వేగంగా కొనండి!

ABN , First Publish Date - 2021-12-07T08:00:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని హైకోర్టు సోమవారం పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీనికి సంబంధించి నిబంధనలు ఉంటే

వేగంగా కొనండి!

  • ధాన్యం సేకరణకు అన్ని చర్యలు తీసుకోండి..
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన
  • రాష్ట్రమే కొనాలని ఏ చట్టంలో ఉంది?
  • పిటిషనర్‌కు ధర్మాసనం సూటి ప్రశ్న 
  • 27 లక్షల టన్నులు సేకరించాం.. ఇంకా కొంటాం
  • హైకోర్టుకు విన్నవించిన అడ్వకేట్‌ జనరల్‌


హైదరాబాద్‌, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని హైకోర్టు సోమవారం పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీనికి సంబంధించి నిబంధనలు ఉంటే చెప్పాలని, ఆ నిబంధనల ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయాలని ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని, తాము చట్టాలు చేసే వాళ్లం కాదని చెప్పింది. అదే సమయంలో రైతుల నుంచి ధాన్యం సేకరించడానికి అన్నిరకాల అవకాశాలను పరిశీలించి, వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వరి కొనుగోళ్లు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బొమ్మగాని శ్రీకర్‌ అనే 21 ఏళ్ల విద్యార్థి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.


పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉప్పులూరి అభినవ్‌ కృష్ణ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం ఽవరి ధాన్యానికి రూ1,960 కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)గా నిర్ణయించగా, మిల్లర్లు రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. వర్షాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి రై తులకు ఏర్పడిందని ఆరోపించారు. వరి కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో దళారీలు లబ్ధి పొందుతున్నారని, రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనేలా ఆదేశాలు జారీ చేసి, రైతులను రక్షించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వరి కొనుగోళ్లు జరుగక ఇద్దరు రైతులు చనిపోయారని ప్రస్తావించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 27.07 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. పంట మొ త్తం అయిపోయే వరకు కొంటామని స్పష్టం చేశారు. కొనుగోళ్లకు సంబంధించి 4.54 లక్షల మంది రైతులకు రూ.2,800 కోట్లు చెల్లించామన్నారు. 6,439 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, జనవరి 22 దాకా కొంటామని చెప్పారు. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కా కముందే దాఖలైన ఈ పిటిషన్‌ అకాల పక్వమైనదని(ప్రీమెచ్యూర్‌) పేర్కొన్నారు.


యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ఇద్దరు రైతులు గుండెపోటుతో చనిపోయారని హైకోర్టుకు నివేదించారు. కనీస మద్దతు ఽధరపై చట్టం చేయడానికి తర్జన భర్జనలు కొనసాగుతున్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడంతో చట్టం చేయడం లేదని కేంద్రం చె బుతోందని, మరోవైపు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేసింది. ధాన్యం సేకరించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సూచించింది.  కౌం టర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-07T08:00:58+05:30 IST