జోరుగా గిరాకీ..

ABN , First Publish Date - 2022-05-25T06:21:08+05:30 IST

జిల్లాలో పెళ్లిళ్లు, శుభ కార్యాలు ఎక్కువగా ఉండడంతో గొర్రెలు, మేకలకు భారీ డిమాండ్‌ పెరిగింది. ఎక్కువ మంది సంతలకు వచ్చి కొనుగోలు చేయడంతో గతంలో కంటే వెయ్యి రూపాయల నుంచి 2వేల వరకు అధిక ధర పలుకుతున్నాయి. పెళ్లిళ్లకు కొనుగోలు చేసేవారు

జోరుగా గిరాకీ..
నవీపేట మండల కేంద్రంలో గల మేకల సంతలో జోరుగా మేకలు, గొర్రెల అమ్మకాలు

జిల్లాలో పెళ్లిళ్లు శుభకార్యాలు ఉండడంతో.. మేకలు, గొర్రెలకు భారీగా

పెరిగిన డిమాండ్‌ ్త సరాసరి రూ.7వేల నుంచి రూ.10 వేల మధ్య అమ్మకాలు

నిజామాబాద్‌, మే 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పెళ్లిళ్లు, శుభ కార్యాలు ఎక్కువగా ఉండడంతో గొర్రెలు, మేకలకు భారీ డిమాండ్‌ పెరిగింది. ఎక్కువ మంది సంతలకు వచ్చి కొనుగోలు చేయడంతో గతంలో కంటే వెయ్యి రూపాయల నుంచి 2వేల వరకు అధిక ధర పలుకుతున్నాయి. పెళ్లిళ్లకు కొనుగోలు చేసేవారు పది కిలోల పైన ఉన్న మేకలు, గొర్రెలు కొనుగోలు చేయడంతో.. జిల్లాలోని సంతల్లో ఒక్కోటి రూ. 10వేల వరకు ధర పలికింది. వీరే కాకుండా ఆంధ్రా నుంచి వచ్చిన కొనుగోలుదారులు సైతం జిల్లా మార్కెట్‌లో గొర్రెలను కొనడంతో.. వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపారు.

సంతలో జోరుగా అమ్మకాలు

జిల్లాలోని నవీపేట, నందిపేటతో పాటు ఇతర సంతల్లో మేకలు, గొర్రె లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. జిల్లాతో పాటు నిర్మల్‌, అదిలాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని నాందేడ్‌, పర్బనీ, ఔరంగబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా గొర్రెలు, మేకలను వ్యాపారులు ఈ సంతలకు తీసుకొస్తున్నారు. జిల్లాలోని ప్రధాన సంతల్లో ప్రతీ వారం అమ్మకాలు చేస్తున్నారు. నవీపేట సంతలో ప్రతీవారం పదివేలకు పైగా గొర్రెలు, మేకల అమ్మకాలు జరుగుతున్నాయి. గడిచిన కొన్ని వారాలుగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో వీటి అమ్మకాలు పెరిగాయి. శుభకార్యాల్లో మటన్‌ కూడా ఎక్కువ మంది తినడానికి ఇష్టపడడంతో.. వీటి ధరలు కూడా భారీగా పెరిగాయి. జిల్లాలో మేకలు, గొర్రెల పెంపకం ఉన్నా.. అవి సరిపోకపోవడంతో వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వీటిని కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇక్కడి ప్రధాన సంతల్లో వాటిని విక్రయిస్తున్నారు. నవీపేట సంత గత కొన్నేళ్లుగా గొర్రెల, మేకలకు అడ్డాగా మారడంతో ఇతర ప్రాంతాలవారు కూడా ఈ సంతకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. 

ఈ వారంలో జోరుగా శుభకార్యాలు

జిల్లాలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఈ వారంలో ఎక్కువగా ఉండడంతో గొర్రెలు, మేకలకు ఎక్కువ ధరలు పలికాయి. ఈ సంతలకు శుభకార్యాలు చేసేవారితో పాటు వ్యాపారులు, మటన్‌ వ్యాపారులు కూడా వచ్చి కొనుగోలు చేయడంతో ధరలు బాగా పెరిగాయి. నవీపేట మార్కెట్‌లో శనివారం పది కిలోలు ఉన్న మేక ధర 7వేలు వరకు పలికింది. గత రెండు నెలల క్రితం ఆరువేలు పలికిన మేకలకు ప్రస్తుతం 7వేల వరకు ధర పలుకుతోంది. కిలో లెక్క చూసుకున్న ఒక్కో మేకకు వెయ్యి నుంచి 2వేల వరకు పెరిగినట్లు వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు చెబుతున్నారు. ఈ సంతలో 15కిలోల వరకు ఉన్న మేకకు పదివేల వరకు ధర పెట్టి కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ సంతల్లో మేకలు, గొర్రెలకు గతంకంటే ఎక్కువ ధరలు పలికాయి. గొర్రెల రేట్లు సరాసరి 6వేల నుంచి 10వేల మధ్య అమ్మకాలు జరిగాయి. మటన్‌ ధరలు కిలో 700ల నుంచి 750 మధ్య అమ్మకాలు చేస్తుండడంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. ఇక్కడి సంతలకు ఇతర జిల్లాల వారు వచ్చి కొనుగోలు చేయడంతో ఎక్కువ ధరలకు వ్యాపారులు అమ్మకాలను చేస్తున్నారు. ధరలు పెరిగిన శుభకార్యాల్లో, పెళ్లిళ్లో మటన్‌ వినియోగం ఉండడంతో కొనుగోళ్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలోని మటన్‌ వ్యాపారులు కూడా ధరలు పెరగడంతో ఎక్కువ రేట్లు పెంచి అమ్మకాలను చేస్తున్నారు.

పెళ్లిళ్లతో గొర్రెలు, మేకలకు ధరలు బాగా పెరిగాయి.. 

: రమేష్‌, స్థానిక వ్యాపారి, జగిత్యాల 

పెళ్ళిళ్లు, శుభకార్యాలు ఉండడంతో మేకలు, గొర్రెలకు డిమాండ్‌ పెరిగింది. ఎక్కువ మంది కొనుగోలు చేస్తుండడం వల్ల ధరలు బాగా పెరిగాయి. గత నెల క్రితం రూ.6వేలకు వచ్చిన మేకలు, గొర్రెలు ప్రస్తుతం రూ.7వేలకు పైగా ధర పలుకుతుంది. తప్పనిసరి కావడంతో ధరలు ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నాం.

మేకలు, గొ ర్రెలకు డిమాండ్‌ ఎక్కవగా ఉంది..

: సత్తార్‌, వ్యాపారి, జాల్నా, మహారాష్ట్ర 

నవీపేట సంతలో మేకలు, గొర్రెలకు డిమాండ్‌ బాగా పెరిగింది. గత ఐదేళ్లుగా మేకలు, గొర్రెలను తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నాం. గతంతో పోల్చుకుంటే ఎక్కువ మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ సంతకు వంద మేకలు, గొర్రెలను తీసుకువస్తే అమ్ముడుపోయాయి. గతంలో 2 వారాలు ఉన్న అమ్ముడయ్యేవికావు.

Updated Date - 2022-05-25T06:21:08+05:30 IST