ప్రైవేటు ఫీ‘జులుం’

ABN , First Publish Date - 2021-02-28T06:13:13+05:30 IST

కరోనా కాలం నుంచి బయట పడుతూ కాస్తంత ఉపశమనం పొందుతున్న తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఫీ‘జులుం’ కంటి నిండా నిద్రలేకుండా చేస్తోంది. కుదేలైన పేద, మధ్య తరగతి బతుకులకు పాఠశాలల ఫీజులు మరింత భారంగా మారుతున్నాయి.

ప్రైవేటు ఫీ‘జులుం’

నెల నెలా ట్యూషన్‌ ఫీజు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వ జీవో
ఏడాది మొత్తం చెల్లించాలంటున్న యాజమాన్యాలు
హాస్టల్‌ ఫీజులూ పూర్తిగా చెల్లించాలని హుకుం
రెండు నెలలకే మొత్తం ఫీజు ఎలా... అంటున్న తల్లిదండ్రులు


వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌
కరోనా కాలం నుంచి బయట పడుతూ కాస్తంత ఉపశమనం పొందుతున్న తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఫీ‘జులుం’ కంటి నిండా నిద్రలేకుండా చేస్తోంది.  కుదేలైన పేద, మధ్య తరగతి బతుకులకు పాఠశాలల ఫీజులు మరింత భారంగా మారుతున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులకు స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ డేటా పేరుతో పాఠశాలల ఫీజుకంటే ఎక్కువే ఖర్చు చేశామని, ఇప్పుడు మళ్లీ మొత్తం ఫీజులు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిందేనని తల్లిదండ్రులు వాపోతున్నారు. 6, 7, 8 తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రైవేటు పాఠశాలలు మాత్రం మార్చి 1వ తేదీ నుంచి వీరికి తరగతులు నిర్వహించేందుకే మొగ్గు చూపాయి.

జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలనే ఎస్‌ఎంఎ్‌సలు తల్లిదండ్రులకు శనివారం నాడే పంపించారు.   ప్రతీనెలా ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్‌ 46ను విడుదల చేసింది. కానీ ప్రైవేటు విద్యాసంస్థల్లో జీవో నెంబర్‌ 46 జాడే కనిపించడం లేదు. పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే.. జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ తదితర కళాశాలల అనుబంధ హాస్టళ్లకు పూర్తి ఫీజు చెల్లించాలని ఆయా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. మొత్తంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రైవేటు యాజమాన్యాల ఫీజుల దోపిడి యథేచ్ఛగా కొనసాగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.

హాస్టళ్లలో అడ్డంగా....
జూనియర్‌, డిగ్రీ కళాశాలలతోపాటు పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ తదితర వృత్తివిద్యా కళాశాలల్లో అనుబంధంగా నిర్వహిస్తున్న హాస్టళ్లలో ఫీజులను అడ్డంగా దోచుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల కాలానికి రూ.15వేలు చెల్లించాలని లేదంటే పిల్లలను ఇంటి దగ్గర నుంచే పంపించాలని బెదిరిస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే హాస్టల్‌లోకి ప్రవేశం లేదంటే ఇంటి దారి పట్టాల్సిందేనని ఆయా యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్వాన్ని రెండు నెలల కాలానికే వసూల చేయడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇష్టారాజ్యంగా ఫీజులు
ఇప్పటికే 9, 10, ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి  ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. తాజాగా 6, 7, 8 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫీజులు చెల్లించాలని పదేపదే ఎస్‌ఎంఎ్‌సల ద్వారా వార్నింగ్‌లు ఇచ్చినంత పనిచేస్తున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు. రెండు నెలలకే మొత్తం ఫీజు ఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఎప్పటినుంచో ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నామని అడ్డంగా వాదిస్తున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.

జీవో 46...
కరోనా మహమ్మారితో 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజుల విషయమై  2020 ఏప్రిల్‌ 21న జీవో నెంబర్‌ 46ను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ పాఠశాల విద్యాశాఖ తరఫున ఉత్తర్వులు జారీ చేశారు. నెలనెలా ట్యూషన్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాలని ఈ జీవోలు స్పష్టం చేశారు. ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆ ఉత్వర్వులో హెచ్చరించారు.

జీవో ప్రకారమే వసూలు చేయాలి
- డీఈవో కె.నారాయణరెడ్డి

ప్రభుత్వం జీవో 46 ద్వారా ప్రతి నెల ట్యూషన్‌ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ ఇతర ఫీజులను వసూలు చేయడాన్ని కరోనా మహమ్మారి కాలంలో నిషేధించింది. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి వసూలు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము.

ఫీజులు కట్టే పరిస్థితులు లేవు
 - డి.స్వరూప, కాశీబుగ్గ

కరోనాతో చేసే ప నులు కూడా దొరకడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసులకు డబ్బులు బాగానే ఖర్చు చేశా ము. ఇప్పుడు మళ్లీ ఫీజుల చెల్లించడానికి డబ్బులు లేవు. అయినా రెండు నెలలకే సంవత్సరం ఫీజు కట్టాలంటున్నారు. రెండు నెలలు చదువు చెబితే సంవత్సరం ఫీజు ఎలా కట్టాలి. సగం ఫీజే తీసుకోవాలి.

ప్రైవేటు యాజమాన్యాలు ఆలోచించాలి
- యాంసాని శ్రవణ్‌, మట్టెవాడ

కరోనా కష్టకాలంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆలోచన చేయాలి. పూర్తి ఫీజులు కాకుండా కొంత మేర తగ్గించి వసూలు చేయాలి. ప్రభుత్వ జీవో ప్రకారం ఫీజులు నెల నెలా వసూలు చేస్తే బాగుంటుంది. ప్రైవేటు యాజమాన్యాలు సగటు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను అర్ధం చేసుకోవాలి.

Updated Date - 2021-02-28T06:13:13+05:30 IST