బస్సెక్కితే బాదుడే!

ABN , First Publish Date - 2022-07-01T06:27:20+05:30 IST

ఆర్టీసీ/పీటీడీ ప్రయాణికులపై ఫ్యూయల్‌ సెస్సు పేరిట మరోసారి భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

బస్సెక్కితే బాదుడే!
పల్లెవెలుగు బస్సు

ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెంపు

ఈసారి ఫ్యూయల్‌ సెస్సు రూపేణా భారం

కనిష్ఠంగా రూ.ఐదు నుంచి సర్వీస్‌, దూరాన్ని బట్టి రూ.140 వరకూ విధింపు 

నేటి నుంచే అమలు 


అనకాపల్లి, జూన్‌ 30:

ఆర్టీసీ/పీటీడీ ప్రయాణికులపై ఫ్యూయల్‌ సెస్సు పేరిట మరోసారి భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.    పాలకులు తీసుకున్న తాజా నిర్ణయంతో బస్సు సర్వీసు, దూరాన్నిబట్టి కనిష్ఠంగా రూ.ఐదు, గరిష్ఠంగా రూ.140  చెల్లించాలి. దీంతో ఆర్టీసీ బస్సు ప్రయాణం మరింత భారం అవుతుందని జనం గగ్గోలు పెడుతున్నారు. 

రాష్ట్ర ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ‘బాదుడే బాదుడు’ కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఇళ్ల పన్నులు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ చార్జీల పెంపుతోపాటు కొత్తగా చెత్తపన్ను విధించిన విధించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు ప్రయాణికులపై మరోసారి బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఈసారి ఫ్యూయల్‌ సెస్సు పేరుతో  చార్జీలను పెంచేస్తున్నది. పెరిగిన చార్జీలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు బస్సు సర్వీసును బట్టి (దూరంతో సంబంధం లేకుండా) రూ.2, రూ.5, రూ.10 చొప్పున డీజిల్‌ సెస్సు వుంది. ఇకపై దూరాన్నిబట్టి  డీజిల్‌ సెస్సు పెరుగుతుంది. పల్లెవెలుగు సర్వీసులకు ఐదు కిలోమీటర్ల వరకు ఫ్యూయల్‌ సెస్సు పెంచకపోవడంతో టిక్కెట్‌ ఽధరలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ తరువాత కిలోమీటర్లనుబట్టి చార్జీ కనిష్ఠంగా ఐదు రూపాయల నుంచి గరిష్ఠంగా 20 రూపాయల వరకు పెరగనున్నది. ఆలా్ట్ర డీలక్స్‌కు 20 కిలోమీటర్ల వరకు ఎటువంటి పెంపు లేదు. ఆ తరువాత పది నుంచి గరిష్ఠంగా 120 రూపాయల వరకూ పెంచారు. అలాగే సూపర్‌లగ్జరీ, అమరావతి సర్వీస్‌లకు 55 కిలోమీటర్ల వరకు సెస్సు పెంచలేదు. ఆ తరువాత పది నుంచి 120 రూపాయల వరకు సెస్సు విధించారు. ఇంద్ర, గరుడ సర్వీస్‌లకు 35 కిలోమీటర్ల వరకు, నైట్‌ రైడర్‌కు 45 కి.మీ. వరకు, వెన్నెలకు 45 కిలోమీటర్ల వరకు గతంలో వున్న కనీస ఫ్యూయల్‌ సెస్సును మాత్రమే వసూలు చేస్తారు. అక్కడ నుంచి గరిష్ఠంగా రూ.140 వరకూ వసూలు చేయనున్నారు. 

అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి నుంచి 185 బస్సులు నడుపుతున్నారు. వీటిలో పల్లెవెలుగు, మెట్రో, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్‌లు, ఆలా్ట్ర డీలక్స్‌ బస్సులు ఉన్నాయి. ప్రతిరోజు రెండు డిపోల పరిధిలో సుమారు 7 వేల కిలోమీటర్ల దూరం తిరుగుతాయి. రోజుకు రూ.22 లక్షలు ఆదాయం చేకూరుతుంది. పెరిగిన డీజిల్‌పై సెస్సు కారణంగా అనకాపల్లి జిల్లాలో ప్రయాణికులపై రోజుకు రూ.44 వేల అదనపు భారం పడనుంది. ఉదాహరణకు అనకాపల్లి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు ఇప్పటి వరకు పల్లెవెలుగు బస్సు చార్జీ రూ.70. డీజిల్‌ సెస్సు విధించిన తరువాత  రూ.85కు పెరుగుతుంది. అనకాపల్లి నుంచి విజయనగరానికి ఇప్పటి వరకు రూ.70 వుండగా, కొత్త చార్జీల ప్రకారం రూ.85 చెల్సించాల్సి ఉంటుంది. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు  రూ.70 నుంచి రూ.80కి,  పలాస ఎక్స్‌ప్రెస్‌ చార్జీ రూ.249 నుంచి రూ.290కి పెరుగుతుంది. 

దూరాన్నిబట్టి సెస్సు బాదుడు 

విశాఖ రీజియన్‌ పరిధిలో ఏడు డిపోలకు చెందిన 750 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇందులో 600 బస్సులు నగర పరిధిలోనే తిరుగుతున్నాయి. మరో 25 బడి బస్సులు. మిగిలిన 125 బస్సులు విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌, భీమవరం, రాజోలు, భద్రాచలం, ఖమ్మం, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, బరంపురం, గుణుపూర్‌ వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించే వారిపై ఫ్యూయల్‌ సెస్సు పేరిట అదనపు భారం పడనున్నది. ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి ఏ ప్రాంతానికి వెళ్లినా ఫ్యూయల్‌ సెస్సు రూ.5 నుంచి రూ.15 వరకు వుంది. ఇప్పుడు దూరాన్ని బట్టి పెంచాలని నిర్ణయించడంతో కనిష్ఠంగా రూ.20, గరిష్ఠంగా రూ.140  పెరగనున్నది. విశాఖ-రాజమండ్రి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకు ఫ్యూయల్‌ సెస్సును రూ.10 నుంచి రూ.35కు, ఆలా్ట్ర డీలక్స్‌కు రూ.10 నుంచి రూ.45కు పెరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే విశాఖ-విజయనగరం ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌కు రూ.10 నుంచి రూ.25కు, ఆలా్ట్ర డీలక్స్‌కు రూ.10 నుంచి రూ.30కు పెరుగుతుందని లెక్కలు కట్టారు. శ్రీకాకుళం ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌కు రూ.10 నుంచి రూ.25కు, ఆలా్ట్ర డీలక్స్‌కు 10 నుంచి 35 రూపాయలకు పెరిగే అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2022-07-01T06:27:20+05:30 IST