ఆమె తాళం...పెళ్లికే ప్రత్యేకం

ABN , First Publish Date - 2021-03-06T05:56:08+05:30 IST

ఓ గ్రామంలో పెళ్లి. వేద పండితులు ‘గట్టి మేళం..’ అనగానే పెద్దగా డోలు, సన్నాయి మోగాయి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లికి వచ్చినవారి దృష్టంతా మంటపం వైపు ఉంటుంది. కానీ ఆ గ్రామంలో అతిథుల కళ్లన్నీ మేళగాళ్ల వైపే మళ్లుతాయి. అక్కడే కాదు...

ఆమె తాళం...పెళ్లికే ప్రత్యేకం

పెళ్లంటే పందిళ్లు... సందళ్లు... తప్పెట్లు... తాళాలు. అంతేగా! కానీ తమిళనాడులోని పుదుకోటలో పెళ్లంటే..! ఓ పదేళ్ల బాలిక డోలుపై చేసే లయ విన్యాసం. సుతిమెత్తని వేళ్లతో శృతి తప్పని ఆమె ‘గట్టి మేళం’. ఆ అమ్మాయే నిశాంతి. లాక్‌డౌన్‌లో మేనమామ ఇంటికి వెళ్లి డోలును ఓ పట్టు పట్టిన ఈ చిన్నారి... ఇప్పుడు వాయిద్య బృందంలో ప్రధాన ఆకర్షణ అయింది.


మొదట్లో తప్పెటపై శిక్షణ తీసుకున్నాను. వేళ్లనొప్పి భరించలేకపోయేదాన్ని. చేతులు, భుజాలు నొప్పి పుట్టేవి. డోలు వాయించేటప్పుడు వచ్చే ఒక లయబద్ధమైన శబ్ధం నాకెంతో ఇష్టం. అది విన్నప్పుడు నొప్పిని కూడా మరిచిపోతాను. 


ఓ గ్రామంలో పెళ్లి. వేద పండితులు ‘గట్టి మేళం..’ అనగానే పెద్దగా డోలు, సన్నాయి మోగాయి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లికి వచ్చినవారి దృష్టంతా మంటపం వైపు ఉంటుంది. కానీ ఆ గ్రామంలో అతిథుల కళ్లన్నీ మేళగాళ్ల వైపే మళ్లుతాయి. అక్కడే కాదు... ఆ పక్క ఊళ్లోనూ ఇదే తంతు. అందుకు ఒకే ఒక్క కారణం... నిశాంతి డోలు వాయిస్తుండడం. డోలుపై లయబద్ధంగా వేళ్లు కదిలిస్తూ, లీనమైపోతుంది ఆ బాలిక. అంత చిన్న వయసులో డోలు వాయించడమే పెద్ద విశేషం. అలాంటిది విద్వాంసులను సైతం ముగ్ధులను చేసేలా లయబద్ధంగా వాయించడం ఈ చిన్నారి గొప్పదనం. 


‘వాయిద్య’ కుటుంబం... 

నిశాంతిది తమిళనాడులోని పుదుకోట. కరోనాతో కాలం స్తంభిస్తే... ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ డోలు సాధన మొదలుపెట్టింది. 5వ తరగతి చదువుతున్న నిశాంతి కుటుంబంలో డోలు, సన్నాయి వాయిద్యకారులున్నారు. ఆమె తండ్రి నారాయణన్‌ పుదుకోటలో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా, తాత కృష్ణన్‌ నాదస్వర విద్వాంసుడు. ఆమె మేనమామ నాగరాజన్‌ డోలు వాయిద్యకారుడు. అప్పుడప్పుడూ మేనమామ గ్రామమైన వారాపూర్‌కు వెళ్లే నిశాంతి.. ఆయన వద్ద డోలు వాయిద్యం గురించి తెలుసుకుంది. నిద్ర లేచింది మొదలు రోజంతా ఇంట్లో డోలు, సన్నాయి వాద్యాలు వినిపిస్తుండడంతో వాటిపై ఆమెకు ఇష్టం పెరిగింది. 


అందరితో కలిసి శిక్షణ... 

నిశాంతి భరతనాట్యం నేర్చుకుంది. దీంతో రాగాలు, స్వరాలపై ఆమెకు కాస్త అవగాహన ఉంది. ఆమె మేనమామ వద్దకు చాలామంది పిల్లలు డోలు నేర్చుకోవడానికి వస్తుండేవారు. వారిని చూసి నిశాంతి కూడా ఉత్సాహంగా డోలు వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టింది. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా బడులు మూతపడడంతో మామ ఇంట్లోనే ఉండిపోయిన నిశాంతి... పూర్తి సమయాన్ని డోలు వాయిద్యానికే కేటాయించింది.  


రెండు కళ్లూ చాలవు... 

నిశాంతి డోలు వాయిస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. చూసేవారు తమను తాము మైమరిచిపోతారు. ‘‘నిశాంతి తనకు తానుగా డోలు నేర్చుకుంది. మేము డోలు వాయిస్తుంటే సాధారణంగానే అనిపిస్తుంది. అదే నిశాంతి వేళ్లు డోలుపై కదలాడుతేంటే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆ నటరాజస్వామే వచ్చి నాట్యమాడుతుంటే... ఆయనను చూస్తూ మైమరిచిపోయి డోలు వాయించేస్తుందా! అన్న భావన కలుగుతుంది’’ అంటారు ఆమె మేనమామ నాగరాజన్‌. 


సంగీత కచేరీలకూ... 

ప్రస్తుతం నిశాంతి పలు సంగీత కచేరీలలో కూడా తన ప్రతిభను చాటుతోంది. పుదుకోట అరియనాచ్చి ఆలయంలో 3 గంటలపాటు నిరంతరాయంగా ఆమె వాయించిన ఆదితాళం అందరినీ ఆశ్చర్యగొలిపింది. ‘‘మొదట్లో తప్పెటపై శిక్షణ తీసుకున్నాను. వేళ్లనొప్పి భరించలేకపోయేదాన్ని. చేతులు, భుజాలు నొప్పి పుట్టేవి. కానీ బాధపడలేదు. డోలును ఎత్తడం పెద్ద కష్టమైపోయేది. ఎవరో ఒకరు డోలును నా ఒళ్లో పెట్టేవారు. వేళ్లకు కప్పులు తగిలించుకుని డోలు వాయించేటప్పుడు ఒక లయబద్ధమైన శబ్ధం వస్తుంది. ఆ శబ్ధం నాకెంతో ఇష్టం. అది విన్నప్పుడు నొప్పిని కూడా మరిచిపోతాను’’ అని ఎంతో హుషారుగా చెబుతుంది నిశాంతి. ప్రముఖ డోలు విద్వాంసులు హరిద్వారమంగళం ఏకే పళని, మన్నార్గుడి ఎంఆర్‌ వాసుదేవన్‌ల మాదిరిగా తనూ పేరు తెచ్చుకోవాలని మరింత శ్రమిస్తోంది ఈ చిన్నారి. 

డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా 

Updated Date - 2021-03-06T05:56:08+05:30 IST