బైపాస్ పక్కన పార్క్ చేసిన కారులో ఎవరో ఉన్నట్టు అనిపించి వెళ్లాడు.. అక్కడకు వెళ్లగా.. 16ఏళ్ల అబ్బాయికి ఎదురైందో ఊహించని పరిణామం..!

ABN , First Publish Date - 2021-11-05T18:10:20+05:30 IST

బైపాస్ పక్కన పార్క్ చేసిన..

బైపాస్ పక్కన పార్క్ చేసిన కారులో ఎవరో ఉన్నట్టు అనిపించి వెళ్లాడు.. అక్కడకు వెళ్లగా.. 16ఏళ్ల అబ్బాయికి ఎదురైందో ఊహించని పరిణామం..!
హిమాన్షు శర్మ

ఇంటర్‌నెట్‌డెస్క్: బైపాస్ పక్కన పార్క్ చేసిన తమ కారులో ఎవరో ఉన్నట్టు ఆ అబ్బాయికి అనిపించి అటుగా వెళ్లాడు. అక్కడికి వెళ్తే అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


జిల్లాలోని కొల్యారి గ్రామానికి చెందిన జమ్నాలాల్ శర్మకు హిమాన్షు శర్మ అనే 16ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ఆ పిల్లాడు స్థానిక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దీపావళి కారణంగా గురువారం పాఠశాలకు సెలవిచ్చారు. హిమాన్షు వాళ్లకు ఒక కారు ఉంది. పండగరోజు కావడంతో తండ్రి కూడా పనికి వెళ్లలేదు. వాళ్ల కారును ఇంటికి దగ్గర ఉన్న కొల్యారి బైపాస్ పక్కన పార్క్ చేసి పెట్టారు. అయితే, గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో హిమాన్షు వారి కారు దగ్గరికి వెళ్లాడు. అందులో ఎవరో ఉన్నట్టు హిమాన్షు గమనించాడు. తీరా అక్కడికి వెళ్తే.. ఆ అబ్బాయికి ఊహించని పరిణామం ఎదురైంది.



కారులో గుర్తుతెలియని ముగ్గురు యువకులున్నారు. వాళ్లు మద్యం సేవిస్తున్నారు. హిమాన్షు కారులో ఉన్నవాళ్లతో ‘ఎవరు మీరు.. ఇక్కడ మందు తాగడమేంటి? ముందు కారు దిగండి’అని అన్నాడు. మమ్మల్నే కారు దిగమంటావా అంటూ వాళ్లు హిమాన్షును కారులోకి లాక్కొని మద్యం తాగించడానికి ప్రయత్నించారు. హిమాన్షు మద్యం తాగడానికి నిరాకరించడంతో.. కోపంతో కత్తి తీసుకుని పొడిచారు. అంతేకాకుండా రాళ్లతో కూడా దాడిచేశారు. పిల్లాడి అరుపులు విని చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. వారి రాకను గమనించి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. రక్తపుమడుగుల్లో పడివున్న హిమాన్షు గురించి వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. జమ్నాలాల్ శర్మ దంపతులు కుమారుడిని చూసి భోరున విలపించారు. 


వెంటనే దగ్గర్లోని ఝడోల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే హిమాన్షు శర్మ చనిపోయాడు. ఫలాసియా పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి వచ్చారు. నిందితుల గురించి స్థానికులను విచారించగా.. తామెప్పుడు వారిని చూడలేదని సమాచారమిచ్చారు. దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఫలాసియా ఎస్‌హెచ్‌ఓ రాంనారాయణ మీడియాకు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న యువకులు ఆవేశంతో హిమాన్షును హత్య చేశారని, ఇదే ప్రాంతంలో గతంలో కూడా జంట హత్యలు జరిగాయని అన్నారు. 



రోజురోజుకూ పెరుగుతున్న ఘటనల దృష్ట్యా కొల్యారిలో పోలీస్‌ పోస్టును ప్రారంభించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. సంఘటన జరిగి 16గంటలు గడుస్తున్నా నిందితులను పోలీసులు పట్టుకోలేదని నేషనల్ హైవే 58ఈ మీద గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసి డీఎస్‌పీ గిరిధర్ సింగ్ సంఘటనా స్థలానికి వచ్చి గ్రామస్థులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ‘కలెక్టర్‌ను వెంటనే పిలిపించండి.. మా ప్రాంతంలో వెంటనే పోలీస్ పోస్టును ఏర్పాటు చేయండి’అంటూ డిమాండ్ చేశారు. త్వరలోనే పోలీస్ పోస్ట్‌ను ఏర్పాటు చేస్తామని డీఎస్‌పీ మాట ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్‌పీ గిరిధర్ సింగ్ అన్నారు.



Updated Date - 2021-11-05T18:10:20+05:30 IST