మఠం భూములు కాజేసేందుకు కుట్ర

ABN , First Publish Date - 2020-11-29T06:10:54+05:30 IST

రాఘవేంద్రస్వామి మఠం భూములను కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ఆరోపించారు.

మఠం భూములు కాజేసేందుకు కుట్ర
విలేకరులతో మాట్లాడుతున్న తిక్కారెడ్డి, సోమిశెట్టి

  1. విక్రయానికి అనుమతి ఇవ్వడం దారుణం
  2. టీడీపీ జిల్లా నాయకుల ధ్వజం


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 28: రాఘవేంద్రస్వామి మఠం భూములను కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ఆరోపించారు. శనివారం కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక, తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 5 వేల ఎకరాల మఠం భూములు ఉన్నాయన్నారు. వీటిపై సీఎం జగన్‌ కన్ను పడిందని ఆరోపించారు. తెలంగాణలోని 250 ఎకరాలు విక్రయిం చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. దీన్ని ఉపసంహరించుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. భక్తిభావంతో భూములు మఠానికి విరాళంగా ఇస్తే.. వాటిని అమ్ముకునేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. వివిధ మార్గాల ద్వారా తనతో పాటు అనుచరులకు ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి.. ప్రస్తుతం దేవాలయాల ఆదాయంపై కన్ను పడిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల భూములను అమ్మేందుకు చేసిన యత్నాలను టీడీపీతో పాటు ఇతర పార్టీలు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రాఘవేంద్రస్వామి మఠం భూములకు విక్రయించేందుకు అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. దేవాలయాల ఆస్తులు అమ్మితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, భవిష్యత్తులో విరాళాలు ఇచ్చే వారు కరువైపోతారని, దీన్ని సీఎం గ్రహించాలని హితవు పలికారు. ఆలయాల ఆస్తులను కాజేయాలన్న దుర్బుద్ధి కలిగితే పతనం కాక తప్పదని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు దేవాలయాల అభివృద్ధి రూ.కోట్లు ఇచ్చారన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. పుష్కరాల్లో తన అనుచరులకు కోట్లు పంచి పెట్టేందుకే పనులను చేపట్టారని ఆరోపించారు. ఘాట్ల వద్ద భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి చూస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. సమావేశంలో తెలుగు మహిళ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌, సత్రం రామక్రిష్ణుడు, సలీం బాషా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T06:10:54+05:30 IST