TS News: లాయర్‌ మల్లారెడ్డి హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-08-04T03:19:52+05:30 IST

లాయర్‌ మల్లారెడ్డి హత్యను హైకోర్టు (High Court) సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది.

TS News: లాయర్‌ మల్లారెడ్డి హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్: లాయర్‌ మల్లారెడ్డి హత్యను హైకోర్టు (High Court) సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. దర్యాప్తును పర్యవేక్షించాలని లేఖలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కోరింది. సీఎస్‌ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ములుగు ఎస్పీ, హోం, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులను తెలంగాణ హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. ములుగు జిల్లా (Mulugu District) భూపాల్‌నగర్‌లో దుండగుల చేతిలో మల్లారెడ్డి హత్యకు గురయ్యారు. మల్లారెడ్డితో సుదీర్ఘకాలంగా భూతగాదాలు ఉన్న పలువురిని విచారించేందు కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన డ్రైవర్‌ సారంగంతోపాటు మల్లంపల్లికి చెందిన పలువురు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఇటీవల తలెత్తిన భూవివాదానికి సంబంధించి ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి (Mallareddy) హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన్ను హత్యచేయించిందెవరు? దారి కాచి ఇంత పాశవికంగా చంపించేంత కోపం ఎవరిది? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలను రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మల్లారెడ్డి మొత్తం 30 ఎకరాల్లో మైనింగ్‌ చేస్తున్నారు. ఐదు క్వారీల ద్వారా లాటరైట్‌, ఐరన్‌  ఓర్‌ను వెలికి తీస్తున్నారు.


మల్లంపల్లి ఎస్సారెస్పీ వంతెనకు సమీపంలోని క్వారీకి సరిహద్దుగా ఉన్న భూమి విషయంలో ఇటీవల తలెత్తిన వివాదం హత్యకు దారి తీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 61/2 సర్వేనంబరులోని 10 ఎకరాల భూమి విషయంలో ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి. 70/2 సర్వే నంబరులోని 3.28 ఎకరాల భూమిని ఇటీవల కొనుగోలు చేసిన మల్లారెడ్డి పట్టా చేసుకునే క్రమంలో రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. పక్కనే ఉన్న సర్వేనంబరు71లో ఉన్న 1.2 గుంటల స్థలం తాను కొనుగోలు చేసిన భూమి పరిధిలోకి వస్తుందని మల్లారెడ్డి వాదిస్తున్నారు. ఈ విషయమై సదరు భూ యజమానితో మల్లారెడ్డికి భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ వివాదం విషయమై ఆయన  సోమవారం ములుగు పోలీసులతో పాటు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే మల్లారెడ్డి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది.  మల్లారెడ్డి  హత్యను ఖండిస్తూ లాయర్లు మంగళవారం హైకోర్టు వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. న్యాయవాది మల్లారెడ్డి హత్య ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. 

Updated Date - 2022-08-04T03:19:52+05:30 IST