ఏఏ ఆలయాల్లో విగ్రహాలు అదృశ్యమయ్యాయి?

ABN , First Publish Date - 2021-01-22T12:38:20+05:30 IST

రాష్ట్రంలోని ఏఏ ఆలయాల్లో విగ్రహాలు అదృశ్యమయ్యాయనే వివరాలతో నివేదిక దాఖలుచేయాలని దేవాదాయ శాఖకు మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో...

ఏఏ ఆలయాల్లో విగ్రహాలు అదృశ్యమయ్యాయి?

దేవాదాయ శాఖను ప్రశ్నించిన హైకోర్టు

చెన్నై/ఐసిఎఫ్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏఏ ఆలయాల్లో విగ్రహాలు అదృశ్యమయ్యాయనే వివరాలతో  నివేదిక దాఖలుచేయాలని దేవాదాయ శాఖకు మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో వెంకట్రామన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో, హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల చరిత్ర, విగ్రహాల ప్రాచీనత, స్థిర చరాస్తుల వివరాలతో కూడిన డాక్యుమెంట్లు పరిరక్షించాలని, అయితే పలు ఆలయాల్లో డాక్యుమెంట్లు కనిపించడం లేదని, వాటిని సంబంధించిన వివరాలను దేవదాయ శాఖ అధికారులు సేకరించి న్యాయస్థానానికి తెలిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి జస్టిస్‌ సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారించింది. దేవాదాయ శాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది వెంకటేష్‌, బదులు పిటిషన్‌ దాఖలుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిని అంగీకరించిన ధర్మాసనం, ఏఏ ఆలయాల్లో విగ్రహాలు కనిపించలేదో వాటి వివరాలతో నివేదిక దాఖలుచేయాలని దేవాదాయ శాఖకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Updated Date - 2021-01-22T12:38:20+05:30 IST