అత్యధిక వాయు కాలుష్యం ఢిల్లీలోనే!

ABN , First Publish Date - 2022-08-18T10:06:38+05:30 IST

గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్య (పీఎం2.5) తీవ్రత భారీగా పెరిగిపోతున్న 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది.

అత్యధిక వాయు కాలుష్యం ఢిల్లీలోనే!

ప్రపంచంలోనే అధిక పీఎం 2.5 స్థాయులు


ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కాలుష్య 

నగరాలు 20 ఉంటే.. 18 భారత్‌లోనే

న్యూఢిల్లీ, ఆగస్టు 17: గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్య (పీఎం2.5) తీవ్రత భారీగా పెరిగిపోతున్న 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది. 2010-2019 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 7వేల నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన ‘హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ బుధవారం ఈ సర్వే వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లోని పీఎం2.5 సగటు స్థాయిలను పరిశీలిస్తే.. ఢిల్లీలోనే అత్యంత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. పీఎం2.5 కాలుష్యం కారణంగా 2019లో 7239 నగరాల్లో 17 లక్షల మరణాలు సంభవించాయని పరిశోధకులు వెల్లడించారు. ఆసియా, ఆఫ్రికా, తూర్పు, మధ్య ఐరోపాలో పీఎం2.5 కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ‘‘2010-19 మధ్య సర్వే నిర్వహించిన ఈ 7239 నగరాల్లో పీఎం2.5 తీవ్రత అత్యధికంగా ఉన్న 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయి. మిగిలిన రెండు నగరాలు ఇండోనేషియాలో ఉన్నాయి’’ అని వివరించారు. పీఎం2.5 అత్యధిక స్థాయిలో పెరుగుతున్న 50 నగరాల్లో 41 భారత్‌లోనే ఉన్నాయని, 9 ఇండోనేషియాలో ఉన్నాయని వెల్లడించారు. పీఎం2.5 కాలుష్యం బాగా తగ్గుతున్న 20 నగరాలూ చైనాలోనే ఉన్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-08-18T10:06:38+05:30 IST