హైటెన్షన్‌!

ABN , First Publish Date - 2021-01-25T07:29:12+05:30 IST

ఇప్పుడు... అందరిచూపూ సుప్రీంకోర్టు వైపే! పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా...

హైటెన్షన్‌!

  • మండే పంచాయితీ
  • అందరి చూపూ సుప్రీం వైపు
  • ‘పంచాయితీ’ తేలుతుందా?
  • మధ్యాహ్నం ధర్మాసనం ముందుకు!
  • అప్పటిదాకా ‘రాజ్యాంగ ప్రతిష్టంభనే’
  • నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
  • ఎక్కడా ఏర్పాట్లు చేయని కలెక్టర్లు
  • ఆర్‌ఓలనే నియమించలేదు
  • నోటిఫికేషన్‌కు విలువివ్వని వైనం
  • ఈ సంక్షోభం దేశంలోనే తొలిసారి


ఇది కనీవినీ ఎరుగని సంక్షోభం! దేశంలోనే తొలిసారిగా తలెత్తిన సందర్భం! రాజ్యాంగానికే ఎదురవుతున్న సవాల్‌! ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌పై తొలిసారిగా ఏర్పడిన ‘ప్రతిష్టంభన’! హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌తో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం... తొలివిడతగా సోమవారం నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలి. కానీ... జిల్లాల్లో ఎక్కడా చడీచప్పుడు లేదు! కలెక్టర్లెవరూ దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టలేదు. ఈ విషయంలో రాష్ట్రం రెండుగా ‘చీలిపోయింది’. ఎన్నికల కమిషన్‌, ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిబంధనల మేరకు నడుచుకోవాలనుకుంటున్న వర్గం ఒకవైపు! రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలు, అధికార పార్టీ మరోవైపు! పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది? ఎప్పుడు దీనిపై స్పష్టత వస్తుంది? ఈ రెండు ప్రశ్నలే కీలకం! వాటికి సమాధానం ఎలా ఉన్నప్పటికీ... నామినేషన్ల స్వీకరణకు వీలుగా సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు నోటీసులు జారీ చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అంటే... రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం మొదలైనట్లే!


(అమరావతి/న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి): ఇప్పుడు... అందరిచూపూ సుప్రీంకోర్టు వైపే! పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా... లేదా? సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? ‘జరిపి తీరాల్సిందే’ అని చెబితే ప్రభుత్వం ఏమంటుంది? ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారా? లేక... ‘వ్యాక్సిన్‌ వేసే దాకా ఎన్నికల్లో పాల్గొనం’ అనే చెబుతారా? ఎడతెగని ఉత్కంఠ! పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇది మధ్యాహ్నం ధర్మాసనం ముందుకు రావొచ్చునని భావిస్తున్నారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపాల్సి ఉండింది. అయితే... ఆదివారం దీనిని  జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌  రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు మార్చారు. ఈ బెంచ్‌ ముందు ఉన్న కేసుల జాబితాలో 39వ నంబరు ఇచ్చారు.  హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఇదే ధర్మాసనం విచారణ జరపనుంది. దీనికి కేసుల వరుసలో 40వ నంబరు ఇచ్చారు. ఈ రెండు పిటిషన్లను కలిపే ధర్మాసనం విచారించనుంది.


మధ్యాహ్నం వరకు మాటేమిటి?

రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ సుప్రీం ధర్మాసనం ముందుకు సోమవారం మధ్యాహ్నం వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై సుప్రీం నిర్ణయం వెలువడేదాకా... హైకోర్టు తీర్పు అమలులో ఉన్నట్లే. అంటే, సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు తొలివిడత పోలింగ్‌ జరిగే పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలి. దీనికి తగిన నోటీసులు ఇవ్వాలి. కానీ... రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరగలేదు. జి ల్లాల్లో దీనిపై పూర్తి స్తబ్ధత నెలకొంది. ‘పైనుంచి’ వచ్చి న ఆదేశాల మేరకు నడుచుకుంటున్న జిల్లా అధికారు లు... ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ గురించి తమ కు తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనా నామినేషన్‌ ప్రక్రియ జరగకపోవడం, సిబ్బంది సహకరించకపోవడంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఎక్కడా ఇలా జరిగి ఉండదని అభిప్రాయపడుతున్నారు. 


కలెక్టర్లదే బాధ్యత!

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసి... రిటర్నింగ్‌ అధికారులను నియమించాల్సింది జిల్లా కలెక్టర్లే. ఎస్‌ఈసీ ఆదేశాలను పక్కనపెట్టి... ప్రభుత్వ ‘ఆదేశాల’ కోసం ఎదురు చూస్తున్న అధికారులు రిటర్నింగ్‌ అధికారులనే నియమించలేదు. ఇప్పటికే ఎస్‌ఈసీ ఆదేశాలు ఉన్నందున... ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టకపోతే కచ్చితంగా కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య కలెక్టర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీలు సోమవారం మధ్యాహ్నం వరకు బెంచ్‌ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ కొద్ది గంటలు ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించకపోయినా... రాజ్యాంగబద్ధ విధుల నిర్వహణలో విఫలమైనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని, ఇప్పటికే కేరళతో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన ఇలాంటి తరహా కేసుల్లో ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన తీర్పులున్నాయని న్యాయ నిపుణుల్లో ఒక వర్గం బలంగా నమ్ముతోంది. ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని భావిస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు కొందరు మరో అడుగు ముందుకేసి సుప్రీం తీర్పు ఎన్నికల నిర్వహణకు అనుకూలమైనా తాము సహకరించేది లేదని ప్రకటనలు చేస్తున్నారు. తాము సహకరించకుండా నామినేషన్‌ ప్రక్రియ ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో గవర్నర్‌ కూడా మౌనంగా ఉండటంతో... సుప్రీం తీర్పు ఇప్పుడు కీలకంగా మారింది.

Updated Date - 2021-01-25T07:29:12+05:30 IST