కొల్లాపూర్‌లో హైటెన్షన్‌..!

ABN , First Publish Date - 2022-06-27T07:47:16+05:30 IST

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది...

కొల్లాపూర్‌లో హైటెన్షన్‌..!

జూపల్లి, బీరం.. బహిరంగ చర్చ భగ్నం

జూపల్లి ఇంటికి బయల్దేరిన హర్షవర్ధన్‌ 

అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు

ఆయన అనుచరుల ఆందోళనతో ఉద్రిక్తత

అప్పులు చేశా.. తప్పులు చేయలే: జూపల్లి

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులతో జూపల్లి కృష్ణారావు కుమ్మక్కు: బీరం


నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. కొల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధి, వ్యక్తిగత అంశాలపై బీరం, జూపల్లి తీవ్ర విమర్శలు చేసుకుంటున్న విషయంలో తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటలకు బహిరంగ చర్చ జరగాల్సి ఉండగా, కొల్లాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌ విసరగా, నీ ఇంటికే వస్తానంటూ బీరం ప్రతి సవాల్‌ చేశారు. బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వాలంటూ ఇరువర్గాల నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకోగా,  రెండు రోజుల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ మనోహర్‌ వాటిని తిరస్కరించారు. ఆదివారం కొల్లాపూర్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తేల్చి చెప్పారు. పోలీసు బలగాలను మోహరించారు. బీరం, జూపల్లి కృష్ణారావు వర్గీయులు కొల్లాపూర్‌ చేరుకోకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, వేర్వేరు మార్గాల్లో వారు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం 10.15 గంటల సమయంలో ఎమ్మెల్యే బీరం తన అనుచరులతో కలిసి జూపల్లి ఇంటికి బయల్దేరారు. ఆంక్షలను ఉల్లంఘించడంతో ఏఎస్పీ రామేశ్వర్‌, డీఎస్పీ మోహన్‌కుమార్‌ వెంటనే అక్కడకు చేరుకొని.. బీరంను అదుపులోకి తీసుకొన్నారు. పోలీస్‌ వాహనంలో ఆయనను తరలించే సమయంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ఆయన అనుచరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఇంటి నుంచి సింగోటం క్రాస్‌ రోడ్డు వరకు తరలించడానికే గంటన్నర సమయం పట్టింది.  తొలుత ఆయనను పెంట్లవెల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నామని చెప్పిన పోలీసులు.. చివరకు రహస్య మార్గంలో వనపర్తి జిల్లాలోని పెబ్బేరు తరలించారు. ఈ ఘటనతో  సాయంత్రం వరకు కొల్లాపూర్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. 


కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు: బీరం

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కుమ్మక్కయారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. వివాదాస్పద భూములను తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకోవడం నిజం కాదా? అని జూపల్లిని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ పాలనలోనే కొల్లాపూర్‌ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, జాతీయ రహదారి మంజూరు, గోపాల్‌దిన్నె కెనాల్‌ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చానని చెప్పారు. కానీ, టీఆర్‌ఎ్‌సను అభాసుపాలు చేసేలా జూపల్లి  కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


బీరంపై పరువు నష్టం దావా: జూపల్లి

తప్పుడు ఆరోపణలు చేసి, తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిపై పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్‌ కేసులు వేస్తానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బీరం అరెస్టు తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను అప్పులు చేశాను గానీ, ఎప్పుడూ తప్పులు చేయలేదని చెప్పారు. బహిరంగ చర్చకు రాకుండా హర్షవర్ధన్‌రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తన స్థాయి తగ్గించుకొని బహిరంగ చర్చకు వచ్చానని, ఇక దిగజారనని, ఎమ్మెల్యేలా తనది తప్పించుకునే నైజం కాదని అన్నారు. నియోజకవర్గ రైతుల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర తనదని, 18 ఏళ్లుగా మచ్చ లేని చరిత్ర తనదని పేర్కొన్నారు. తాను టీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-27T07:47:16+05:30 IST