పోరు షురూ..!

ABN , First Publish Date - 2021-01-22T05:25:08+05:30 IST

జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కడప రెవెన్యూ డివిజన పరిధిలో 260, రాజంపేట రెవెన్యూ డివిజన పరిధిలో 268, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన పరిధిలో 279 పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 2,700 వార్డులు ఉన్నాయి.

పోరు షురూ..!

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన సిగ్నల్‌ 

9న షెడ్యూలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

జిల్లాలో 807 పంచాయతీలు

2019 మార్చిలో రిజర్వేషన్లు ఖరారు 

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ సందిగ్ధం


 రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పలు మలుపులు తిరుగుతోంది. కరోనా కల్లోలంతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అప్పట్లో ఎస్‌ఈసీ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఈనెల 23న మొదలై ఫిబ్రవరి 17న ముగిసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 9న షెడ్యూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 వ్యాక్సినేషన ప్రక్రియ ఉన్నందున ఎన్నికలు జరపలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిలిపి వేస్తూ సింగిల్‌ బెంచ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఎస్‌ఈసీ హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్‌ బెంచ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు ఎన్నికలకు గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి మళ్లీ మొదలైంది. గురువారం నుంచే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కొడ్‌ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 807 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరగడం ప్రశ్నార్థంగా మారింది.  


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కడప రెవెన్యూ డివిజన పరిధిలో 260, రాజంపేట రెవెన్యూ డివిజన పరిధిలో 268, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన పరిధిలో 279 పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 2,700 వార్డులు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019లో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూలు ప్రకారం మార్చి 17, 19న రెండు విడతల్లో ఎన్నికలు జరగాలి. అప్పుడే నిర్వహించి ఉంటే సర్పంచ, ఉప సర్పంచ, వార్డు సభ్యులతో పంచాయతీ పాలకవర్గం కొలువుదీరి పది నెలలు గడిచేది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం నేపఽథ్యంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా 2019 మార్చి 15న రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని నాడు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు న్యాయవివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 9న జారీ చేసిన షెడ్యూలు ప్రకారం తొలి దశ ఎన్నికల ప్రక్రియ ఈనెల 23న మొదలు కావాల్సి ఉంది. 2వ విడత 27, మూడో విడత 31న, నాలుగో విడత ఫిబ్రవరి 4న జిల్లా ఎన్నికల అధికారులు నోటిషికేషన జారీ, ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో వరుసగా నాలుగు విడతల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ ఇచ్చిన తీర్పుపై ఎస్‌ఈసీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సింగిల్‌ బెంచ తీర్పును రద్దు చేస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర అత్యునత న్యాయస్థానం గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది. అయితే హైకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


నాటి రిజర్వేషన్ల ద్వారానే ఎన్నికలు

2019 మార్చిలో పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 807 పంచాయతీలు, 2,700 వార్డులకు ఎన్నికలు జరగాలి. సర్పంచ స్థానాలు మహిళలకు 415, అన రిజర్వుడ్‌కు 392 రిజర్వేషన చేశారు. 17 ఎస్టీలకు, 148 ఎస్సీలకు, 225 బీసీలకు రిజర్వేషన కల్పించగా అన రిజర్వుడు పంచాయతీలు 417 కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం తాజా ఎన్నికలు జరుగుతాయని పంచాయతీ అధికారులు అంటున్నారు. కాగా.. కోర్టు సింగిల్‌ బెంచ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆ తీర్పు వచ్చేంత వరకు కోడ్‌ అమల్లో ఉన్నట్లేనని ఓ అధికారి పేర్కొన్నారు. 


జిల్లాలో పంచాయతీల రిజర్వేషన్లు వివరాలు 


సామాజికవర్గం జనరల్‌ మహిళలు మొత్తం


ఎస్టీ 14 3 17

ఎస్సీ 81 67 148

బీసీ 122 103 225

అన రిజర్వ్‌డ్‌ 198 219 417


మొత్తం 415 392 807

Updated Date - 2021-01-22T05:25:08+05:30 IST