ముస్లిం మహిళలకు హిందూ సాధువు అత్యాచార బెదిరింపులు

ABN , First Publish Date - 2022-04-08T19:47:03+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైరాబాద్‌లో ఏప్రిల్ 2న ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పూర్తిగా కాషాయ దుస్తులతో జీపులో కూర్చుని ఉన్న ఒక సాధువు.. వందలాది మందిని ఉద్దేశించి మైక్‌లో ప్రసంగింస్తున్నారు..

ముస్లిం మహిళలకు హిందూ సాధువు అత్యాచార బెదిరింపులు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక హిందూ సాధువు.. ముస్లిం మహిళలపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. వారిని బహిరంగంగా అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆరు రోజుల క్రితం జరిగినట్లు చెప్తున్న ఈ ఘటనపై శుక్రవారం సీతాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. బహిరంగ ప్రదేశంలోనే వందల మంది ముందు సదరు సాధువు చేసిన విధ్వేష వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ కేసును సీనియర్ అధికారి విచారిస్తారని, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటారని సీతాపూర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.


ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైరాబాద్‌లో ఏప్రిల్ 2న ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పూర్తిగా కాషాయ దుస్తులతో జీపులో కూర్చుని ఉన్న ఒక సాధువు.. వందలాది మందిని ఉద్దేశించి మైక్‌లో ప్రసంగింస్తున్నారు. ఆయన చేస్తున్న విధ్వేష ప్రసంగాలు వింటూ అక్కడున్న వారు మధ్య మధ్యలో ‘‘జై శ్రీరాం’’ అని నినాదాలు ఇస్తున్నారు. ముస్లిం వ్యక్తులు ఎవరైనా హిందూ మహిళల జోలికి వస్తే.. వాళ్ల ఇళ్లల్లోని ముస్లిం మహిళలపై బహిరంగంగా అత్యాచారం చేస్తామంటూ ఆయన బెదిరించారు. ఈ వ్యాఖ్యలు వింటూ అక్కడున్నవారు చప్పట్లు కొడుతూ ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేశారు.


వీడియో ప్రకారం.. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన కూర్చున్న జీపులోనే నలుగురు పోలీసులు ఉన్నారు. ముగ్గురు పోలీసులు ఆయన వెనకాల నిలబడి ఉండగా.. ఒక పోలీసు అధికారి.. ఆయన జీపు పక్కన నిలబడి ఉన్నారు. సాధువు పేరు బజరంగ్‌ ముని అని ఒక నెటిజెన్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఐక్యారజ్యసమితి మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్‌లను ట్యాగ్ చేస్తూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. విధ్వేష వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ సాధువుతో పాటు, పోలీసులపై సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2022-04-08T19:47:03+05:30 IST