హై అలర్ట్‌!

ABN , First Publish Date - 2022-05-07T05:28:56+05:30 IST

హరియాణా నుంచి ఆదిలాబాద్‌కు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు ఆయుధాలు సరఫరా చేస్తూ పట్టుబడిన ఉదంతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

హై అలర్ట్‌!

హరియాణా ఉగ్ర సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు 

నేషనల్‌ హైవే దాబాలపై ఎన్‌ఐఏ ఆరా తీసినట్లు ప్రచారం 

తెరపైకి వస్తున్న ఖాసీం బేగ్‌ ఘటన

ఆయుధాలు ఎటు వెళుతున్నాయన్న దానిపై సర్వత్రా చర్చ

నిర్మల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : హరియాణా నుంచి ఆదిలాబాద్‌కు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు ఆయుధాలు సరఫరా చేస్తూ పట్టుబడిన ఉదంతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హరియాణా నుంచి పాకిస్థాన్‌కు సంబంధించిన ఆయుధాలను ఆదిలాబాద్‌కు తరలించడం వెనక ఉగ్రవాదుల కుట్ర దాగి ఉందంటూ అక్కడి పోలీసులు వెల్లడించడం అందరినీ అప్రమత్తం చేసింది. గత రెండు దశాబ్దాల క్రితం కూడా నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిన విషయం తెలిసిందే. ఖాసీం బేగ్‌ అనే వ్యక్తి ముంబై బాంబు పేలుళ్ల కేసులో పాల్గొన్నాడన్న ఆరోపణపై అప్పట్లో అతడిని పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా జైలుకు పంపారు. అతడికి పాకిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాది అజాంగోరీకి అనుచరుడిగా కొనసాగినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మరోసారి ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పట్టుబడడం ఇక్కడి పోలీసులను హైరానాకు గురి చేస్తోంది. అయితే ఈ ఉదంతంతో జిల్లాలోని పంజాబీ దాబాలపై నిఘా వర్గాల అధికారులు శుక్రవారం దాడులు చేశారన్న ప్రచారం అందరిని ఉత్కంఠకు గురి చేసింది. ముఖ్యంగా నిర్మల్‌ సమీపంలోని ఓ దాబాపై ఎన్‌ఐఏ అధికారులు దాడి చేశారన్న ప్రచారం కలకలం రేపింది. నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు గల పంజాబీ దాబాలపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. కొత్త వ్యక్తుల సంచారంపై కూడా నిఘా వర్గానికి చెందిన పోలీసులు దృష్టి సారించారంటున్నారు. దీంతో పాటు భైంసా నుంచి నాందేడ్‌ వరకు గల దాబాలపై కూడా పోలీసులు ఇదే తరహాలో నిఘా సారించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు చేసినట్లు తమకు సమాచారం లేదని తాము మాత్రం అందని సమాచారం మేరకు అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. గత కొంతకాలం నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతం స్లీపర్‌ సెల్‌గా కొనసాగుతున్నట్లు వెలువడుతున్న కథనాల నేపథ్యంలో ఉగ్రవాదుల ఆయుధాల వ్యవహారం బయట పడడం ప్రాఽధాన్యతను సంతరించుకుంటోంది. 

ఆయుధాలు ఎటు వెళుతున్నాయి...

ఇదిలా ఉండగా హరియాణా నుంచి ఆదిలాబాద్‌కు ఆయుధాలను తరలిస్తున్నట్లు చెబుతున్న ఉగ్రవాదులు వీటిని ఏ ప్రాంతం వైపు తీసుకువెళుతున్నారోననే అంశంపై మాత్రం స్పష్టతనివ్వనట్లు తెలుస్తోంది. అక్కడి పోలీసులు సైతం ఉగ్రవాదులు ఆయుధాలను ఆదిలాబాద్‌ జిల్లాకు తరలిస్తున్నారని చెప్పినప్పటికి వాస్తవంగా వీటిని ఆదిలాబాద్‌ లేదా నిర్మల్‌, భైంసా, మంచిర్యాల ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ ప్రాంతాలు మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉండడం, అలాగే రోడ్డు రైల్వే మార్గాలున్న కారణంగా వీటిని ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం సులభమవుతుందన్న కోణంతోనే ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారంటున్నారు. భారీ పేలుడు పదార్థాలున్న కారణంగా వీటిని ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో భద్రపర్చేందుకు కూడా ఉగ్రవాదులు కుట్ర చేశారంటున్నారు. జిల్లాలోని ఓ చోట డంప్‌ ఏర్పాటు చేసి ఈ ఢంప్‌ నుంచి అన్ని ప్రాంతాలకు ఆయుధాలు తరలించవచ్చన్న కోణంతోనే కుట్ర జరిగి ఉండవచ్చంటున్నారు. 

తెరపైకి వస్తున్న ఖాసీం బేగ్‌ ఘటన...

దాదాపు 20 ఏళ్ల క్రితం భైంసాకు చెందిన ఖాసీం బేగ్‌ అనే వ్యక్తిని టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధాలున్న ఆరోపణపై పోలీసులు అరెస్టు చేశారు. అతడికి ముంబై పేలుళ్లతో సంబంధాలున్నట్లు ఆరోపించిన పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే ఈ ఆరోపణలు నిర్ధారణ కాని కారణంగా అతడు జైలు నుంచి విడుదలై ప్రస్తుతం నిజామాబాద్‌లో సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా ఖాసీంబేగ్‌కు ధర్మాబాద్‌లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన అజాంగోరీ నాయకుడిగా ఉన్నాడని అప్పట్లో పోలీసులు వెల్లడించారు. అజాం గోరీ ధర్మాబాద్‌, భైంసా, జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించాడని పోలీసులు వివరించారు. అయితే అజాం గోరీ జగిత్యాలలో ఎన్‌కౌంటర్‌ అయ్యారు. ఈ ఘటనలు అప్పట్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నయన్న కోణంపైనే కొనసాగాయి. మళ్లీ 20 సంవత్సరాల తరువాత ఆదిలాబాద్‌ జిల్లా పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమవుతోంది. 

ఎన్‌ఐఏ తనిఖీల సమాచారం లేదు..

- రాంరెడ్డి, ఏఎస్పీ , నిర్మల్‌ 

కాగా జిల్లాలోని దాబాలపై గాని ఇతర ప్రాంతాలపై గాని ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేసినట్లు తమకు సమాచారం లేదు. అయినప్పటికి తాము అప్రమత్తంగా ఉంటూ అన్ని ప్రాంతాల్లో నిఘా సారించాం. ప్రజలు ఎలాంటి అపోహాలకు గురి కావద్దు. 


Read more