రెండు నెలల క్రితం యువకుడి ఆత్మహత్య.. తాజాగా బయటపడిన భార్య నిర్వాకం.. అందరూ షాక్

ABN , First Publish Date - 2022-08-30T01:28:32+05:30 IST

రెండు నెలల క్రితం సూరత్‌లో ఓ హిందూ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు

రెండు నెలల క్రితం యువకుడి ఆత్మహత్య.. తాజాగా బయటపడిన భార్య నిర్వాకం.. అందరూ షాక్

సూరత్: రెండు నెలల క్రితం సూరత్‌లో ఓ హిందూ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. బాధితుడి భార్య, ఆమె సోదరుడిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ముస్లిం అయిన బాధితుడి భార్య, ఆమె సోదరుడు అతడితో బలవంతంగా బీఫ్ తినిపించడంతో మనస్తాపానికి గురైన బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్టు విచారణలో తేలింది. 


బాధితుడి పేరు రోహిత్ ప్రతాప్ సింగ్. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు షేర్ చేశాడు. జూన్‌లో అతడు ఆత్మహత్య చేసుకోగా రెండు నెలల తర్వాత తాజాగా ఫేస్‌బుక్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. రోహిత్ ఆ సూసైడ్ నోట్‌లో.. ‘‘నేను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోతున్నాను. నా చావుకు నా భార్య సోనమ్ అలీ, ఆమె సోదరుడు అక్తర్ అలీనే కారణం. నన్ను చంపేస్తామని బెదిరించి నాతో బీఫ్ తినిపించారు. ఇక నేను ఈ ప్రపంచంలో జీవించడానికి ఎంత మాత్రమూ అర్హుడిని కాను. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో రోహిత్ బంధువులు సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


రోహిత్‌కు సోనమ్‌కు పరిచయం ఎలా?

రోహిత్, సోనమ్ ఇద్దరూ సూరత్‌లో ఒకే దగ్గర పనిచేస్తున్నారు. దీంతో తరచూ కలుసుకునేవారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సోనమ్ ముస్లిం అమ్మాయి కావడంతో రోహిత్ వాళ్ల ఇంట్లో అడ్డు చెప్పారు. అంతేకాదు, తమ మాటను పెడచెవిన పెట్టి సోనమ్‌ను పెళ్లి చేసుకుంటే సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ పట్టించుకోని రోహిత్.. సోనమ్‌ను పెళ్లాడి ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఏడాదిగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. 


న్యాయం కోరుతున్న బాధిత కుటుంబం

కుమారుడి ఆత్మహత్యతో కుంగిపోయిన రోహిత్ తల్లి తాజాగా సోనమ్, ఆమె సోదరుడు అక్తర్ అలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిని శిక్షించాలని రోహిత్ తల్లి వీణా దేవి డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా సోనమ్, ఆమె సోదరుడిపై ఉడ్నా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు సూరత్ పోలీస్ ఏసీపీ జేడీ సోనారా తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నట్టు వివరించారు.

Updated Date - 2022-08-30T01:28:32+05:30 IST