బ్లాక్‌ మార్కెటర్లతో ఖాకీల కుమ్మక్కా?

ABN , First Publish Date - 2022-10-01T09:12:55+05:30 IST

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా విషయంలో బ్లాక్‌ మార్కెటీర్లతో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రేషన్‌ బియ్యం సీజ్‌ చేసిన తరువాత స్వతంత్ర వ్యక్తులు లేకుండా పంచనామాను ప్రభుత్వ అధికారులే..

బ్లాక్‌ మార్కెటర్లతో ఖాకీల కుమ్మక్కా?

వాహనాల సీజ్‌ తీరుచూస్తే అలాగే ఉంది

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై హైకోర్టు ఫైర్‌

మీ ఉత్తర్వులూ పొలీసులు పట్టించుకోరా?

ఫైల్‌పై యథాలాపంగా సంతకం పెట్టారా?

అర్హత లేని అధికారులతో కేసుల నమోదు

అలాంటివి కోర్టు సమీక్షకు నిలబడతాయా? 

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కట్టడిపై

కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మాటేమిటి?

కోర్టుకు హాజరైన పోలీస్‌ బాస్‌

దీనిని శిక్షగా భావించ వద్దన్న న్యాయమూర్తి


డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు

‘‘న్యాయస్థానం ముందు హాజరుకు ఆదేశించడాన్ని శిక్షగా భావించవద్దు. రేషన్‌ బియ్యం సీజ్‌ చేసే వ్యవహారంలో మేమిచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కిందిస్థాయి అధికారులకు నిర్దేశిస్తూ తయారు చేసిన ఫైలుపై మీరు యథాలాపంగా సంతకం చేశారా.. లేదా ఉత్తర్వులను అవగాహన చేసుకున్నారా అనే విషయాన్ని తెలుసుకొనేందుకే పిలిపించాం. అర్హత కలిగిన అధికారి వాహనాలు సీజ్‌ చేయకుంటే కోర్టు ముందు కేసులు ఎలా నిలబడతాయో చెప్పండి?’’ 


అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం అక్రమ రవాణా విషయంలో బ్లాక్‌ మార్కెటీర్లతో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రేషన్‌ బియ్యం సీజ్‌ చేసిన తరువాత స్వతంత్ర వ్యక్తులు లేకుండా పంచనామాను ప్రభుత్వ అధికారులే నిర్వహిస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తోందని పేర్కొంది. పంచనామాపై వీఆర్వోలు, మహిళా పోలీసులతో సంతకాలు ఎలా చేయిస్తారని నిలదీసింది. చట్టంలో నిర్దేశించిన అధికారులు కాకుండా ఇతరులు బియ్యం అక్రమ రవాణా వాహనాలను జప్తు చేస్తూ నమోదు చేసే కేసులు న్యాయస్థానం ముందు ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. అధికారులు, పోలీసులు నిబంధనల మేరకు నడుచుకోకపోడంతో 90శాతం కేసులు కోర్టు ముందు వీగిపోతున్నాయని గుర్తు చేసింది. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో రేషన్‌ బియ్యం ఇతర దేశాలకు తరలివెళ్తోందని, ఏ పోర్టు నుంచి బియ్యం రవాణా చేస్తున్నారో పోలీ్‌సబా్‌సగా మీకు సమాచారం ఉండే ఉంటుందని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ సర్క్యులర్‌ జారీచేసినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోకపోడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించింది.


రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకోసం ఉత్తర్వులు జారీచేయడంతో మీ పని పూర్తి కాదని..... వాటి అమలు తీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా డీజీపీ కార్యాలయం పై ఉందని స్పష్టం చేసింది. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనాల సీజ్‌ చేయడం, కేసులు నమోదు చేసే వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తూచతప్పకుండా పాటించేలా కిందిస్థాయి అధికారులను ఆదేశించాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. రేషన్‌ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలతో నంద్యాల జిల్లా పాములుపాడు పోలీస్‌ స్టేషన్‌ ఏఎ్‌సఐ వాహనాలను సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆ జిల్లాకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీ, ఇదే తరహా అభ్యర్ధనతో మరోవ్యక్తి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.... ఎస్‌ఐ కన్నా తక్కువ హోదా కలిగిన అధికారి వాహనాలు సీజ్‌ చేయడానికి వీల్లేదని గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించలేదని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న  వాహనాలను సీజ్‌ చేయడం, కేసుల నమోదు చేసే వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు, డీజీపీ ఉత్తర్వులు అమలు విషయంలో కిందిస్థాయి పోలీసుసిబ్బంది అవిధేయత, లాలె్‌సనెస్‌ పై వివరణ ఇచ్చేందుకు కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని రాష్ట్ర  డీజీపీ కెవి.రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఆదేశించింది. ఈ వ్యాజ్యం శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. 


చూసే సంతకం చేశారా?

డీజీపీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ... రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వాహనాలను సీజ్‌ చేసే విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆదేశిస్తూ డీజీపీ సర్క్యులర్‌ ఇచ్చారన్నారు. కొంత మంది కిందస్థాయి అధికారులు ఉత్తర్వులను పట్టించుకోకపోవడం వాస్తవమేనన్నారు. ప్రస్తుత కేసులో కోర్టు ఆదేశాలను అతిక్రమించి వాహనాలు సీజ్‌ చేసిన ఏఎ్‌సఐ, ఎస్‌ఐని సస్పెండ్‌ చేశామన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.... డీజీపీ ఉత్తర్వులు ఇవ్వడంలో ఎలాంటి వివాదం లేదన్నారు. వాటి అమలు తీరునే ప్రశ్నిస్తున్నామన్నారు. అర్హత కలిగిన అధికారి మాత్రమే అక్రమ రవాణా వాహనాలను సీజ్‌ చేయాలని, కోర్టు చేసిన సూచనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచనలు చేశామన్నారు. డీజీపీ సర్క్యులర్‌ జారీ చేసిన తరువాత కూడా అదే తరహా కేసులు న్యాయస్థానం ముందుకు రావడంతోనే డీజీపీ హాజరుకు ఆదేశించామన్నారు.


న్యాయస్థానం ముందు హాజరుకు ఆదేశించడాన్ని శిక్షగా భావించవద్దని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేషన్‌ బియ్యం సీజ్‌ చేసే వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశిస్తూ తయారు చేసిన ఫైలు పై యఽథాలాపంగా సంతకం చేశారా? లేక ఉత్తర్వులను అవగాహన చేసుకున్నారా? అనే విషయాన్ని  తెలుసుకొనేందుకే పిలిపించామన్నారు. చట్టంలో నిర్దేశించిన మేరకు అర్హత కలిగిన అధికారి వాహనాలు సీజ్‌ చేయకుంటే న్యాయస్థానం ముందు కేసులు నిలబడతాయా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. డీజీపీ స్పందిస్తూ...కేసులు విచారణకు నిలబడవని సమాధానం ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వాహనాలను సీజ్‌ చేసిన అధికారులను విధుల నుంచి సస్పెండ్‌ చేశామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేస్తామన్నారు. న్యాయమూర్తి కలగజేసుకుంటూ ప్రస్తుత కేసులో తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు సరే...ఇదే తరహా కేసుల్లో ప్రమేయం ఉన్న ఇతర పోలీసు సిబ్బంది సంగతి ఏంటని ప్రశ్నించారు. వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ బదులిచ్చారు.


పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ...‘‘వేకువజామున మూడుగంటలకు పిటిషనర్‌ రైస్‌మిల్లుపై పోలీసులు దాడి చేశారు. ఉదయం ఏడు గంటలకు పంచనామా చేసి వాహనాలను సీజ్‌ చేశారు. పంచనామాలో స్వతంత్ర వ్యక్తి స్థానంలో వీఆర్‌వో చేత సంతకం చేయించారు.  వాహనాలను పోలీసుస్టేషన్‌లో ఉంచడంతో బియ్యం వర్షానికి తడిచిపోయాయి. అధికారుల నుంచి నష్టపరిహారం ఇప్పించారు. బియ్యం రవాణా విషయంలో పిటిషనర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి....ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-01T09:12:55+05:30 IST