హైకోర్టు ఆదేశాలు బుట్టదాఖలు

ABN , First Publish Date - 2022-05-27T08:49:57+05:30 IST

హైకోర్టు ఆదేశాలు బుట్టదాఖలు

హైకోర్టు ఆదేశాలు బుట్టదాఖలు

నిషేధ భూములపై అన్నీ సొంత నిర్ణయాలే

కమిటీలో జిల్లా జడ్జి లేకుండానే  ‘నిషేధ’ విముక్తి

జీవో 300నూ అమలు చేయని రెవెన్యూశాఖ


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నిషేధ భూముల విషయంలో రెవెన్యూశాఖ సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. హైకోర్టు ఆదేశాలనూ బుట్టదాఖలు చేస్తోంది. అనవసరంగా నిషేధ జాబితాలో చేర్చిన రైతులు, సామాన్యుల భూములకు విముక్తి కల్పించడం వేరు. కానీ, ప్రభుత్వ ప్రయోజనాలున్నాయని ఆ జాబితాలో చేర్చిన పెద్దల భూములకు కూడా యథేచ్ఛగా విముక్తి కల్పిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా లెక్కచేయకుండా...ఇక జిల్లా స్థాయిలోనే నిషేధ భూముల కేసులు పరిష్కరించుకోవాలంటూ సర్క్యులర్లు జారీ చేస్తోంది. ఇదంతా లోగడ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు, నాటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 300కు పూర్తి విరుద్ధమని అటు రెవెన్యూ, ఇటు న్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అధికారులు ఇవేవి పట్టించుకోకుండా 22(ఏ)1(ఈ) భూములను సైతం నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూములు, అసైన్డ్‌ చేసినవి, ప్రభుత్వ ప్రయోజనాలున్నవి, దేవదాయశాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా, ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22(ఏ)1 ప్రకారం ఆ భూములను నిషేధ భూముల జాబితాలో చేర్చారు. 22(ఏ)1(ఏ)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల ద్వారా నిషేధించిన భూములు ఉంచుతున్నారు. 22(ఏ)1(బి)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములు ఉంటాయు. 22(ఏ)1(సి)లో దేవదాయ, వక్ఫ్‌భూములు, 22(ఏ)1(డి)లో సీలింగ్‌ భూములు ఉంటాయి. 22(ఏ)1(ఈ)లో ప్రభుత్వ ఆసక్తి కలిగిన భూములు ఉంటాయి. 2013-15 కాలంలో పెద్ద  ఎత్తున భూములను నిషేధ జాబితాలో చేర్చినప్పుడు వివాదాలు వచ్చాయి. వీటిపై అనేక మంది హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన హైకోర్టు ధర్మాసనం 22(ఏ)1(ఈ) భూములపై విచారణ రాష్ట్రస్థాయి కమిటీనే చేపట్టాలని 2015 డిసెంబరు 23న తీర్పు ఇచ్చింది. ఆ కమిటీలో తప్పనిసరిగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి  సభ్యుడిగా ఉండేలా చూసుకోవాలని, అప్పుడే ఈ-కేటగిరీ కేసులను సెటిల్‌ చేయాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఆధారంగానే 2016లో నాటి ప్రభుత్వం జీవో 300ను జారీ చేసింది. నిషేధ జాబితాలో ఈ-కేటగిరీ కేసుల పరిష్కారానికి  భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నేతృత్వాన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఒకరు రిటైర్డ్‌ జిల్లా జడ్జి, మరొకరు సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారని జీవోలో పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన ఓ రిటైర్డ్‌ జిల్లా జడ్జిని కమిటీలో సభ్యునిగా నియమించారు. ఆయన విధుల్లో చేరిన అనతికాలంలోనే ఈ కమిటీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో రిటైర్డ్‌ జిల్లా జడ్జిని నియమించలేదు. అయినా, దాదాపు మూడేళ్లుగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి లేకుండానే ఈ-కేటగిరీ కేసులను పరిష్కరించేస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారమే ఈ మూడేళ్లలో 280కుపైగా కేసులపై నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. దీనిపై హైకోర్టులో రెవెన్యూ కేసులు చూసే ఓ న్యాయాధికారి లేఖ కూడా రాశారు.తప్పనిసరిగా కోర్టు ఆదేశాల మేరకే నడుచుకోవాలని స్పష్టం చేశారు. అయినా, అధికారులు తమ సొంత పంథాలోనే సాగుతున్నారు. ఇటీవల భారీగా చుక్కల, మాజీ సైనికుల, స్వాతంత్య్ర సమరయోధుల, రాజకీయ బాధితుల భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ-కేటగిరీ భూములను కూడా భారీగా నిషేధ జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు.


హైకోర్టు ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెబుతారు?

‘ప్రభుత్వ ప్రయోజనాలున్నాయనే విలువైన భూములను నిషేధ జాబితా ఈ-కేటగిరీలో ఉంచారు. వాటిని విడిపించుకునేందుకు అధికారపార్టీ నేతలు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు పెద్దలపై తీవ్రస్థాయి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. దీంతో జ్యుడీషియల్‌ అధికారి లేకుండానే ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇది తప్పు. హైకోర్టు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు? ఏ ప్రజాప్రయోజనాలతో ఆ భూములను నిషేధ జాబితాలో చేర్చారు? ఎవరి ప్రయోజనాల కోసం మళ్లీ వాటికి విముక్తి కల్పించాల్సి వచ్చిందో సరైన హేతుబద్ధత ఉండాలి. చట్టాలు, రూల్స్‌ తనకు వర్తించవన్నట్టుగా రెవెన్యూశాఖ వ్యవహరించడం తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఉంది’ అని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-27T08:49:57+05:30 IST