ltrScrptTheme3

ఎత్తు తగ్గుతున్నారు..

Oct 23 2021 @ 23:24PM

1990 తరువాత పుట్టినవారిలో ఈ పరిణామం

ఇందులో బాలికలే ఎక్కువ

నిర్ధారించిన పరిశోధనలు 

జంక్‌ఫుడ్‌, శారీరక శ్రమ లేకపోవడమే కారణం అంటున్న వైద్యనిపుణులు

ఎన్‌ఎఫ్‌హెచ్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి

   

ఆజానుబాహులుగా పేరొందిన భారతీయులకు ఇకపై ఆ పేరు దూరం కానుందా....? జన్యుపరమైన లోపాలను మనమే స్వాగతిస్తున్నామా.. అనే సందేహాలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇవే నిజమంటూ పలు సర్వే నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. భారతీయుల సరాసరి ఎత్తు తగ్గిపోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పౌష్టికాహారంపై నిర్లక్ష్యం, తీవ్రమైన ఒత్తిడి వంటి కారణాలతో గతంలో కంటే ఎత్తు తగ్గిపోతున్నారని కూడా తన నివేదికలో పేర్కొంది. ఇందులో అధికంగా బాలికలే ఉన్నారని తెలిపింది. 


గుంటూరు(తూర్పు), అక్టోబరు23: భారతీయుల సరాసరి ఎత్తు తగ్గిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా తల్లిదండ్రులు సరాసరి ఎత్తుకు అనుగుణంగానే పిల్లల శారీరక పెరుగుదల ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల సరాసరి ఎత్తును అందుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ ప్రభావం పిల్లల ఎముకలపై ఎక్కువుగా ఉంటోంది. దీంతో వాటి ఎదుగుదల ఆగిపోవడంతో ఎత్తుపై ఆ ప్రభావం పడుతోంది. అలాగే చాలామంది నిరుపేద కుటుంబాల్లో సరైన పౌష్టికాహారం అందక వారిలో కూడా ఎదుగుదల నిలిచిపోతోంది. ఈ క్రమంలో అందరూ ఎత్తుకు దూరమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. 


 ఏమిటీ సర్వే..?

ప్రపంచదేశాల్లోని ప్రజలపై హైట్స్‌ ఆఫ్‌ ది పీపుల్‌ అనే అంశంపై నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ అనే కేంద్ర సంస్థ సర్వే చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సోషల్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం వారు ఈ ఏడాది సెప్టెంబరు చివరిలో భారతీయుల్లో శారీరక పెరుగుదల హెచ్చుతగ్గులపై పరిశోధనలు నిర్వహించారు. 1998-99, 2005-16, 2015-20 సంవత్సరాలను మూడు భాగాలుగా చేసి, ఆయా ఏడాది నాటికి 15-25 సంవతరాల వయస్సు ఉన్నవారి శారీరక ఎత్తుపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలు కులాలు, పేద, ధనిక వర్గాలు అనే సంబంధం లేకుండా జరిగాయి. ఈ సర్వే ప్రకారం 1998-99 మధ్యలో 15-25 సంవత్సరాల వయస్సు కలవారి ఎత్తుకంటే, 2005-16 మధ్యలో ఉన్నవారి ఎదుగుదల తక్కువుగా కనిపించింది. వీరికంటే 2015- 20 మధ్యలో ఉన్నవారి ఎత్తు మరింత తగ్గడాన్ని గమనించారు. అంతేగాక సరాసరి ఎత్తు దాదాపు రెండు సెంటీమీటర్లు కోల్పోయారని నిర్ధారించారు. ముఖ్యంగా ఈ లోపం అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువుగా కనిపించింది. అలాగే ఆదివాసీ మహిళల్లో జన్యుపరమైన లోపాలు, సరైన పౌష్టికాహారం అందకపోవడం వంటి కారణాలతో ఎత్తు పెరగడం లేదని సర్వే నిర్ధారించింది. ప్రపంచదేశాల్లో సరాసరి పెరగుతూ ఉండటం, భారతీయుల్లో మాత్రం శారీకక ఎత్తు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది అనే విషయాన్ని  తన నివేదికలో పేర్కొంది. 


  ఆహారపు అలవాట్లే కారణమా...?

1990 తరువాత పుట్టినవారిలో ఎత్తు ఎదుగుదల తక్కువుగా కనింపిచడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, శారీరకశ్రమ లేకపోవడమే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం యాంత్రిక జీవితంలో ఎక్కువమంది ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడిపోయారు. ఈ ఫుడ్‌ వల్ల ఆరోగ్యంతోపాటు, శారీరక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. ఫాస్ట్‌ఫుడ్‌ నిల్వ ఉంచడానికి వెనిగర్‌ అనే ద్రావాణాన్ని వాడతుంటారు. ఇది శరీరంపై, ఎముకలపై తీవ్ర దుష్ప్రప్రభావాన్ని చూపుతుంది.   అంతేగాక చిన్నవయస్సు లోనే పాఠశాలలు, పరీక్షలు, ర్యాంకులు వంటి ఒత్తిళ్లతో వారు శారీరక ఎత్తుకు దూరమవుతున్నారు.


  పేరుకుపోతున్న వ్యర్ధాలు..

ఫాస్ట్‌ఫుడ్‌, ఇతర ఆహారం వల్ల నేటితరంలో అన్ని వయస్సులవారి శరీరాల్లో వ్యర్ధాలు పేరకుపోయాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలు సరాసరిన రోజుకు 30 నుంచి 50 గ్రాముల వరకు చాక్లెట్‌లను తింటున్నారని ఒక అంచనా. వీటి ప్రభావం ఎముకల ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఫాస్ట్‌ఫుడ్‌లలో వాడే మైదా, నూనె వంటివాటితో విష, కొంకి, బద్దెపురుగులు, ఎలికపాములు వంటివి శరీరంలోకి చేరుతున్నాయి. ఇవి కూడా ఎముకల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంటాయి.


 ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

సాధారణంగా 21 సంవత్సరాల తరువాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఈలోపు ఆహార అలవాట్లలో జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు వారి వయస్సుకు అనుగుణంగా పెరుగుతుంటారు. అలాగే మహిళల్లో కూడా ఎముకలు బలోపేతం అవుతాయి.

- మనిషి ఎత్తు పెరగడంలో ఎముకలు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. 

-ఎముకల ధృఢత్వానికి ఆహారంలో కాల్షియం, విటమిన్‌ డి ఉండేలా చూసుకోవాలి.

- కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, వాల్‌నట్స్‌, బాదం, జీడిపప్పు, వేడిచేసిన కూరగాయలు, ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉంచాలి.

- అలాగే శారీరకశ్రమ కూడా తప్పనిసరి. ఆటలు, వాకింగ్‌, వ్యాయామం వంటివి చిన్నతనం నుంచే అలవాటు చేయాలి.  

- అలాగే పిల్లలను మానసిక ఒత్తిడినుంచి దూరం చేయాలి.

- స్మార్ట్‌ఫోనులకు, ట్యాబ్‌లకు దూరంగా ఉంచాలి.

                                               


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.