హే కృష్ణా....ముకుందా!

ABN , First Publish Date - 2021-12-07T07:22:36+05:30 IST

తిరుచానూరు పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు వైభవంగా జరిగాయి.

హే కృష్ణా....ముకుందా!
సూర్యప్రభ వాహనంపై వేణుగోపాల కృష్ణుడి అలంకరణలో అమ్మవారు

సూర్య,చంద్రప్రభ వాహనాలపై సిరులతల్లి కటాక్షం


తిరుచానూరు, డిసెంబరు 6 : తిరుచానూరు పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం ఆలయంలోని అద్దాల మండపం నుంచి ఉత్సవమూర్తిని వాహన మండపానికి వేంచేపు చేశారు. పట్టుపీతాంబర, స్వర్ణాభరణాలతో వేణుగోపాల కృష్ణుడి రూపంలో పద్మావతిదేవిని సూర్యప్రభ వాహనంపై అధిష్టింపచేశారు. జియ్యర్‌స్వాముల ప్రబంధ పారాయణం నడుమ మండపంలో వాహనసేవ ఏకాంతంగా జరిగింది. తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్‌, ఉదయ్‌ 100డజన్ల గాజులు, హుండీ బట్టలు అమ్మవారికి కానుకగా అందజేశారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనం గావించారు. సాయంత్రం అమ్మవారిని ఆలయం నుంచి వాహన మండపానికి వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, వేదఘోష్టి మధ్య సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో పద్మావతీ దేవి కటాక్షించారు.జియ్యర్‌స్వాములు,టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, ఆలయ అధికారులు మధు, శేషగిరి, రాజే్‌షఖన్నా, దాము, జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


రేపు పంచమితీర్థం

అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విశేష వేడుక అయిన పంచమితీర్థం బుధవారం ఉదయం 11.52గంటలకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చిన్న పుష్కరిణిలో ఈ కార్యక్రమం జరగనుంది.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల ముగిశాక మరుసటి రోజైన గురువారం సాయంత్రం 4-7గంటల మధ్య ఆలయంలో పుష్పయాగం జరగనుంది. 



Updated Date - 2021-12-07T07:22:36+05:30 IST