ఆమె రాక ఓ సంచలనం

Published: Wed, 17 Aug 2022 01:39:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆమె రాక ఓ సంచలనం

భారతీదేవి రంగా

జననం: 1908

మరణం: 27-09-1972


వెంకటగిరి స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ మీద రైలు ఎక్కడానికి గాంధీ మహాత్ముడు నిలబడి ఉన్నారు. తనను కలవడానికి వచ్చిన భారతీదేవి, పొణకా కనకమ్మలతో ఆయన మాట్లాడుతూ ‘‘అమ్మా! భారతీదేవీ! ఆంధ్ర మహిళలకు పురుషులలో ఉండే ఉత్సాహమే కాదు, కార్యశూరత్వం కూడా ఉన్నదమ్మా. ఆంరఽధా కాంగ్రెస్‌ మహిళా విభాగానికి మీరిద్దరూ పట్టుకొమ్మలు. నీవు కనకమ్మను కలుపుకొని పని చేయడం సంతోషంగా ఉందమ్మా’’ అన్నారు. 1932 శాసనోల్లంఘన సందర్భంలో... గుంటూరు జిల్లాలో భారతీదేవి వహించిన ప్రముఖ పాత్ర, అంతకుపూర్వం 1930 ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచే ఆమె జాతీయోద్యమంలో పాల్గొనడం.. వీటన్నిటి గురించీ గాంధీజీ సవివరంగా తెలుసుకున్నారు.


ఆ కారణంగానే ప్రముఖ జాతీయవాది ఎన్‌.జి.రంగా, భారతీదేవి దంపతుల స్వగ్రామమైన నిడుబ్రోలు వచ్చి, వారి ఆతిథ్యం స్వీకరించారు. బహిరంగ సభలో ఉపన్యసించారు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలకు తన బంగారు గాజులను జత చేసి.. భారతీదేవి అందించగా, చిరునవ్వుతో స్వీకరించారు. వెలగా సుబ్బయ్య, పిచ్చమ్మ దంపతులకు 1908లో... అప్పటి బాపట్ల తాలూకా మాచవరంలో భారతీదేవి జన్మించారు. ఆమె ఇంట్లోనే తెలుగు, ఇంగ్లీషు నేర్చుకున్నారు. సంపన్నుడు, విద్యావంతుడు, సంస్కరణశీలి ఎన్‌.జి.రంగాతో వివాహం నిశ్చయం కాగానే... తను కూడా విద్యావంతురాలు కావాలన్న పట్టుదలతో... గుంటూరు వెళ్ళి, ఉన్నవ దంపతులు నడుపుతున్న జాతీయ విద్యాలయం ‘శారదా నికేతనం’లో చేరారు. రంగా, భారతీదేవిల వివాహం 1924లో జరిగింది. ఆ తరువాత మద్రాసులో ఆమె కొంతకాలం చదివారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్‌ వెళ్తున్న భర్త వెంట వెళ్ళి, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటిలోని ‘రస్కిన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో చదువుకున్నారు. అప్పటికి ఆమె వయసు పదిహేడేళ్ళు. యూరప్‌ దేశాలతో పాటు కొన్ని ఆఫ్రికా ప్రాంతాలను ఆమె చూశారు. ఆ దేశాలవారు భారతీయుల కన్నా ఘోరమైన స్థితిలో ఉండడం గమనించారు. భారత స్వతంత్ర సిద్ధికి ఎలాంటి త్యాగాలైనా చేయాలనీ, ఏ కష్టాన్నైనా సహించాలనీ సంకల్పించుకున్నారు. 


స్వదేశం చేరుకున్నాక... పచ్చయ్యప్ప కాలేజీలో భర్త ప్రొఫెసర్‌గా ఉంటున్న సమయంలో... యంగ్‌ ఉమెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో భారతీదేవి పాల్గొని, మంచి అనుభవజ్ఞానం గడించారు. 1930లో గాంధీ మహాత్ముడి పిలుపు మేరకు రంగా ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ దంపతులు నిడుబ్రోలు గ్రామానికి చేరుకున్నారు. భర్తతోపాటు భారతీదేవి కూడా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఇది ఆంధ్ర కర్షక కుటుంబాల్లో గొప్ప సంచలనం కలిగించింది. రైతు కుటుంబానికి చెందిన, విద్యావంతురాలైన సంపన్న గృహిణి నిస్సంకోచంగా సభలకూ, సమావేశాలకూ హాజరు కావడం, ఉపన్యాసాలు ఇవ్వడం లాంటివి మహిళల్లో కొత్త ఉత్సాహం కలిగించాయి. 1932లో శాసనోల్లంఘన చెయ్యడానికి విదేశీ వస్తు, వస్త్ర బహిష్కరణను ముఖ్య సాధనంగా కాంగ్రెస్‌ ఉపయోగించింది. దీని కోసం శాంతి సైనికులకు శిక్షణ ఇవ్వడానికీ, క్రమబద్ధంగా పికెటింగులు జరపడానికీ శిబిరాలు ఏర్పాటు చేశారు. భారతీదేవి నాయకత్వంలో... తెనాలిలో ఏర్పాటైన మహిళా శిబిరంలో సంపన్న గృహిణులు, వృద్ధులు, కొత్త పెళ్ళికూతుళ్ళతో సహా అన్ని కులాలవారూ వచ్చి శిక్షణ తీసుకున్నారు.


విదేశీ వస్తు, వస్త్రాలయాల దగ్గర, కల్లు, సారా దుకాణాల ముందు రోజుకు ఆరు గంటలపాటు శాంతియుతంగా పికెటింగ్‌లు చేపట్టారు. ఆరు నెలలు నడిచిన ఈ శిబిరాన్ని ఎందరో నాయకులు సందర్శించారు. ఆ ఖ్యాతి గాంధీ మహాత్ముడి వరకూ వ్యాపించింది. ఆంధ్ర మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం మరింత ఎక్కువయింది. భారతీదేవి నిర్వహణ శక్తి, దీక్ష ఆయనకు సంతోషం కలిగించాయి. మరోవైపు ఆ కార్యక్రమాలను అధికారులు సహించలేక... 1932 జనవరి 27న తెనాలిలో భారతీదేవిని అరెస్ట్‌ చేశారు. ఏడాది జైలు, రూ. 500 జరిమానా విధించారు. ఆమె బంధువులు జరిమానా చెల్లించడంతో... ఏడాది జైలు శిక్ష కోసం ఆమెను రాయవేలూరుకు పంపించారు. జైల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆమె కుంగిపోలేదు.


రైతుబిడ్డ అయిన భారతీదేవి ఎల్లప్పుడూ రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించేవారు. ఆమె 1931 నుంచీ రైతు రక్షణ కమిటీలో సభ్యురాలు. రైతులకు సేద్యానికి సంబంధించిన విజ్ఞానాన్ని బోధించడానికి నిడుబ్రోలులో ఎన్‌.జి.రంగా 1934 నుంచి అవిచ్ఛిన్నంగా ఇరవై రెండేళ్ళ పాటు నిర్వహించిన వేసవి విద్యాలయంలో... వందల మంది విద్యార్థులకు కన్నతల్లిలా అన్ని సదుపాయాలూ అమరేలా చూశారు. క్రమంగా కర్షక సేవ ఆమె జీవితంలో ప్రధానాంశం అయింది. భర్త జైలుకు వెళ్ళిన సమయంలో ఎంతో నేర్పుతో ఆ కార్యకలాపాలను కొనసాగించారు. మరోవైపు అస్పృశ్యతా నివారణకు, వితంతు వివాహాలకు పాటుపడ్డారు. బాలికా విద్య కోసం నిడుబ్రోలులో బాలికా ప్రాథమిక పాఠశాల నెలకొల్పారు. కళాశాల స్థాపనకు సహకరించారు. మహిళల కోసం రాజకీయ పాఠశాలలు నిర్వహించి, వారిలో చైతన్యం కలిగించారు.


మందస జమీలో పోలీసులు జరిపిన హింసాకాండలో సాసుమాను గున్నమ్మ అనే మహిళ మరణించగా... ఆమె నేల కూలిన చోట ప్రజల సహకారంతో మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో సంఘాలకు సారథిగా ఉన్నప్పటికీ... పిలిచి ఇస్తానన్నా మంత్రి పదవుల లాంటివి ఆమె స్వీకరించలేదు. ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన భారతీదేవి 1972 సెప్టెంబరు 27న హృద్రోగంతో మృతి చెందారు. జాతీయోద్యమంలో ఆమె సాగించిన పోరాటం, రైతు సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తాయి. భర్తతోపాటు భారతీదేవి కూడా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఇది ఆంధ్ర కర్షక కుటుంబాల్లో గొప్ప సంచలనం కలిగించింది. రైతు కుటుంబానికి చెందిన, విద్యావంతురాలైన సంపన్న గృహిణి నిస్సంకోచంగా సభలకూ, సమావేశాలకూ హాజరు కావడం, ఉపన్యాసాలు ఇవ్వడం లాంటివి మహిళల్లో కొత్త ఉత్సాహం నింపాయి.


(‘స్వతంత్ర సమరంలో ఆంధ్రమహిళలు’ సంకలనం నుంచి )

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

రెడ్ అలర్ట్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.