ఆమె ధైర్యం.. 10 మందికి జీవితాన్నిచ్చింది.. కరోనా నుంచి కాపాడింది..!

Published: Thu, 26 Mar 2020 10:19:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆమె ధైర్యం.. 10 మందికి జీవితాన్నిచ్చింది.. కరోనా నుంచి కాపాడింది..!

ఆంధ్రజ్యోతి (26-03-2020): ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 14 మంది ఇటాలియన్‌ టూరిస్టులు! వాళ్లందరికీ  ‘కొవిడ్‌ -19’ పాజిటివ్‌ నిర్ధారణ అయింది! అయినా ఆ వైద్యురాలు భయంతో వెనుకంజ వేయలేదు! ఓ పక్క స్వీయరక్షణ చర్యలు పాటిస్తూనే, మరోపక్క ధైర్యంగా రోగులకు చికిత్సతో పాటు, ఆత్మస్థయిర్యాన్నీ అందించింది! ఫలితంగా వారిలో పది మంది టూరిస్టులు కోలుకుని ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు! వాళ్ల ప్రాణాలను కాపాడి, పునర్జన్మను అందించిన ఆ వైద్యురాలు... గుర్‌గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, 42 ఏళ్ల డాక్టర్‌ సుశీలా కటారియా! 


‘‘ఆ కేసులను ఇంకొకరికి అప్పచెప్పేసి ఉండగలను. వైద్యురాలినైన నేనే వారిని వదిలేస్తే, వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు ఎవరు చికిత్స చేస్తారు? కాబట్టే కరోనా వైరస్‌ కలిగించేది ఎంత క్లిష్టమైన ఇన్‌ఫెక్షన్‌ అయినా, దాన్ని అంతం చేయడం అసాధ్యం కాదనీ, సరైన జాగ్రత్తలు పాటిస్తూ, చికిత్స చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చని నిరూపించాలని అనుకున్నాను. అందుకోసం శాయశక్తులా కష్టపడ్డాను. ఫలితంగా 14 మంది ఇటాలియన్‌ రోగుల్లో పది మంది పూర్తిగా కోలుకుని ఈ సోమవారం (23న) ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. ఒకరు శనివారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురికి చికిత్స కొనసాగుతూ ఉంది.’’ అని తన అనుభవాన్ని చెప్పుకొచ్చిన డాక్టర్‌ కటారియా వారికి గత 20 రోజులుగా చికిత్సను అందించారు. 


మార్చి 4న ఈ టూరిస్టులందరూ రాజస్థాన్‌ చూడడం కోసం మన దేశానికి వచ్చారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో, వాళ్లందరినీ ‘మేదాంత ఆస్పత్రి’కి తీసుకురావడం జరిగింది. ఆస్పత్రికి చేరుకున్న సమయంలో వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా, అందరూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, ఆస్పత్రిలో ఆఘమేఘాల మీద ఐసొలేషన్‌ వార్డు ఏర్పాట్లు పూర్తి చేశారు.  కరోనా రోగులకు సన్నిహితంగా చికిత్స అందించడం కోసం డాక్టర్‌ కటారియా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రొటెక్టివ్‌ బాడీ సూట్‌, గ్లాసెస్‌, మాస్క్‌, చేతి తొడుగుల్లో గడిపారు. 


ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ... ‘ఇలాంటి చికిత్సలు వైద్యులకు సవాళ్లలాంటివి. అందరు కుటుంబాలలాగే నా కుటుంబం కూడా నా గురించి భయాందోళనలకు లోనైంది. మా వారికి ‘ఇన్‌ఫ్లమేటరీ ఆర్థ్రయిటిస్‌’ అనే కీళ్ల జబ్బు ఉంది. ఈ జబ్బుకు వాడే మందుల కారణంగా ఆయనకు కరోనా వైరస్‌ తేలికగా సోకే వీలుంది. కాబట్టి ఆయనను ఫామ్‌హౌస్‌కు తరలించాను. బాబు పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. నాకు కరోనా సోకుతుందేమోనని నా కూతురుకి చెప్పలేనంత బెంగ. పిల్లలిద్దరూ నాతో పాటే ఒకే ఇంట్లో ఉన్నా, వేర్వేరు గదుల్లో ఉండేవారు. ఆస్పత్రిలో కన్నా, ఇంటికి వెళ్లే సమయంలో నేను మరింత ముందు జాగ్రత్త చర్యలు చేపట్టవలసివచ్చేది. తలుపుల గడియలు, నాబ్‌లు, లిఫ్ట్‌ బటన్లు, లైట్‌ స్విచ్‌లు చేతులతో తాకేద్నానే కాదు. మాట్లాడేటప్పుడు కూడా కనీసం రెండు మీటర్ల దూరం పాటించేదాన్ని. నిజానికి కరోనాతో పోరాటం నాకంటే ఆ వ్యాధితో పోరాడే రోగులకే పెద్ద సవాలు. చికిత్స తీసుకుంటున్న ఓ ఇటాలియన్‌ రోగి, ‘‘నేను బ్రతుకుతానా?’’ అంటూ నన్ను అడిగాడు.


అతనికి బ్రతకాలని ఎంతో పట్టుదలగా ఉంది. అతనికి ధైర్యం నూరిపోయడం నా బాధ్యత. కానీ చికిత్స కొనసాగినంత కాలం నాకూ, రోగులకూ మధ్య 90% సంజ్ఞలే సంభాషణలుగా సాగాయి. ఈ రోగుల్లో ఒక్కరు తప్ప మిగిలినవారంతా 68 ఏళ్లు పైబడిన హైరిస్క్‌ రోగులే! వీళ్లందరి ప్రాణాలను కాపాడి, ఇటలీలోని వాళ్ల కుటుంబసభ్యులతో కలపడం వీలుపడకపోవచ్చు. చికిత్స మధ్యలోనే కొందరి ప్రాణాలూ పోవచ్చు. ఒక్కోసారి వారికి ధైర్యం చెప్పేటప్పుడు, వారికి తప్పుడు ఆశలు కల్పిస్తున్నానా? అనిపించేది. అయితే ఓ వైద్యురాలిగా బతుకు మీద ఆశను, నా మీద నమ్మకాన్నీ పోగొట్టలేను. నిజానికి కొవిడ్‌ - 19 పాజిటివ్‌గా నిర్ధారణ అవడం అనేది వారికి పెద్ద షాక్‌. విదేశ పర్యటన కోసం వచ్చి, ఇలా ప్రాణాంతక వ్యాధికి గురవడం, స్వదేశానికి వెళ్లలేకపోవడం, అయినవాళ్లకు దూరంగా ఉండిపోవడం ఎంత కష్టం?’’ అని చెప్పుకొచ్చారామె.


అక్కరకొచ్చిన వాట్సాప్‌!

రోగులకు అందించే చికిత్స, దానికి వారు స్పందించే తీరులను ఎప్పటికప్పుడు వైద్యులు షేర్‌ చేసుకోవాలి. అలాగే ఇటలీ ప్రభుత్వానికీ సమాచారం అందించాలి. అదే సమయంలో ఇటలీలో ఉన్న రోగుల కుటుంబసభ్యులకూ వీరి బాగోగుల గురించి తెలియచెప్పాలి. ఇందుకోసం కటారియా ఓ తెలివైన ఆలోచన చేశారు. అందరినీ ఒకే వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చి, వివరాలన్నీ షేర్‌ చేసేవారు. చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి కూతురు ఎలీనా, తన తల్లి ఆరోగ్యం గురించి డాక్టర్‌ కటారియాకు వాట్సాప్‌ సందేశం పంపింది. అందుకు సమాధానంగా కటారియా.... ‘‘నువ్వు పంపిన సందేశాన్ని మీ అమ్మకు చేరవేశాను. నువ్వు ఆమెనెంత ప్రేమిస్తున్నావో చెప్పాను.


ఆమె కోలుకుని ఇటలీ చేరుకున్న తర్వాత, నేను స్వయంగా ఇటలీ వచ్చి ఆమెతో సమయం గడుపుతానని కూడా చెప్పాను. ఓ గంట పాటు ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకుని అనునయించాను. ఆమె చిరునవ్వు నవ్వి, వైద్యచికిత్సకు సహకరిస్తానని ప్రమాణం చేసింది. నా వైద్య బృందం మొత్తం ఆమె కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’’ అని ఎలీనాకు కటారియా వాట్సాప్‌ సందేశం పంపింది. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఓ పక్క అలుపెరగకుండా రోగులకు చికిత్స అందిస్తూనే ఇలాంటివి ఎన్నో సందేశాలను ఆమె ప్రతిరోజూ పంపుతూనే ఉన్నారు.


ప్రేమసందేశం!

సమర్ధమైన వైద్యంతో కరోనా కోరల నుంచి కాపాడిన డాక్టర్‌ కటారియాకు, ఆస్పత్రిలోని వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ 70 ఏళ్ల ఇటాలియన్‌ టూరిస్ట్‌ ఎమీలియా ఓ ప్రేమ సందేశాన్ని ఉత్తరం రూపంలో అందించింది. దాని సారాంశం ఏంటంటే... డియర్‌ డాక్టర్‌ కటారియా.... మాకోసం అనునిత్యం మీరూ, మీ వైద్యబృందం చేసిన సేవలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు మా శరీరాల పట్ల మాత్రమే కాదు, మనసుల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. భయంకర వ్యాధికి వెరవక, అంకితభావంతో చికిత్స చేసి, కరోనా రోగుల ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ సుశీలా కటారియా సాటి వైద్యులకు ఆదర్శంగా నిలిచారు.


భయమెందుకు?

రోహ్‌తక్‌లోని ‘పండిట్‌ భగవత్‌ దయాళ్‌శర్మ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’లో వైద్య విద్య అభ్యిసించిన కటారియాది హరియాణాలోని ఓ చిన్న గ్రామం. తన బాల్య విశేషాలను ఇలా వెల్లడించిందామె. ‘‘బాల్యంలో తమ్ముడూ నేనూ కలిసి బడికి ప్రతిరోజూ ఐదుకిలోమీటర్లు నడిచి వెళే ్లవాళ్లం. దారిలో మూడు కాలువలు దాటాల్సి వచ్చేది. మా తమ్ముడు చాలా భయస్తుడు. ఓసారి కాల్వలో పెద్ద పెద్ద్ద కొమ్ములతో ఓ ఎద్దు  కనిపించింది. మరో కాల్వలో కుక్క కనిపించింది. దాని వైపు చూస్తే కరుస్తుందేమోన ని అటుకేసి చూడ కుండా కాల్వ దాటేశాం.


ఇక మూడవ కాల్వ బురదతో నిండి ఉంది. అప్పుడు ఓ సన్నని పైపును తాడుగా వాడుకుని ఆ కాల్వ దాటేశాం. ఆ సమయంలో నాకు భయం వేసిందా? అంటే లేదనే చెప్పగలను. ఆ అనుభవాలన్నీ నాలో భయాన్ని పోగొట్టాయి. మెడికల్‌ కాలేజీకి  వెళ్లినప్పుడు కూడా నాకంటే మెరుగైన కుటుంబ నేపథ్యం ఉన్న విద్యార్థులు కనిపించేవారు. అయినా నాలో ఆత్మవిశ్వాసం తరిగేది కాదు నేనేంటో నాకు తెలుసు. అందరూ ఇది నాకున్న అరుదైన లక్షణం అనేవారు. ఇది అరుదైన లక్షణం ఎలా అవుతుంది? మనకు ఒక మెదడు, రెండు చేతులు, రెండు కాళ్లు, కళ్లూ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం. అందుకు భయమెందుకు? ఈ గుణం నాకు సహజంగానే అబ్బింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.