వేల రుణం తీసుకొని తిరిగి చెల్లించిన కొందరికి రూ.20వేలు రుణం ఇచ్చారు. దాన్ని కూడా సక్రమంగా చెల్లించినవారికి రూ.50వేల రుణం పొందే అవకాశం కలిగింది. అప్పులు చేసుకొని వ్యాపారాలు కొనసాగించే పేదలకు ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం చేకూరనున్నది.

వీధివ్యాపారులకు చేయూత
హనుమకొండ చౌరస్తాలోని వీధి వ్యాపారులు

పీఎం స్వనిధి పథకం కింద రుణపరిమితి పెంపు
సక్రమంగా చెల్లించినవారికి రూ.50వేలు
50వేల మందికి రూ.109 కోట్ల రుణ వితరణ
రూ.35లక్షల క్యాష్‌ బ్యాక్‌ చెల్లింపు
రుణాలతో పాటు 8 సంక్షేమ పథకాల అమలు
ఉమ్మడి జిల్లాలో 60వేల మంది వీధి వ్యాపారులు


పట్టణాల్లో బతుకుదెరువు కోసం చిన్నాచితకా పనులు చేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి స్వనిధి పథకం కింద రుణ పరిమితిని రూ.50వేలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బ్యాంకుల నుంచి మొదటి విడత రూ.10వేల రుణం తీసుకొని తిరిగి చెల్లించిన కొందరికి రూ.20వేలు రుణం ఇచ్చారు. దాన్ని కూడా సక్రమంగా చెల్లించినవారికి రూ.50వేల రుణం పొందే అవకాశం కలిగింది. అప్పులు చేసుకొని వ్యాపారాలు కొనసాగించే పేదలకు ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం చేకూరనున్నది.

హనుమకొండ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : వీఽధి వ్యాపారులు కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ వీరు కోలుకోలేదు. కరోనా తగ్గుముఖం పట్టి తిరిగి పరిస్థితులు మెరుగపడ్డాక చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు పెట్టబడికి డబ్బుల్లేక అనేక ఇబ్బందులు పడ్డారు. కొంత మేర వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు, జీవనోపాధిలో చేదోడువాదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పీఎం స్వనిధి పథకం ప్రవేశ పెట్టింది. స్వనిధి పథకం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహించింది. అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అందచేసి మొదటి విడతగా రూ.10వేలు, తర్వాత రూ.20వేలు అందజేసింది. అయితే మొదటి విడత రుణాలు వేల సంఖ్యలో పొందినప్పటికీ చాలామంది తిరిగి చెల్లించలేదు. అదే సక్రమంగా చెల్లించినవారు రెండో విడతగా రూ.20వేలు పొందారు. ప్రస్తుతం ఈ రుణాన్ని సైతం చెల్లించిన వారు రూ.50వేల రుణాలు పొందేందుకు అర్హత సాధిస్తారు.

రూ.104 కోట్ల రుణం
ఉమ్మడి జిల్లాలో ఒక వరంగల్‌ మహానగర పాలక సంస్థతో పాటు తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 60వేల మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వీరిని ఆర్థికంగా ఆదుకునేందుకు 2020లో పూచీకత్తు లేని రుణంగా రూ.10వేలు అందించడం ప్రారంభించారు. ఆ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లిస్తే పరిమితిని రూ.20వేలకు పెంచి అందిస్తున్న విషయం తెలిసిందే. 18 నెలల్లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే రూ.50వేలకు అర్హులుగా పరిగణించనున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు వెయ్యి మంది రూ.50వేలకు అర్హత సాధించారు. ఇప్పటి వరకు రూ.10వేల రుణాన్ని 50వేల మంది, రూ.20వేల రుణాన్ని సుమారు 27వేల మంది పొందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారులకు రెండేళ్లలో వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.104కోట్ల రుణాలను చెల్లించారు. మరోవైపు నిర్ణీత కాలంలో రుణం చెల్లిస్తే వారికి ప్రోత్సాహక 7శాతం వడ్డీ రాయితీ అమలు చేస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తే నెలకు రూ.100 నుంచి రూ.300వరకు క్యాష్‌బ్యాక్‌ వర్తింపచేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యాష్‌బ్యాక్‌ రూపంలో రూ.35లక్షలను వ్యాపారుల ఖాతాల్లో జమయ్యాయి. వరంగల్‌ మహానగర పాలక సంస్థతో పాటు జనగామ, మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో 30500 మంది రూ.10వేల రుణంగా తీసుకోగా 17800 మంది రూ.20వేల అప్పు తీసుకున్నారు. రూ.50వేల రుణం కోసం ఇప్పటి వరకు 5600 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

ప్రత్యేక యాప్‌
రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ బేస్డ్‌ రికవరీ మెకానిజం (సీఆర్‌ఎం) చరవాణి యాప్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చారు. ఇంతకు ముందు బ్యాంకు అధికారులు జాబితాను పంపిస్తేనే రుణ వాయిదాలు చెల్లించారా లేదా అని చూసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం యాప్‌ అందుబాటులోకి రావడం ద్వారా సులభంగా మెప్మా సిబ్బంది తనఖీ చేయవచ్చు. ఒక వేళ చెల్లించని పక్షంలో వీధి వ్యాపారిని సంప్రదించి చెల్లించేలా, ఇతర ప్రయోజనాలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. సకాలంలో రుణాలు చెల్లించినవారు  మున్సిపల్‌ కార్యాలయాల్లోని మెప్మా విభాగాల్లో సంప్రదించాలి. రూ.20వేలు చెల్లించిన తర్వాత రూ.50వేలు రుణం పొందేందుకు అర్హులవుతారు. ఆ మొత్తం నిర్దేశిత వ్యవధిలో చెల్లిస్తే భవిష్యత్తులో మరింత రుణం అందించే అవకాశం ఉంది.

ఆర్థిక, ఆరోగ్య భరోసా..
కేంద్ర ప్రభుత్వం స్వనిధి కింద వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తుండగా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎనిమిది రకాల పథకాలు వీరికి అందిస్తోంది. వారికి ఆర్థిక, ఆరోగ్య భరోసా కల్పించేందుకు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. బ్యాంకులు, పౌరసరఫరా, కార్మిక, స్త్రీశిశు, మహిళా ఆరోగ్యశాఖలతో వీధివ్యాపారుల కుటుంబ సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి వారికి ప్రయోజనాలు దక్కేలా చూడనున్నారు. 18  నుంచి 70   యేళ్ల వయసు గల వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి బీమా పథకాన్ని అమలు జరగేలా చర్యలు తీసుకోనున్నారు. పౌరసరఫరాల శాఖతో వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డుతో అనుసంధానించి ఆ కుటుంబం నుంచి సభ్యుడు దేశంలో ఎక్కడికి వలస వెళ్లినా సరుకులు పొందేలా గుర్తింపు ఇవ్వనున్నారు. కార్మిక శాఖతో శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా పించన్‌ తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. లబ్దిదారుల వయసు మేరకు ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తం జమ చేస్తూ 60 యేళ్ల అనంతరం పింఛను మంజూరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. స్త్రీ, శిశు మహిళా సంక్షేమ శాఖ ద్వారా వారి కుటుంబాల్లో గర్భిణులకు మాతృవందన యోజన కింద పౌష్టికాహారం, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జననీ సురక్షయోజన కింద సంస్థాగత ప్రసవాలు, ప్రభుత్వం నుంచి ఇచ్చే  ఆర్థిక సహాయాలను అందించనున్నారు.

స్వనిధి మహోత్సవ్‌

వరంగల్‌ మహానగరంలో సుమారు 42,800 మంది వీధివ్యాపారులను గుర్తించి గ్రేటర్‌ వరంగల్‌ పక్షాన వారికి గుర్తింపు కార్డులను జారీ చేశారు. 27వేల మందికి రూ.28కోట్ల రుణాలను అందచేశారు. రెండో విడతలో 28వేల మంది వీధి వ్యాపారులను గుర్తించి 9వేల మందికి రూ.20వేలను రుణాలుగా అందించారు. మూడో విడతలో రూ. 50వేలను 635 మంది వీధివ్యాపారులు అర్హత సాధించారు.

Updated Date - 2022-08-07T05:36:25+05:30 IST