హైటెన్షన్‌!

Published: Thu, 19 May 2022 23:43:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైటెన్షన్‌!బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్న పోలీసులు (ఫైల్‌)


త్వరలో జిల్లాకు రానున్న కార్నల్‌ ఉగ్రనిందితులు 

ఇప్పటికే రహస్యంగా నిఘా బృందాల దర్యాప్తు 

లొకేషన్‌ ఆధారంగా ఆయుధాల అప్పగింతపై ఆరా

ఉగ్రవాదులతో జిల్లా లింకులపై ఉత్కంఠ 

అప్రమత్తమవుతున్న జిల్లా పోలీసులు 

ఆదిలాబాద్‌, మే19 ఆంధ్రజ్యోతి): పాకిస్తాన్‌ నుంచి ఆదిలాబాద్‌కు మారణాయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని తరలిస్తుండగా హర్యానా రాష్ట్రంలోని కార్నల్‌ పోలీసులకు నలుగురు అనుమానిత ఉగ్రవాదులు ఈ నెల 5న పట్టుబడిన విషయం తెలిసిందే. పక్షం రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన అక్కడి పోలీసులు పాకిస్తాన్‌లో ఉంటూ ఉగ్రకార్యకలాపాలు కొనసాగిస్తున్న ఖలిస్తాని ఉగ్రవాది రిందాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లా పోలీసు లు మరింత అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే న్యాయస్థానం అనుమతితో భూపేంద్రసింగ్‌, పర్మేందర్‌సింగ్‌లను విచారించిన పోలీసులు తిరిగి జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించారు. మిగిలిన ఇద్దరు అమాన్‌దీప్‌సింగ్‌, గురుప్రీత్‌సింగ్‌లను కోర్టు అనుమతితో త్వరలోనే జిల్లాకు తీసుకొచ్చేందుకు కార్నల్‌ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాలో పలు ఉగ్రవాద సంబంధిత సంఘటనలు చోటు చేసుకోవడంతో భయాందోళన కనిపిస్తోంది. అయితే ఉగ్రవాదుల రాకతో జిల్లాలో ఉగ్రమూలాలు ఎక్కడ బయట పడుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఉగ్రమూకలు చిచ్చుపెట్టే అవకాశాలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం, నిఘా వర్గాలు మొత్తం ఆదిలాబాద్‌ జిల్లా వైపే చూస్తుంది. అసలు ఏం జరుగుతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసుల విచారణలో నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడి కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై మరింత నిఘాను పెంచారు.

లొకేషన్‌ పాయింట్‌ ఎక్కడ..?

కార్నల్‌ పోలీసులకు పట్టుబడిన నలుగురు ఉగ్రవాదుల వద్ద దొరికిన లొకేషన్‌ పాయింట్‌ జిల్లాలో ఎక్కడ ఉందన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌ సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రలోని నాందేడ్‌, యవత్‌మాల్‌, కిన్వట్‌ ప్రాంతాలకు జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు సాగుతాయి. ఇక్కడి నుంచే ఆయుధాలను తరలించేందుకు జిల్లా లొకేషన్‌ను పెట్టారా లేక సేఫ్‌జోన్‌గా గుర్తించే జిల్లాను ఎంచుకున్నారా అనే దానిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి నుంచే దక్షిణాధికా రాష్ర్టాలకు ఆయుధాల సరఫరాకు పథకం వేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఉగ్రవాదుల వద్ద లొకేషన్‌ మ్యాప్‌ను గుర్తించిన పోలీసులు, నిఘా వర్గాలు దానాధారంగానే రహస్యంగా దర్యాప్తును చేపట్టాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెల్‌ బృందాలు రంగంలోకి దిగి రహస్య నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే ఉగ్రవాదులను జిల్లాకు తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  

నిఘా పెంచిన పోలీసులు...

పట్టుబడిన నిందితులకు పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడి కావడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై మరింత నిఘాను పెంచారు. పక్షం రోజులుగా జిల్లాలోని అనుమానిత ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతాలను బాంబు స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గుడిహత్నూర్‌, ఇచ్చోడ, నేరడిగొండ, జైనథ్‌ మండల పరిధిలోని దాబాహోటళ్లపై నిఘా సారించారు. జిల్లాలో ఉగ్రవాదుల లొకేషన్‌ మ్యాప్‌ ఎక్కడ చూపుతుంది, వారితో తరచుగా టచ్‌లో ఉంటున్నది ఎవరు అనే దానిపై దర్యాప్తు జరగనుంది. జిల్లా కేంద్రం నుంచి వంద కిలో మీటర్ల దూర ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. లొకేషన్‌ మ్యాప్‌ పాయింట్‌ ఆధారంగానే జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. జిల్లాతో నాందేడ్‌, నాగ్‌పూర్‌, యవత్‌మాల్‌, కిన్వట్‌ తదితర ప్రాంతాలకు ఎక్కువగా సత్సంబంధాలు ఉండడంతో వారి కదలికలపై ఇరు రాష్ర్టాలలో నిఘా సారిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా మీదుగానే నిషేదిత పదార్థాలతోపాటు ఇతర మారణాయుధాలు కూడా సరఫరా అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ర్టాలకు భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలను సరఫరా చేసేందుకు టెర్రరిస్టులు ప్లాన్‌ చేసినట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి తెలంగాణతో పాటు మహారాష్ట్ర,జార్ఖాండ్‌ రాష్ర్టాలకు సెంటర్‌ పాయింట్‌గా ఉంటుంది. జిల్లా మీదుగానే ఉత్తర, దక్షిణ రాష్ర్టాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 44వ జాతీయ రహదారి, అలాగే రైల్వే లైన్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌ నుంచి ఉత్తర దక్షిణాధి రాష్ర్టాలకు రైలు మార్గం ద్వారా ప్రయాణం చేసే వీలుంది. 

సమాచారం లేదు..

- ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ, ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌ జిల్లాకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలిస్తుండగా పట్టుబడిన ఉగ్ర నిందితులు త్వరలో జిల్లాకు వస్తున్నారన్న దాని పై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. వారి లొకేషన్‌ మ్యాప్‌లో జిల్లా పేరు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి ఉగ్రవాదుల ఆనవాళ్లు కూడా లేవు. వార్త కథనాల ద్వారా తెలుసుకోవడమే తప్ప అధికారిక సమాచారం లేదు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.