శనగాకులతో పోషకాల కూర

ABN , First Publish Date - 2022-02-05T05:30:00+05:30 IST

అత్యధిక పోషకాలు కలిగిన పప్పు ధాన్యాలలో శనగలు ఒకటి. గోధుమ, వరిలాంటి ధాన్యాలకు ఇచ్చిన ప్రాధాన్యతని మనవాళ్లు మొదటి నుంచి శనగలకు ఇవ్వకపోవడం వల్ల దాని సుగుణాలను మనం సగం కూడా పొందలేకపోతున్నాం.

శనగాకులతో పోషకాల కూర

అత్యధిక పోషకాలు కలిగిన పప్పు ధాన్యాలలో శనగలు ఒకటి. గోధుమ, వరిలాంటి ధాన్యాలకు ఇచ్చిన ప్రాధాన్యతని మనవాళ్లు మొదటి నుంచి శనగలకు ఇవ్వకపోవడం వల్ల దాని సుగుణాలను మనం సగం కూడా పొందలేకపోతున్నాం. 


మంచు కురిసే కాలంలో శనగ మొక్కలమీద సన్నని బట్ట పరిచి రాత్రంతా ఉంచితే ఆ మంచుకు తడిసి, ఆకులలో రసం ఆ బట్టకు పట్టుకుంటుంది. దాన్ని ఇవతలకు తీసి పిండితే పుల్లటి రసం వస్తుంది. దీన్ని శనగపులుసు అంటారు. ఈ శనగపులుసు పుల్లగా ఉంటుంది. పులుపు రుచి కలిగినప్పటికీ వాతం చేయదు. పైత్యం చేయదు. జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తదోషాలను పోగొడుతుంది. కొన్ని ఔషధాలకు ఈ శనగ పులుసుని అనుపానంగా ఇస్తారు. క్యాబేజీ, పాలకూరల్లో కన్నా శనగ ఆకుల్లో అత్యధిక మినరల్స్‌ ఉంటాయి. దాని పులుపుదనానికి అవే కారణంగా చెప్తారు. శనగ ఆకుల్ని చింత చిగురులాగా కూర, పప్పు, పులుసు, పచ్చడి ఇలా మనం రకరకాల వంటకాలను వండుకోవచ్చు. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్‌) తక్కువగా అందుతున్న ప్రాంతాల్లో శనగ ఆకుల్ని కలగలపుగా వాడించటం వలన ఎక్కువ బలకరమైన ఆహారం అందించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 


ప్రయోజనాలివి...

శనగ ఆకులు ఆరోగ్యానికి మంచివి! కేన్సర్‌ నివారక గుణాలు వీటికున్నాయి. ఎముక పుష్టినిస్తాయి. గుండెకు బలాన్నిస్తాయి. కొవ్వుని తగ్గిస్తాయి. రక్తపుష్టినిస్తాయి. ఈ ఆకుల్ని ముద్దగా చేసి సున్నిపిండితో కలిపి శరీరానికి పట్టిస్తే చర్మం గరుకుబారటం తగ్గి మృదువుగానూ కాంతివంతంగానూ అవుతుంది. 


ఇలా వండుకోవాలి...

నలమహారాజు పాకదర్పణంలో శనగ ఆకులతో కూర వండుకునే పద్ధతి వివరంగా చెప్పాడు. లేత శనగ ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడగి తరగాలి. ఒక భాండీలో కొత్త నెయ్యి కొద్దిగా వేసి వెల్లుల్లి, ఇంగువ దోరగా వేయించి తరిగిన శనగ ఆకుల్ని అందులో వేసి మెత్తగా ఉడికేదాకా మగ్గనివ్వాలి. బూడిద గుమ్మడి వడియాలు, పెసర లేదా మినప అప్పడాల ముక్కలు ఇందులో వేసి మరికొద్దిసేపు కలియబెడుతూ వేగనివ్వాలి. రుచికోసం మీకు కావలసిన సుగంధ ద్రవ్యాలు కలుపుకుని హాట్‌ ప్యాక్‌ లోకి తీసుకోవాలి. ఈ శనగ ఆకుల కూర రుచికరమైనది, స్త్రీపురుషులకు అనుకూలమైనది, పైత్యాన్ని, కఫాన్ని పోగొడుతుంది...అని వివరించాడు నలుడు. 


చరకుడు శనగ మొక్కకు రక్త స్రావాన్ని అరికట్టే గుణం ఉందని చెప్పాడు. కాబట్టి, రక్తాన్ని పలచబరిచే మందులు వాడుతున్న వారు శనగలను, శనగ ఆకులను వైద్యుడి సలహా మీద తినాలి. 


ఈ రోజుల్లో శనగ ఆకులు ఎక్కడ దొరుకుతాయని నిరాశపడకండి! నానబెట్టిన శనగలను ఏదైనా పళ్లెంలోనో బుట్టలోనో పరిచి తడుపుతూ ఉంటే మొలకలొస్తాయి. 10 నుంచి 15 రోజులపాటు ఇలా సంప్రోక్షణం చేస్తే కూరవండుకోవటానికి అనువుగా శనగ ఆకులు పెరుగుతాయి. ‘ద’ ఆకారంలో ఉండే ఎర్ర లేదా చిర్రిశనగలనే ఇలా మొలకెత్తించండి. గుండ్రంగా, తెల్లగా లావుగా ఉండే బొంబాయి శనగలకు ఈ గుణాలు లేవు. 

గంగరాజు అరుణదేవి

Updated Date - 2022-02-05T05:30:00+05:30 IST