ఏనుగుల మంద స్వైరవిహారం... భారీగా పంట నష్టం

ABN , First Publish Date - 2022-08-10T05:25:36+05:30 IST

సోమల మండలంలో ఏనుగుల మంద పొలాల్లో స్వైరవిహారం చేస్తూ రైతులకు కంట కన్నీరు తెప్పిస్తోంది. సోమవారం రాత్రి 12 ఏనుగులు సోమల పంచాయతీ మధురమలై కొండ నుంచి ఆవులపల్లె పంచాయతీలో ప్రవేశించి రామకృష్ణాపురం, కలమందలవారిపల్లె, వంగసానిపల్లెల్లో టమోటా, కొబ్బరి, అరటి తోటలు, వరి పొలాల్లో విచ్చలవిడిగా తిరగాడి నష్ట పరిచాయి.

ఏనుగుల మంద స్వైరవిహారం... భారీగా పంట నష్టం
పేటూరు సమీపంలో ఒంటరి ఏనుగు ధ్వంసం చేసిన వరి నారు

సోమల, ఆగస్టు 9:  మండలంలో ఏనుగుల మంద పొలాల్లో స్వైరవిహారం చేస్తూ రైతులకు కంట కన్నీరు తెప్పిస్తోంది. సోమవారం రాత్రి  12 ఏనుగులు సోమల పంచాయతీ మధురమలై కొండ నుంచి ఆవులపల్లె పంచాయతీలో ప్రవేశించి రామకృష్ణాపురం, కలమందలవారిపల్లె, వంగసానిపల్లెల్లో టమోటా, కొబ్బరి, అరటి తోటలు, వరి పొలాల్లో విచ్చలవిడిగా తిరగాడి నష్ట పరిచాయి. అలాగే మామిడి కొమ్మలను, డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేశాయి. రామకృష్ణాపురానికి చెందిన రైతు బోయకొండ టమోటా తోటలో 10మంది కూలీలతో కోత కోసి మార్కెట్‌కు తరలించడానికి సిద్ధం చేసిన టమోటా క్రేట్లను ధ్వంసం చేశాయి. రైతులు సుబ్రహ్మణ్యం, పురుషోత్తంనాయుడికి చెందిన టమోటా తోటల్లో  తీగలకు ఏర్పాటు చేసిన కర్రలను విరిచేశాయి. పొలం వద్ద కాపు కాస్తున్న రైతులు ఏనుగుల మందను గుర్తించి గ్రామంలోకి పరుగులు తీశారు. ఏనుగుల మంద గ్రామం వైపు రాకుండా ఇళ్ల ముందు మంటలు వేసుకున్నారు. ఇక ఏనుగుల మంద నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు మరో మార్గంలో పేటూరు సమీపంలోని కరికలచెరువు వద్ద రైతులు చిట్టిబాబు, దేశయ్యకు చెందిన పొలాల్లో నాట్లకు సిద్ధంగా ఉన్న వరి నారును తొక్కివేశాయి. గత ఏడాది కూడా వరి నాట్లు వేసినప్పుడు తొక్కి వేసినట్లు రైతులు తెలిపారు. మండలంలోని రాంపల్లె, ఎర్రగుంతలపల్లె, బోనమంద, చిన్నకమ్మపల్లె, పట్రపల్లె, గట్టువారిపల్లెల్లో ఏనుగుల దాడులతో యేటా రైతులు పంటలను కోల్పోతున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదంటున్నారు. పరిహారం మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. స్థానిక బీట్‌ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్ట నివేదికలను జిల్లా అఽధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. 



Updated Date - 2022-08-10T05:25:36+05:30 IST