ప్రత్యక్ష బోధనా తరగతులు వద్దు

ABN , First Publish Date - 2022-01-13T13:42:28+05:30 IST

దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో 10, 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా తరగతులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టు సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా

ప్రత్యక్ష బోధనా తరగతులు వద్దు

                          - సర్కారుకు హైకోర్టు సూచన


అడయార్‌(చెన్నై): దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో 10, 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా తరగతులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టు సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా తరగతులు లేకుండా, కేవలం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలివ్వాలని కోరుతూ తిరునల్వేలికి చెందిన న్యాయవాది అబ్దుల్‌ వహాబుద్దీన్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ల సమయంలో అన్ని పాఠశాలలను మూసివేసి, ఆన్‌లైన్‌లోనే బోధించారు. కానీ, కరోనా థర్డ్‌వేవ్‌ చాలా ఉధృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అనేక ఆంక్షలను అమలు చేస్తోంది. కానీ, 10, 11, 12 తరగతులకు మాత్రం ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తుంది. దీనివల్ల పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు కరోనా వైరస్‌ సులంభగా సోకే ప్రమాదం ఉంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలను పూర్తిగా మూసివేసి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్‌ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఎల్‌కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు స్కూల్స్‌ మూసివేసినట్టు ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ ఆర్‌.షణ్ముగ సుందరం చెప్పారు. అయితే, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు పాఠశాలలకు రావాల్సిందిగా కోరామని, ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్ననిబంధన లేదన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై పాఠశాలలే తుది నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం విద్యా విధానంలోనే స్పష్టం చేసిందని చెప్పారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు ధర్మాసనం.. పైమూడు తరగతుల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యక్ష బోధనా తరగతులు నిర్వహించకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Updated Date - 2022-01-13T13:42:28+05:30 IST