ఇక్కడ కూలి.. అక్కడ ఏలి...

ABN , First Publish Date - 2022-07-07T05:49:52+05:30 IST

ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం పేరుతో నిర్వహిస్తున్న వేడుకలకు బస్తర్‌ మహారాజు, మలి కాకతీయ సామ్రాజ్యం 22వ వారసుడు కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ గురువారం ఓరుగల్లు నేలపై అడుగు పెట్టబోతున్నారు.

ఇక్కడ కూలి.. అక్కడ ఏలి...

బస్తర్‌లో ఉజ్వలంగా సాగిన కాకతీయుల మలి ప్రస్థానం
600 సంవత్సరాలు... 20 మంది చక్రవర్తుల పాలన..
ప్రస్తుత వారసుడు కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌
బీజం వేసింది ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడు
వారసత్వాన్ని ధృవపరిచ్చిన పలువురు చరిత్రకారులు
మలి వైభవానికి 700 ఏళ్లు పూర్తి
నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు



హనుమకొండ, జూల్‌ 6 (ఆంధ్రజ్యోతి):
ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం పేరుతో నిర్వహిస్తున్న వేడుకలకు బస్తర్‌ మహారాజు, మలి కాకతీయ సామ్రాజ్యం 22వ వారసుడు కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ గురువారం ఓరుగల్లు నేలపై అడుగు పెట్టబోతున్నారు. 700 యేళ్ల తర్వాత మొదటి సారిగా తన పూర్వీకులు ఏలిన గడ్డకు రాబోతున్న వారసుడికి ఘనస్వాగతం పలకడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కమల్‌ చంద్ర ఉదయం 8 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత తిరిగి వెళతారు. కాగా, కాకతీయుల వారసుడి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎవరీ కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌? కాకతీయుల వారసుడు ఎట్లా? బస్తర్‌లో మలికాకతీయ ప్రస్థానం ఎలా సాగింది? అన్నదానిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాకతీయుల మలి ప్రస్థానంపై కథనం...

ప్రతాపరుద్రుడి మరణానంతరం..
కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రుడి మరణం తర్వాత ఆయన సోదరుడు అన్నమదేవుడు బస్తర్‌ జిల్లాలోని దంతేవాడలో 13వేల చ.కి.మీ. విస్తీర్ణంలో రెండో కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత 600 యేళ్లపాటు 20 మంది కాకతీయ రాజులు పరిపాలించినట్టు బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం మెమోరాండం ‘ఆన్‌ ది ఇండియన్‌ స్టేట్స్‌ -1940’లో పేర్కొన్నది. అలాగే బస్తర్‌ పాలకుడు మహారాజ ప్రవీర్‌ చంద్ర భంజ్‌దేవ్‌ కాకతీయ అని సుప్రీంకోర్టు 1960లో విడుదల చేసిన పత్రంలో దీనిని మరింత బలపరిచింది. అంతేకాక ఇప్పుడున్న బస్తర్‌ పాలకులే కాకతీయ వారసులని దంతేవాడ అడవుల్లో తెలుగులిపిలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి.

మలి ప్రస్థానం ఎలాగంటే..
తెలంగాణ చరిత్రలో కాకతీయులది ఉజ్వల చారిత్రక ఘట్టం.   క్రీ.శ 900 యేళ్ల ముందు నుంచి క్రీ.శ 1323 వరకు కాకతీయు యుగం కొనసాగింది. ఆ తర్వాత ఓరుగల్లుపై ఢిల్లీ పాలకుడు ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌ కుమారుడు ఉలుగ్‌ ఖాన్‌ దండయాత్రలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఓడిపోయి బందీ అయ్యాడని, ఆయనను ఢిల్లీకి తీసుకువెళుతుంటే నర్మదానదిలో దూకి ప్రాణత్యాగం చేశాడన్న కథనం ప్రచారంలో ఉంది. సిద్ధేశ్వర చరిత్రలో ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్‌ రాచమర్యాదలతో మన్నించి వదిలేశాడని, కానీ ప్రతాపరుద్రుడు తిరిగి రాజ్యానికి రావడం ఇష్టంలేక కాళేశ్వరంలో శివదీక్షలో ఉండి ప్రాణార్పణం చేశాడని ఉంది. ప్రతారుద్రుడి మరణానంతరం అతడి కుమారుడు వీరభద్రుడు రాజయ్యాడని,  ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడు స్వయంగా వీరభద్రుడికి పట్టాభిషేకం జరిపాడని పీవీ పరబ్రహ్మశాస్ర్తి కాకతీయులు అనే గ్రంథంలో రాశారు. ప్రతాపరుద్రుడి అనంతరం అన్నమదేవుడు ఓరుగల్లులో ఉండలేక బస్తర్‌ అడవుల్లోకి వెళ్లిపోయాడని ఒక కథనం ఉంది. ప్రతాపరుద్రుడితో పాటు బందీ అయిన అన్నమదేవుడు తప్పించుకొని బస్తర్‌ అడవుల్లో తలదాచుకున్నాడని మరో కథనం ఉంది.


బీజాపూర్‌, సుకుమా, నారాయణపూర్‌, కాంకేర్‌లలోని దేవాలయాలు కాకతీయ శైలిలో నిర్మించారు. దీనిని బట్టి ఓరుగల్లులో ప్రతాపరుద్రుడి మరణానంతరం చత్తీ్‌సగడ్‌లోని బస్తర్‌లో మలి కాకతీయ సామ్రాజ్యం ఏర్పడినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న పాలకుడు మహారాజు హోదాలో ఉన్న కమల్‌ చంద్రభంజ్‌ దేవ్‌ అన్నమదేవుడి వంశక్రమంలో 22వవాడు.  బస్తర్‌ రాజ్య పరిధిలో బస్తర్‌, బీజాపూర్‌, దంతేవాడ, నారాయణపూర్‌, కాంకేర్‌ జిల్లాలున్నాయి. బస్తర్‌ పాలకుల కులదైవం దంతేశ్వరి. కాకతీయులు దంతేశ్వరి దేవతను ఇక్కడ ప్రతిష్టించారు. అన్నమదేవుని నుంచి తన వరకు బస్తర్‌ పాలించిన పాలకుల గురించి తెలుసునని, ఈ విషయంలో తెలంగాణ చరిత్రకారుల మధ్య తేడాలున్నాయని, బస్తర్‌ పాలకులు కాకతీయుల వారసులేనని చెప్పదగిన అన్ని ఆధారాలున్నాయని  కమల్‌ చంద్ర ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.  

బస్తర్‌లో రాజ్య స్థాపన
ప్రస్తుతం చత్తీ్‌సగడ్‌ రాష్ట్రంలోని ఒకప్పటి బస్తర్‌ రాజ్యానికి ఏలిక అన్నమదేవుడని బస్తర్‌ రాజు (1703) దిక్పాల దేవుడు వేయించిన దంతేశ్వరి దేవాలయంలోని శాసనం వల్ల తెలుస్తున్నది. అన్నమదేవుడు.. బస్తర్‌ వెళ్ళి అక్కడ అప్పటివరకు బస్తర్‌ రాజ్యాన్ని పాలించే నాగవంశీయులను ఒక్కొక్కరిని ఓడించి వారి రాజ్యాలను ఆక్రమించాడు. అక్కడ ప్రవహించే శంఖిని, డంకనీ నదులు కలిసే చోట దంతేశ్వరంలో ఒక దేవాలయం నిర్మించి ఓరుగల్లులో మాణిక్యేశ్వరిగా పూజించిన దేవత ప్రతిరూపాన్ని ఇక్కడ దంతేశ్వరి దేవిగా ప్రతిష్టించాడు. అక్కడ ఆ దేవతకు గుడి కట్టించాడు. ఆయన వారసులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు. 138 గ్రామాలను ఆ దేవాలయం కింద కేటాయించారు. బస్తర్‌ దట్టమైన అరణ్యం. అటవిక జాతులు మొన్నటిదాకా దుస్తులు వేసుకోవడం తెలియనివారు. బస్తర్‌లోని ముఖ్య ప్రదేశాలు బార్పూర్‌, దంతేశ్వర, గడియా, బరాంఘర్‌, నారాయణ పాల్‌, సునార్‌ పాల్‌, తీరధ్‌ ఘర్‌, పోతినార్‌, కాప్కా, డొంగార్‌, బార్పూర్‌ జగదల్పూర్‌కు 55 మైళ్ల దూరంలో ఉంటుంది.  

వంశక్రమణిక
దంతేశ్వర శాసనాల ప్రకారం అన్నమదేవుడి నుంచి దిక్పాలదేవుడి వరకు వంశక్రమణిక ప్రకారం.. ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమరాజు (1324-1369), హంవీరదేవ (1369-1410), బైరవ (1410-1468), పురుషోత్తమదేవ (1468-1534), జయసింహదేవ, నరసింహదేవ, జగదీయరాయదేవ, వీరనారాయణ దేవ (1602-1625). వీరసింహదేవ, దిక్పాలదేవ వరుసగా  బస్తర్‌ను పాలించారు. దిక్పాలదేవుడి తర్వాత బస్తర్‌ రాకుటుంబం వద్ద ఉన్న రికార్డు ప్రకారం రాజ్యవారసులు రాజపాల్‌ దేవ (1709-1721), దళపతి దేవ (1731-1774), దర్యాదోదేవ (1774-1777), మహిపాలదేవ (1830-1853), భూపాలదేవ (1830-1853), బైరామదేవ (1853-1891) రుద్రప్రతాప దేవ (1891-1921), ప్రపుల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌ (1921-1992) రాణి ప్రపుల్ల కుమారిదేవి ( 1922-1936), ప్రవీర్‌ చంద్ర భంజ్‌ దేవ (1936-1947), విజయ చంద్ర భంజ్‌ దేవ ((1966-1970) భరత్‌ చంద్ర భంజ్‌ దేవ (1970-1996) బస్తర్‌ను పాలించారు.  ప్రస్తుతం కమల్‌ చంద్రభంజ్‌ దేవ (1996) నుంచి బస్తర్‌కు మహారాజుగా కొనసాగుతున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల బస్తర్‌ రాజ్యం రెండుగా విడిపోయింది. ఒకటి కాంకర్‌, రెండోది బస్తర్‌ జగదల్పూర్‌ రాజధాని. ఈ రాజ్యాల సైనిక వారసులమని ఇక్కడి హల్బా తెగవారు చెప్పుకుంటారు.

కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌

కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ 1984లో జన్మించారు. బ్రిటన్‌ కాన్వెంటరీ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, అనంతరం పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేశారు. ప్రస్తుతం ప్రవీర్‌ సే అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బస్తర్‌ కేంద్రంగా ఉన్న సర్వ్‌ సమాజ్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. యువకుడిగా, ఆధునిక భావాలు ఉన్న కాకతీయ వారసుడిగా కమల్‌ ఉన్నారు. దంతేవాడలో ఇప్పటికీ రాజఠీవితో ఉట్టిపడే రాజసౌధం ఉంది. ఈ రాజసౌధంలో కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌, రాజమాత  క్రిష్ణకుమారి దేవి, గాయత్రి దేవి నివాసం ఉంటున్నారు.

Updated Date - 2022-07-07T05:49:52+05:30 IST