వారపు సంతలో అధిక వసూళ్లు

ABN , First Publish Date - 2021-11-23T05:29:48+05:30 IST

రుద్రవరం వారపు సంత మార్కెట్‌లో గేటు రూపంలో అధిక వసూళ్లు చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు.

వారపు సంతలో అధిక వసూళ్లు
రుద్రవరం వారపు సంత మార్కెట్‌

  1. చెల్లించలేమంటున్న చిరు వ్యాపారులు
  2. పట్టించుకోని అధికారులు 

రుద్రవరం, నవంబరు 22: రుద్రవరం వారపు సంత మార్కెట్‌లో గేటు రూపంలో అధిక వసూళ్లు చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ప్రతి సోమవారం వారపు సంత మార్కెట్‌ నిర్వహిస్తారు. సుమారు 22 గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి కూరగాయలు, నిత్యా వసర వస్తువులు కొనుగోలు చేస్తారు. నంద్యాల, ఆళ్లగడ్డ, శిరివెళ్ల, ఇంకా పలు గ్రామాల నుంచి వ్యాపారులు కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తారు. గేటు రూపంలో ఒక్కో అంగడికి రూ.250 నుంచి రూ.300 వసూలు చేస్తున్నారని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చిన్న చిన్న అంగళ్లు పెట్టుకొని ఒక్క రోజు మాత్రమే ఇక్కడ కూరగాయలు, నిత్యావసర వస్తువులు అమ్ముకుంటామని, ఇంత ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇవ్వాల్సిందేనని అంటున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఇలాగైతా తాము వ్యాపారం ఏంచేస్తామని నిట్టూర్పుతో పెదవి విరుస్తున్నారు.

రూ.300 చెల్లిస్తున్నా

ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యావసర సరుకులు అమ్ముకున్నందుకు రూ.300 చెల్లిస్తున్నా. ఇంత గేటు ఎందుకని ప్రశ్నిస్తే ఇవ్వాల్సిందేనని అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- ప్రతాప్‌, వ్యాపారి, ఆళ్లగడ్డ  


రూ.50 చెల్లిస్తున్నా  

నంద్యాల నుంచి రుద్రవరం వారపు సంతకు సమోసాలు గంపలో తెచ్చి అమ్ముకుంటా. గేటుకు రూ.50 చెల్లిస్తున్న. రూ.70 అడిగితే ఇవ్వలేనని చెప్పాను. 

- లక్ష్మీదేవి, నంద్యాల 


వ్యాపారులకు స్లిప్పులు పంపిణీ చేస్తున్నాం

వారపు సంత మార్కెట్‌లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ అంగడికి ఎంత వసూలు చేయాలో వ్యాపారులకు స్లిప్పులు పంపిణీ చేస్తాం. గేటు రూపంలో అధిక వసూలు చేస్తున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. గేటు అధిక వసూలు చేస్తే వేలందారులపై చర్యలు తీసుకుంటాం. 

-సుబ్బరాయుడు, ఇన్‌చార్జి ఈవో, రుద్రవరం 

Updated Date - 2021-11-23T05:29:48+05:30 IST