హైకోర్టు కొరడా

ABN , First Publish Date - 2021-11-25T08:07:01+05:30 IST

సర్కారుకు గట్టిషాక్‌ తగిలింది. రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న...

హైకోర్టు కొరడా

నాడు ఏరికోరి తెచ్చుకున్న జగన్‌ సర్కారు

ఎడాపెడా స్పెషల్‌ పీపీల నియామకం

అక్రమాలపై అప్పుడే హైకోర్టుకు ఫిర్యాదులు

‘రీకాల్‌’ చేసినా ఆయనే కావాలని పట్టు

ఆరోపణలపై విచారణ జరిపిన హైకోర్టు

అక్రమాల ప్రాథమిక నిర్ధారణ.. సస్పెన్షన్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)


జగన్‌ సర్కారుకు గట్టిషాక్‌ తగిలింది. రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న మనోహర్‌ రెడ్డిని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. న్యాయశాఖ కార్యదర్శిగా ఉండగా... స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలగకూడదనే ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది.


ఏరికోరి తెచ్చుకుని... 

న్యాయశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆమోదంతో ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. జగన్‌ అధికారంలోకి రాగానే... మనోహర్‌ రెడ్డిని ఏరికోరి రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత... మనోహర్‌ రెడ్డి అనేకమంది స్పెషల్‌ పీపీలను నియమించారు. అర్హతలు, సమర్థతతో సంబంధంలేకుండా, అధికారపార్టీ పెద్దల సిఫారసుల మేరకే వారిని నియమించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై హైకోర్టుకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ అసోసియేషన్‌ (కేడర్‌) కూడా ఫిర్యాదు చేసింది. ఎవరి సిఫారసు మేరకు ఎవరిని స్పెషల్‌ పీపీగా నియమించారో సోదాహరణంగా వివరిస్తూ... అందులో జరిగిన అవినీతి, అక్రమాలు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిశీలనకు స్వీకరించిన హైకోర్టు ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించింది. మనోహర్‌రెడ్డిని న్యాయశాఖ కార్యదర్శి పదవి నుంచి తప్పిస్తూ గతేడాది ఆగస్టు 20న హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన్ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారించే ఒంగోలు అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.


ఆయనే కావాలంటూ... 

పద్ధతి ప్రకారమైతే... న్యాయశాఖ కార్యదర్శి హోదాలో అక్రమాలకు పాల్పడిన మనోహర్‌రెడ్డిని ప్రభుత్వమే పక్కకు తప్పించాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరాలి. కానీ... ఇక్కడ అంతా రివర్స్‌! మనోహర్‌ రెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ... వాటి ఆధారంగానే హైకోర్టు చర్యలు తీసుకున్నట్లు తెలిసినప్పటికీ జగన్‌ సర్కారు తీరు మారలేదు. ‘న్యాయశాఖ కార్యదర్శిగా ఆయనే కావాలి’ అని హైకోర్టును కోరింది. అయితే... ఆరోపణల్లోని తీవ్రత దృష్టా, హైకోర్టు ఇందుకు అంగీకరించలేదు. తమ ఆదేశాల మేరకు మనోహర్‌ రెడ్డిని బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. న్యాయశాఖ కార్యదర్శిగా మరొకరి పేరును సిఫారసు చేయాలని సూచించింది.  తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం న్యాయశాఖ కార్యదర్శిగా మరొకరి పేరును సూచించింది. అయితే... హైకోర్టు ఆ పేరును కూడా ఆమోదించలేదు. ఆ తర్వాత న్యాయశాఖ కార్యదర్శి పదవి కోసం సర్కారు మరో పేరు సూచించనే లేదు. దీంతో అప్పటి నుంచీ ఆ పోస్టు ఖాళీగానే ఉంది.


తాజాగా సస్పెన్షన్‌ వేటు 

మనోహర్‌ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల్లోని అంశాలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వాటిపై విచారణ జరిపించింది. గత ఏడాది ఫిబ్రవరి 27నుంచి ఆగస్టు 25వరకు ఆయన బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించింది. ఆ తర్వాత ఆయన ఇచ్చిన వివరణపై హైకోర్టు సంతృప్తి చెందలేదు. ‘‘స్పెషల్‌ పీపీల నియామకంలో మనోహర్‌ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడ్డారని  వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నాం. ఆ తర్వాత ఆయనను రీకాల్‌ చేశాం. ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడినట్లుగా గుర్తించాం. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఏపీ సివిల్‌ సర్వీసు రూల్స్‌-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మనోహర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ఇక ఆయన  ఆఫీసులోనే కొనసాగడం న్యాయవ్యవస్థ ప్రయోజనాలకు హానికరం’’ అని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం హైకోర్టు అనుమతి లేకుండా కాకినాడ వదిలి బయటకు వెళ్లకూడదని ఆదేశించింది. ప్రస్తుతం మనోహర్‌రెడ్డి నిర్వహిస్తున్న బాధ్యతలను కాకినాడ 4వ అదనపు జిల్లా జడ్జికి అప్పగించాలని తెలిపింది.



సర్కారు విచారణ చేస్తుందా? 

మనోహర్‌ రెడ్డి ఏపీ ప్రభుత్వంలో న్యాయశాఖ కార్యదర్శి హోదాలో పని చేస్తూ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)లను నియమించారు. అంటే ప్రభుత్వంలో భాగంగా ఆయన ఈ నిర్ణయాలు  తీసుకున్నారు. వాటిని ప్రభుత్వ పెద్దలు కూడా ఆమోదించారు. ఆ నియామకాల్లోనే పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఫిర్యాదులపై మనోహర్‌రెడ్డి సస్పెండ్‌ అయ్యారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సాధారణంగా అయితే ఆయన నిర్ణయాలపై సమీక్షచేయాలి. ఆయన హయాంలో జరిగిన నియామకాలను పరిశీలించాలి. అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ లేదా ఏసీబీ విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఈ పనిచేస్తుందా? మిన్నకుండిపోతుందా? అన్న చర్చ సాగుతోంది. హైకోర్టు తన పరిధిలో ఉన్న మేరకు చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. విచారణ చేస్తారా? లేదా అన్నది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Updated Date - 2021-11-25T08:07:01+05:30 IST