హీరోయిన్లు దొరుకుతారా?

Apr 22 2021 @ 16:57PM

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన హీరోలంతా ప్రేక్షకులకు ఎలాంటి కథలో కావాలో, ట్రెండ్‌ ఎలా నడుస్తుందనే ఆలోచనతో కథల వేటలో పడ్డారు. కొందరు రీమేక్‌ సినిమాలపై దృష్టి సారిస్తే.. మరి కొందరు యువ దర్శకుల కథలు వినే పనిలో పడ్డారు. అయితే కరోరా సెకెండ్‌ వేవ్‌ మొదలు కావడంతో దాదాపుగా షూటింగ్‌లూ ఆగిపోయాయి. మరోసారి తారలు ఇంటికే పరిమితం కావలసిన పరిస్థితి ఎదురైంది. అయితే సినిమాలు అంగీకరించే విషయంలో మాత్రం మన హీరోలు జోరు తగ్గించడం లేదు.

హీరోల వయసు కాదు. హీరోయిన్ల కొరత..
చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్‌’, బాబీతో ఓ చిత్రం అంగీకరించారు. బాలకృష్ణ ‘అఖండ’ తర్వాత అనిల్‌ రావిపూడితో ఓ చిత్రం చేయబోతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరో అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రవీణ్‌ సత్తారు కలయికలో ఓ సినిమా మొదలైంది. వెంకటేశ్‌, తరుణ్‌ భాస్కర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండబోతుందని సమాచారం ఉంది. అయితే ఈ అగ్ర హీరోలందరికీ జోడీగా హీరోయిన్లు దొరుకుతారా? అన్న అనుమానం ఇండస్ట్రీలో మొదలైంది. అందుకు కారణం హీరోల వయసు కాదు. హీరోయిన్ల కొరత. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న అనుష్క, నయనతార, తమన్నా, పూజాహెగ్డే, కాజల్‌, రష్మిక, కీర్తి సురేశ్‌ మందన్నాతోపాటు పలువురు నాయికలు వివిధ భాషల సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు మొదలయ్యే సరికి ఈ కథానాయికలు కాల్షీట్లు ఇవ్వగలరా? అన్నది అనుమానమే!

ఏ హీరోయిన్‌ కాదనుకుంటుంది...
తర్వాతి తరం హీరోలు హీరోలు కూడా వరుస సినిమాలు కమిట్‌ అయి ఉన్నారు. మహేశ్‌ - త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌- కొరటాల శివ, రామ్‌చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో ఇటీవల ప్రకటించిన చిత్రాలకు ఇంకా హీరోయిన్ల ఎంపిక జరగలేదు. ఇప్పటికే వీరి సరసన నటించిన సక్సెస్‌ఫుల్‌ భామలనే ఎంచుకునే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారట. ప్రభాస్‌ అంగీకరించిన అన్ని చిత్రాలకు కథానాయికలు ఎంపికయ్యారు. ప్రస్తుతం మన హీరోయిన్లు ఉన్న బిజీలో ఎంత వరకూ కాల్షీట్లు ఇవ్వగలరో చూడాలి. అయితే స్టార్‌ హీరో సరసన అవకాశం అంటే ఏ హీరోయిన్‌ మాత్రం కాదనుకుంటుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే! 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.