భగ్గుమన్న ‘కోనసీమ’

ABN , First Publish Date - 2022-05-25T07:48:11+05:30 IST

అది అమలాపురం పట్టణం... ఎటు చూసినా పోలీసులు... ఎక్కడికక్కడ బారికేడ్లతో కట్టడి.... అక్కడ తుఫాను ముందు ప్రశాంతత...

భగ్గుమన్న ‘కోనసీమ’

జిల్లా పేరు మార్పుపై ఆందోళన హింసాత్మకం

రాళ్ల దాడులు, దహనాలతో అట్టుడికిన అమలాపురం

భారీగా లాఠీచార్జ్‌.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు

కలెక్టరేట్‌ వరకు ర్యాలీకి ‘జేఏసీ’ పిలుపు.. ఉదయం నుంచే పోలీసుల అదుపులో పట్టణం

ఎస్పీ ఆధ్వర్యాన 500 మంది మోహరింపు.. మధ్యాహ్నం వరకు రోడ్డెక్కకుండా కట్టుదిట్టం

3 గంటలకు ఒక్కసారిగా మారిన పరిస్థితి.. వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువకులు

లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు.. పోలీసులపై రాళ్ల వర్షం... టెంటుకు నిప్పు

2 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేటు బస్సుకు అగ్గి.. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీశ్‌ ఇళ్లకు నిప్పు

రాళ్లదాడిలో ఎస్పీకి గాయాలు... బిక్కుబిక్కుమన్న పోలీసులు.. బాష్పవాయు ప్రయోగం

చెదరగొట్టేందుకు రబ్బరు బుల్లెట్ల వాడకం.. మూడున్నర గంటలపాటు హైటెన్షన్‌


పైరు పచ్చలు, గోదావరి గలగలలతో ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవైన కోనసీమ అట్టుడికింది. పోలీసుల కట్టడి, లాఠీచార్జీ, తిరగబడ్డ ఆందోళనకారులు, రాళ్లవర్షం, వాహనాలకు నిప్పు, అధికార పార్టీ నేతల గృహాల దహనాలు, రబ్బరు బుల్లెట్లతో కాల్పులతో రణరంగంగా మారింది. ‘కోనసీమ జిల్లా’ పేరు మార్పును వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళన అనూహ్య  మలుపు తిరిగింది. ‘కోనసీమ జిల్లా’ కేంద్రం అమలాపురం రణరంగాన్ని తలపించింది. 


(అమలాపురం/కాకినాడ - ఆంధ్రజ్యోతి): అది అమలాపురం పట్టణం... ఎటు చూసినా పోలీసులు... ఎక్కడికక్కడ బారికేడ్లతో కట్టడి.... అక్కడ తుఫాను ముందు ప్రశాంతత...

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలు కావొస్తుండగా, వీధులన్నీ జనంతో పోటెత్తాయి. ‘జై కోనసీమ’ నినాదాలు మిన్నంటాయి. పోలీసులు కట్టడి పెంచారు. ఆందోళనకారులు ‘అడుగు ముందుకే’ అన్నారు. చూస్తుండగానే అగ్గి రాజుకుంది. అమలాపురం అట్టుడికి పోయింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా... అమలాపురం కేంద్రంగా ‘కోనసీమ జిల్లా’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే... రాష్ట్ర ప్రభుత్వం దీని పేరును ‘బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా’గా మార్చాలని నిర్ణయించింది. ఈనెల 18వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రజలకు సూచించింది. ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ రోజు నుంచే పేరు మార్పుపై జిల్లాలో నిరసనలు మొదలయ్యాయి. కోనసీమ జిల్లా పేరు యథాతథంగా కొనసాగించాలంటూ పార్టీలకు అతీతంగా ఎస్సీయేతర కులాల వారు  కోనసీమ జిల్లా సాధన సమితిగా ఏర్పడ్డారు.


మంగళవారం మధ్యాహ్నం అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్‌ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి పేరు మార్చొద్దంటూ కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అమలాపురం పట్టణంలో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. ర్యాలీ జరగకుండా అడ్డుకునేందుకు అమలాపురం పట్టణంలో సెక్షన్‌ 30, 144 కింద ఆంక్షలు విధించారు. మంగళవారం ఎస్పీ కేఎ్‌సఎ్‌సవీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సుమారు 500 మంది పోలీసులతో అమలాపురాన్ని దిగ్బంధనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు ర్యాలీ జరగకుండా అడ్డుకోవాలని వచ్చిన సూచనల మేరకు... పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుంచే దుకాణాలను మూసివేయించారు. మధ్యాహ్నం వరకు గస్తీ తిరుగుతూ ఎవరినీ రోడ్డుపై ఉండకుండా చేశారు. 



ఒక్కసారిగా మారిన పరిస్థితి... 

అప్పటిదాకా తుఫాను ముందు ప్రశాంతతలా ఉన్న పరిస్థితి... మధ్యాహ్నం 3 తర్వాత మారిపోయింది. శుభకలశం దగ్గరి నుంచి తొలి ర్యాలీ మొదలైంది. మిగిలిన రహదారుల నుంచి ఒక్కసారిగా వేలాదిమంది ఆందోళనకారులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని వచ్చారు. ముమ్మిడివరం గేట్‌ సెంటర్‌కు చేరుకునే సరికి ర్యాలీలో వేలమంది చేరారు. నినాదాలు చేసుకుంటూ వెళుతున్న నిరసనకారులను చైతన్య టెక్నో స్కూలు దగ్గర పోలీసులు రోప్‌తో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచే పరిస్థితి అదుపు తప్పింది. ఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీలు వై.మాధవ రెడ్డి, మసూమ్‌బాషాలతోపాటు భారీగా మోహరించిన పోలీసులు ఒక్కసారిగా నిరసనకారులపై లాఠీచార్జీ చేశారు. దొరికిన వారిని దొరికినట్టు చితగొట్టారు. అక్కడి నుంచి చెల్లాచెదురైన వేలాది నిరసకారులు పలు వీధుల నుంచి పలు మార్గాల ద్వారా కాటన్‌పార్కు వద్దనున్న వంతెనపైనుంచి నల్లవంతెన వద్దనున్న కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఈసారి ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు కకావికలమయ్యారు. రాళ్ల దాడి నుంచి కాపాడుకునేందుకు వాహనాలమాటున దాక్కున్నారు. ఈలోగా మరో ప్రదర్శన నల్లవంతెన వద్దకు చేరుకుంది. అక్కడ వీరిని అడ్డుకునేందుకు పోలీసులు వజ్ర వాహనంతో సహా పలు వాహనాలను అడ్డంగా నిలిపారు. నిరసనకారులు మరోసారి రాళ్ల వర్షం కురిపించారు. దీంతో డీఎస్పీ గన్‌మెన్‌, ఒక ఎస్‌ఐ, పలువురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వజ్ర వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. అడ్డంగా ఉంచిన వాహనాలను తొలగించుకుని నిరసనకారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎస్పీ సుబ్బారెడ్డి, అడిషనల్‌ ఎస్పీ లతామాధురితోపాటు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడే ఉన్నారు. అంతా కలెక్టరేట్‌లోకి వెళ్లిపోయి గేట్లు వేశారు. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. అక్కడే ఉన్న కమ్యూనిటీ హాలు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసు టెంట్‌కు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను తరలించేందుకు కలెక్టరేట్‌ ఎదురుగా సిద్ధంచేసిన ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ బస్సుకు నిప్పంటించారు. కలెక్టరేట్‌లో ఉన్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. రాళ్లదాడిలో ఎస్సీ సుబ్బారెడి తలకు గాయమైంది. డీఎస్పీ మాధవరెడ్డి సొమ్మసిల్లిపోయారు.


యథేచ్ఛగా దహనాలు...

బ్యాంకు కాలనీలో ఉన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటిని వందలమంది నిరసనకారులు చుట్టుముట్టారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆందోళనకారులు హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివసిస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ కుమార్‌ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. కింది భాగంలో ఉన్న ఆఫీసుతోపాటు ఇంటికి నిప్పంటించారు. ఎర్రవంతెన వద్ద ప్రయాణికులతో వెళుతున్న పల్లెవెలుగు, సూపర్‌ లగ్జరీ బస్సులను ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. ఈ రెండు బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు, రబ్బరు  బుల్లెట్లను ప్రయోగించారు. ఒకదశలో పోలీసులు కూడా నిరసనకారులపైకి రాళ్లు విసిరారు. రాళ్లదాడిలో సుమారు 20 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఉద్రిక్తతలు సాయంత్రం 6.30 గంటల దాకా కొనసాగాయి.


కట్టడిని దాటి...

జిల్లా పేరును యథాతథంగా కొనసాగించాలంటూ ఈనెల 19 నుంచే ‘కోనసీమ జిల్లా పేరు సాధన సమితి’ పేరుతో కొందరు యువకులతో జేఏసీ ఏర్పాటైంది. ఎక్కువ మంది 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వారే. వాట్సా్‌పలో సమాచారం చేరవేసుకుంటూ ఉద్యమాలకు సిద్ధమయ్యారు. సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వాలనుకున్నా... పోలీసులు 144 సెక్షన్‌ పేరుతో ఇళ్లు కదలనీయలేదు. ఇలా తమను కట్టడి చేసి ఇబ్బంది పెడుతున్నారనే ఆగ్రహంతో మంగళవారం కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వారి ఇంటింటికీ వెళ్లి గృహనిర్బంధం చేశారు. దీనిని ముందుగానే ఊహించిన కొందరు అమలాపురం పట్టణంలో ముందురోజే పలు హోటళ్లలో, బంధువుల ఇళ్లల్లో  బస చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అమలాపురంలోని పలు కూడళ్లలో ప్రత్యక్షమయ్యారు. 


నేతల్లో అలజడి

ఊహించని పరిణామాలతో కోనసీమ జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బిక్కుబిక్కుమని గడిపారు. మంత్రితోపాటు మరో ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టడంతో ఆగ్రహావేశాలు జ్వాలలా వ్యాపించి తమను చుట్టుముడతాయనే భయంతో కొందరు కుటుంబ సభ్యులతో కాకినాడ, రాజమహేంద్రవరంలలో హోటళ్లకు వెళ్లారు. అటు పోలీసులు సైతం ముందు జాగ్రత్త చర్యగా నేతల ఇళ్లవద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.


అమలాపురంలో మంగళవారం రోజంతా..

ఉదయం 7.00: కలెక్టరేట్‌తోపాటు అమలాపురం అంతటా 144 సెక్షన్‌ విధింపు

10.00 : పట్టణం చుట్టూ పోలీసుల మోహరింపు.. బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు

11.00 : పట్టణమంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం

2.30 : జేఏసీ ర్యాలీ విఫలమైందన్న ఆనందంలో పోలీసులు

3.00 : అనూహ్యంగా మూడు వేల మంది అమలాపురంలోకి ప్రవేశం.   

           అడ్డుకునేందుకు పోలీసుల లాఠీ చార్జీ.

3.30 : జిల్లా ఎస్పీ వాహనంపై దాడి.. పోలీసుల వజ్ర వాహనంపై దాడి

4.30 : కలెక్టరేట్‌ వద్ద బస్సుకు నిప్పు

4.40 : వరుసగా పోలీసులు, వారి వాహనాలపై రాళ్ల దాడి

5.30 : మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి, ఫర్నిచర్‌కు నిప్పు

6.10 : విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయంపైనా దాడి

6.20 : ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ ఇంటిపై దాడి

7.30 అదనపు బలగాల రాక

8.00 :  ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆగమనం

9.30 : పరిస్థితిని అదుపులోకి తెచ్చిన బలగాలు

Updated Date - 2022-05-25T07:48:11+05:30 IST