Breaking : 3 రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. జగన్ సర్కార్‌కు షాక్

ABN , First Publish Date - 2022-03-03T16:49:13+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

Breaking : 3 రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. జగన్ సర్కార్‌కు షాక్

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చిచెప్పింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఒకింత జగన్ సర్కార్‌కు కోర్టు మొట్టికాయలేసింది.


సర్కార్‌కు డెడ్‌లైన్..

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు.. 3 నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం డెడ్ లైన్ కూడా విధించింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని జగన్ సర్కార్‌కు కోర్టు సూచించింది. మరోవైపు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. మాస్టర్‌ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాల్సిందేనని కోర్టు సూచించింది.


తనఖా పెట్టొద్దు..

అమరావతి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని.. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి ఇవ్వొద్దని కూడా కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50వేలు కూడా ఇవ్వాలని కోర్టు తెలిపింది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్నారు. మొత్తానికి చూస్తే రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు.


కాగా.. ఇప్పటికే ప్రభుత్వం, రైతుల వాదనలు విన్న కోర్టు.. గురువారం నాడు కీలక తీర్పునే ఇచ్చింది. నిన్నటి నుంచి హైకోర్టు తీర్పుపై రాజధాని రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎప్పుడెప్పుడు వస్తుందా అని శిబిరాల్లో టీవీలు పెట్టుకుని మరీ రైతులు వేచి చూశారు. అయితే తీర్పు అనుకూలంగా రావడంతో శిబిరాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తీర్పు అనంతరం రైతు సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ‘అమరావతి’లో సచివాలయ నిర్మాణానికి కేంద్రం బడ్జెట్‌లో అక్షరాలా లక్ష రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ కేటాయింపులు చేసింది. గత ఏడాది కూడా ఈ పద్దు కింద రూ.లక్ష కేటాయించడం గమనార్హం.

Updated Date - 2022-03-03T16:49:13+05:30 IST