Cat saves life: అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచిన మహిళ.. గుండెలపై కూర్చుని కనిపించిన పిల్లి.. ఎటూ కదలలేని స్థితి..ఆ తరువాత..

ABN , First Publish Date - 2022-08-20T02:55:58+05:30 IST

అపాయంలో చిక్కుకున్న యజమానులను కుక్కలు కాపాడిన ఉదంతాలు గతంలో అనేకం చూశాం. అయితే.. కుక్కులతో పాటూ కొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ.. మనుషులను పిల్లులు కాపాడిన ఘటనలు మాత్రం చాలా అరుదు.

Cat saves life: అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచిన మహిళ.. గుండెలపై కూర్చుని కనిపించిన పిల్లి.. ఎటూ కదలలేని స్థితి..ఆ తరువాత..

ఎన్నారై డెస్క్: అపాయంలో చిక్కుకున్న యజమానులను కుక్కలు కాపాడిన ఉదంతాలు గతంలో అనేకం చూశాం. అయితే.. కుక్కులతో పాటూ కొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ.. మనుషులను పిల్లులు కాపాడిన ఘటనలు మాత్రం చాలా అరుదు. చిన్న శబ్దానికే పారిపోయే పిల్లులు మనుషులను ఆదుకుంటాయని ఎవరూ ఊహించరు కూడా..! కానీ.. ఇంగ్లండ్‌లో ఇటీవల ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయంలో పడ్డ యజమానురాలిని రక్షించేందుకు పెంపుడు పిల్లి(Cat) ఏకంగా డాక్టర్‌ రేంజ్‌లో రంగంలోకి దిగింది. ఆమెను అపాయం నుంచి గట్టెక్కించింది. అసలేం జరిగిందో తెలిస్తే.. 


శామ్ ఫెల్‌స్టెడ్ అనే మహిళ ఇంగ్లండ్‌లోని నాటింగ్హమ్(Nottingham) నగరంలో నివసిస్తుంటుంది. ఇటీవల ఓనాడు ఆమెకు ఆర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెళకువ వచ్చింది. ఛాతిలో తీవ్రమైన నొప్పి.. ఎటూ కదల్లేని స్థితి. ఎదురుగా తన పెంపుడు పిల్లి కనిపించింది. ఆమెపై కూర్చున్న పిల్లి ఆమె ఛాతిపై గట్టిగా అదుముతోంది. ఎలాగొలా ఓపిక తెచ్చుకున్న ఆమె వెంటనే తన తల్లికి ఫోన్ చేసింది. ఆమె అత్యవసర సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు శామ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు శామ్‌కు గుండె పోటు(Heart attack) వచ్చినట్టు చెప్పారు. నిద్రలోనే చనిపోవాల్సిన ఆమె.. అదృష్టం కొద్దీ బతికిందన్నారు. 


అయితే.. శామ్ మాత్రం పిల్లే తన ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చింది. ‘‘పిల్లి నా ఛాతిపై కూర్చుంది. చెవిలో పెద్దగా మ్యావ్ అని అరుస్తోంది. అది సాధారణంగా అలా చేయదు. రోజంతా నిత్రపోతూనే ఉంటుంది. అసలు నిద్రే దాని జీవితమన్నట్టు ఉంటుంది. రాత్రిళ్లు నన్నెప్పుడూ నిద్రలేపలేదు. ఆకలేసిన సందర్భాల్లో కూడా విసిగించలేదు. ఈ విషయాలు మా అమ్మకు చెబితే ఆమె షాకైపోయింది. పిల్లే నాకు మెళకువ వచ్చేలా చేసిందని అమ్మతో చెప్పాను. పిల్లులు ఇలా చేయడం చాలా అరుదు. అదృష్టం బాగుండబట్టి నేను ప్రాణాలతో మిగిలాను’’ అని శామ్ తెలిపారు. కాగా.. ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్న శామ్ ఆ తరువాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. శామ్ ఇంటికొచ్చాక ఆమె పెంపుడు పిల్లి అసలేం జరగనట్టు ఎప్పటిలాగే ఓ మూలపడి నిద్రపోవడం ఆమెకు విచిత్రంగా తోచింది. 



Updated Date - 2022-08-20T02:55:58+05:30 IST