గ్యాస్ లీకేజీపై హైపవర్ కమిటీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-07T03:56:08+05:30 IST

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై హై పవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. లీక్ అయ్యింది గ్యాస్ కాదని, ఆవిరి అని వెల్లడించారు. ఎల్జీ పాలిమార్స్ ఇచ్చిన

గ్యాస్ లీకేజీపై హైపవర్ కమిటీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

విజయవాడ: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై హై పవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. లీక్ అయ్యింది గ్యాస్ కాదని, ఆవిరి అని వెల్లడించారు. ఎల్జీ పాలిమార్స్ ఇచ్చిన సమాధానాలను నాలుగు వాంగ్మూలాలుగా పొందుపరిచామన్నారు. యాక్సిడెంట్‌కు అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 329 పేజీల ఫైనల్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి తాము అందించామని తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఆవిరి బయటకు వచ్చిందన్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆ ట్యాంక్‌లో పైప్‌ లైన్లను మార్చారని, అప్పుడే ప్రమాదానికి బీజం పడిందని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఏప్రిల్ 24వ తేదీన ట్యాంక్‌లో పాలిమర్ అధికంగా ఉందని పరిశ్రమ సిబ్బంది గుర్తించారన్నారు. అయితే దానిని వారు సీరియస్‌గా తీసుకోలేదని, సీరియస్‌గా తీసుకుని ఉంటే ఘటన జరిగేది కాదని నీరబ్ వివరించారు. ఫ్యాక్టరీలో 36 మాన్యూవల్ సైరన్‌లు ఉన్నా ఏ ఒక్క సిబ్బంది కూడా వాటిని ఆన్ చేయలేదన్నారు. లీకైన్ ఆవిరిని ఆపేందుకు ఉపయోగించే కెమికల్స్‌ను కూడా వాడలేదన్నారు. 


కెమికల్ ప్రభావిత ప్రాంతాలను మూడు జోన్లుగా నిర్ణయించినట్లు నీరబ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించామన్నారు. ఎల్జీ పాలిమార్స్ వంటి పరిశ్రమలు నివాస ప్రాంతాల్లో ఉండకూడదని సూచించినట్లు తెలిపారు. స్టైరిన్ గ్యాస్ ఫ్యాక్టరీ నుండి లీక్ అవ్వడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వివిధ పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధ్యయనం చేయాలని సీఎం కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డు కేంద్రం, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా యాక్సిడెంట్స్ దర్యాప్తునకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ప్రమాదాలను ఎలా నివారించాలనేదానిపై మరో నివేదిక సమర్పిస్తామని చెలిపారు. 


కాగా, ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై సంవత్సరం పాటు అధ్యయనం చేస్తున్నామని నీరబ్ తెలిపారు. ఆరోగ్యంపై ఐసీఎంఆర్ అధ్యయనం చేయించాలని సూచించామన్నారు. పర్యావరణం, జంతుజాలంపై అధ్యయనానికి బయో డైవర్సిటీ కమిటీ వేయాలని కోరామన్నారు. విశాఖలో అనేక ప్రమాదకరమైన రసాయనాలు ఉన్న పరిశ్రమలు ఉన్నాయని, వాటిపైనా కూడా దృష్టి సారించాలని రిపోర్ట్‌లో సూచించామన్నారు.

Updated Date - 2020-07-07T03:56:08+05:30 IST