అయ్యన్న జోలికెళ్లొద్దు

ABN , First Publish Date - 2022-07-01T08:37:46+05:30 IST

అయ్యన్న జోలికెళ్లొద్దు

అయ్యన్న జోలికెళ్లొద్దు

వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దు

ఏ కేసూ లేకుండా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు?

ఆయనపై నమోదైన కేసుల వివరాలు మా ముందుంచండి

పోలీసులకు హైకోర్టు ఆదేశం

విచారణ నేటికి వాయిదా


అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఏ కేసూ లేకుండా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. చట్టవిరుద్ధంగా వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఆయనపై కేసు నమోదైన పక్షంలో చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో అయ్యన్నపై నమోదైన కేసుల వివరాలను కోర్టు ముందు ఉంచాలని హోం శాఖను ఆదేశించింది. వాటి ఆధారంగా తగిన ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. చట్టవిరుద్ధంగా పోలీసులు తన వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకుంటున్నారని, రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు అందజేయడం లేదని పేర్కొంటూ అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోకుండా పోలీసులను నిలువరించాలని, ఎఫ్‌ఐఆర్‌ కాపీలు ఇచ్చేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆయన తరఫు న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌ ప్రతిపక్షానికి చెందిన నాయకుడు. జూన్‌ 15న జరిగిన చోడవరం మినీమహానాడులో ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఆయన నివాసం చుట్టూ తిరుగుతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. న్యాయపరంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేందుకు పిటిషనర్‌పై నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను కూడా పోలీసులు ఇవ్వడం లేదు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్‌పై తాము ఎలాంటి కేసులూ నమోదు చేయలేదని సీఐడీ తరఫు న్యాయవాది తెలిపారు. అయ్యన్నపై శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కాలేదని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర జిల్లాలోని కేసుల వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. సరైన కారణాలు పేర్కొనకుండా కోర్టును ఆశ్రయించారని.. చట్టబద్ధంగా నమోదైన కేసుల విషయంలో కూడా పోలీసు దర్యాప్తు నుంచి రక్షణ పొందేందుకు ఈ వ్యాజ్యం వేశారని.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వొద్దని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. కేసు నమోదు చేయకుండా పిటిషనర్‌ నివాసం చుట్టూ పోలీసులు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఇతర కేసుల విషయంలో వారు వెళ్లి ఉంటారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. అయ్యన్న తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన ఇతర ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, సెక్షన్‌ 41ఏ నిబంధనలు పాటించాలని, తదుపరి చర్యలు తీసుకోవద్దని పేర్కొందని గుర్తుచేశారు. ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రముఖ ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ఆ కథనాల ఆధారంగా వ్యాజ్యాలు ఎలా వేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పోలీసులకు స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-01T08:37:46+05:30 IST