సుప్రీం ఉత్తర్వులకు కట్టుబడాల్సిందే

ABN , First Publish Date - 2022-01-27T08:39:12+05:30 IST

ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం

సుప్రీం ఉత్తర్వులకు కట్టుబడాల్సిందే

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో.. రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకోండి

వారి సమస్యపై అధ్యయనం చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ట్రాన్స్‌జెండర్‌ వేసిన పిటిషన్‌ కొట్టివేత


అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై అధ్యయనం చేసి సప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? వారికి కల్పించాల్సిన ప్రయోజనాలేంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఎంతమేర రిజర్వేషన్‌ కల్పించాలి.. తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించింది. మూడు నెలల్లో ఉత్తర్వులు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. ఉద్యోగ దరఖాస్తులో జెండర్‌ గుర్తించే కాలమ్‌లో వారికి ప్రత్యేకంగా చోటు కల్పించకపోవడం అంటే ఉద్యోగ అవకాశాల్లో పురుషులు, స్త్రీలతో సమానంగా వారికి అవకాశాలు నిరాకరించడమే అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఉద్యోగ ప్రకటనల్లో పురుషులు, మహిళలతో సమానంగా చూడకుండా వారిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 


2018లో ఇచ్చిన ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్‌ కల్పించకపోడాన్ని సవాల్‌ చేస్తూ ఎం.గంగాభవాని అనే ట్రాన్స్‌జెండర్‌ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున న్యాయవాది సాల్మన్‌ రాజు వాదనలు వినిపించారు. పిటిషనర్‌ పురుషుడిగా జన్మించినా లింగమార్పిడి శస్త్రచికిత్సతో ట్రాన్స్‌జెండర్‌గా మారారన్నారు. ఎస్సై ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకునే క్రమంలో కేవలం పురుష, స్త్రీ లింగ ఐచ్ఛికాలే ఉన్నాయని ట్రాన్స్‌జెండర్‌ ఐచ్ఛికం లేదని చెప్పారు. దీంతో పిటిషనర్‌ స్త్రీగా పేర్కొంటూ ధరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రాథమిక పరీక్ష రాసి రెండు పేపర్లలో 35 శాతం మార్కులు పొందారన్నారు. తదనంతరం అధికారులు ఆమెను అనర్హురాలుగా ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించారని వివరించారు. పోలీస్‌ నియామక బోర్డు తరఫున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ పుట్టుకతో పరుషుడని, తర్వాత కాలంలో ట్రాన్స్‌జెండర్‌గా మారిన కారణంగా రిజర్వేషన్‌ కోరలేరని చెప్పారు. వివిధ కేటగిరీల కింద పేర్కొన్న విధంగా మార్కులు పొందలేదన్నారు. ట్రాన్స్‌జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


తీర్పులో ఏముందంటే..

ట్రాన్స్‌జెండర్లను సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వర్గంగా గుర్తిస్తూ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని పేర్కొంది. అయితే ఫలానా శాతం రిజర్వేషన్‌ కల్పించాలని స్పష్టంగా పేర్కొనలేదని గుర్తుచేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రిజర్వేషన్‌ కల్పించేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న రిజర్వేషన్‌ విధానం ద్వారా ఎస్సై పోస్టుల భర్తీ కోసం 2018 నవంబరు 1న పోలీసు నియామక బోర్డు నోటిఫికేషన్‌ ఇచ్చిందని తెలిపింది. దానిని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించలేమని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్రం తీసుకొచ్చిన ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ (హక్కుల రక్షణ) చట్టం-2019 ఉద్యోగ ప్రవేశాలలో అవకాశం కల్పిస్తుంది తప్పితే రిజర్వేషన్‌ కల్పించడం లేదని గుర్తుచేసింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోని అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. రిజర్వేషన్‌ కల్పించని కారణంగా ఎస్సై నోటిఫికేషన్‌ను చెల్లుబాటు కాదని ప్రకటించలేమని స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Updated Date - 2022-01-27T08:39:12+05:30 IST