కోర్టులతో దోబూచులా?

ABN , First Publish Date - 2022-01-26T08:17:34+05:30 IST

న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చేలా పెట్టిన వీడియోల తొలగింపు విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలు దోబూచులాడుతున్నాయని హైకోర్టు తీవ్ర అసహనం..

కోర్టులతో దోబూచులా?

మా ఉత్తర్వులకు వక్రభాష్యమా?

అభ్యంతరకర పోస్టులు తొలగించరా?

రిజిస్ట్రార్‌ జనరల్‌ కోరినా, సీబీఐ అడిగినా వీడియోలు తొలగించాల్సిందే

మీలో తప్పుడు సమాచారం ఎవరిచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాలి

సామాజిక మాధ్యమాలకు, దర్యాప్తు సంస్థకు హైకోర్టు హెచ్చరిక

కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు


అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చేలా పెట్టిన వీడియోల తొలగింపు విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలు దోబూచులాడుతున్నాయని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వివరాలు అందించిన 36 గంటల్లో సంబంధిత వీడియోలు తొలగించాలని తామిచ్చిన ఆదేశాలకు వక్రభాష్యాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఆదేశాలను సరైన స్పూర్తితో అమలు చేయడం లేదని పేర్కొంది. అభ్యంతరకర పోస్టులను తొలగించాలని సీబీఐ కోరితే ఎందుకు తొలగించలేదని ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమ సంస్థలను నిలదీసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న వీడియోల యూఆర్‌ఎల్‌ వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఉభయల్లో ఎవరు అందజేసినా అభ్యంతరకర వీడియోలను తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది.




యూఆర్‌ఎల్‌ వివరాలు అందజేసినా వీడియోలను బ్లాక్‌ చేయడం/తొలగించడం లేదని సీబీఐ.. తొలగించామని ఆయా సంస్థలు విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఇద్దరిలో ఎవరు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని తేలినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. సీబీఐ, సామాజిక మాధ్యమాలపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. కోర్టు ముందు ఉంచిన యుఆర్‌ఎల్‌ వివరాలను సామాజిక మాధ్యమ సంస్థలకు అందజేయాలని సీబీఐని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్‌, సీబీఐ ఇచ్చిన యూఆర్‌ఎల్‌ ఆధారంగా ఎన్ని వీడియోలు తొలగించారు.. మిగిలినవి తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందుంచాలని సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.




వారు పరారీలో ఉన్నట్లు ప్రకటించండి..


న్యాయవ్యవస్థ పట్ల, హైకోర్టు న్యాయమూర్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఐడీ సైబర్‌ క్రైమ్‌కు రెండు సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని.. స్వతంత్ర  సంస్థతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం, ఈ వ్యాఖ్యల వ్యవహారంలో కుట్ర ఉందేమో తేల్చాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇచ్చిన యూఆర్‌ఎల్‌ వివరాలు ఆధారంగా ఎప్పటికప్పుడు వీడియోలను తొలగించాలని సామాజిక మాధ్యమాలను, కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు రాగా సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో 17 మందిపై కేసు నమోదు చేశామని, వీరిలో 11మందిపై చార్జిషీటు దాఖలు చేశామని, మిగిలిన ఆరుగురు విదేశాల్లో ఉన్నారని వివరించారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పంచ్‌ ప్రభాకర్‌పై చార్జిషీటు దాఖలు చేస్తామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. విదేశాల్లో ఉన్నవారు పరారీలో ఉన్నట్లు ప్రకటించి చార్జిషీటు దాఖలు చేయాలని సూచించింది.




సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. తాజాగా మరో 8మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆ 8 మందిలో ముగ్గురి విషయంలో కేంద్రం నుంచి అనుమతి రావలసి ఉందని తెలిపారు. యూఆర్‌ఎల్‌ వివరాలు అందజేసినప్పటికీ సామాజిక మాధ్యమాలు ధూషణలకు సంబంధించిన వీడియోలను తొలగించేందుకు సహకరించడం లేదని.. మొత్తం 251 వివరాలు అందజేస్తే 190 బ్లాక్‌ చేశారని, మిగతా 61 వివరాల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. ట్విటర్‌కు 43 యూఆర్‌ఎల్‌ వివరాలు అందజేస్తే కేవలం 13 మాత్రమే తొలగించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.




ఆ హామీని ఎందుకు అమలు చేయలేదు?


ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలపై ధర్మాసనం మండిపడింది. వీడియోలకు సంబంధించిన వివరాలు అందజేస్తే 36 గంటల్లో తొలగిస్తామని కోర్టుకు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ట్విటర్‌ వ్యవహారం మరింత దారుణంగా ఉందని.. హైకోర్టు కోరినా, రిజిస్ట్రార్‌ జనరల్‌ కోరినా వీడియోలు తొలగించాల్సిందేనని గతంలోనే స్పష్టం చేశామని వ్యాఖ్యానించింది. ప్రతి సారీ న్యాయస్థానం ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ట్విటర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దత్తార్‌ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు ఉంటేనే వీడియోలు తొలగించాలని, కేంద్రం నోటిఫై చేసిన సంస్థ నుంచి అభ్యర్థన వస్తేనే తొలగించాలని సుప్రీంకోర్టు నిర్దేశించిందని, ఆ నోటిఫై సంస్థల పరిధిలోకి సీబీఐ రాదని తెలిపారు. యూట్యూబ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ పూవయ్య వాదనలు వినిపిస్తూ.. సీబీఐ అందజేసిన 160 యూఆర్‌ఎల్‌లలో 150 బ్లాక్‌ చేశామన్నారు. మరో 10 యూఆర్‌ఎల్స్‌ విషయంలో నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా వీడియోలోని ఏ భాగాన్ని తొలగించాలో టైంలైన్‌ ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశామని తెలిపారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇచ్చిన వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాలు వీడియోలను తొలగిస్తున్నాయని పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ తెలిపారు. అయితే  సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించి దర్యాప్తులో తేలిన వివరాల ఆధారంగా అభ్యంతరకర వీడియోలు తొలగింపునకు లేఖలు రాయాలని సూచించారు.

Updated Date - 2022-01-26T08:17:34+05:30 IST