హిందువు – తెలంగాణ

ABN , First Publish Date - 2020-12-31T06:14:11+05:30 IST

శివలింగం మీద తేలు ఉంది. ఆ లింగానికి అభిషేకం చేస్తున్న భక్తుడిని తేలు కుడుతోంది. దానిపై ఒక్క దెబ్బ వేసి చంపే అవకాశం ఉన్నప్పటికీ...

హిందువు – తెలంగాణ

కేసీఆర్‌కు మొదట్లో తెలంగాణ సెంటిమెంట్‌ ఉపయోగపడినట్టే, ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో హిందుత్వం అజెండా ఉపయోగపడుతోంది! హిందూత్వ అజెండా వల్ల బీజేపీకి రాజకీయంగా తాత్కాలిక ప్రయోజనం కలిగితే కలగవచ్చు. కానీ, దీర్ఘకాలం నిలదొక్కుకోవటానికి అభివృద్ధి అజెండా తప్ప ఆ పార్టీకి మరో మార్గం లేదు! ప్రత్యేకించి తెలంగాణ వంటి ప్రగతిశీల, చైతన్యవంతమైన రాష్ట్రంలో హిందుత్వ మాత్రలు ఎక్కువ కాలం పనిచేయవని బీజేపీ ఎంత తొందరగా గుర్తిస్తే, అంత మంచిది!! 


శివలింగం మీద తేలు ఉంది. ఆ లింగానికి అభిషేకం చేస్తున్న భక్తుడిని తేలు కుడుతోంది. దానిపై ఒక్క దెబ్బ వేసి చంపే అవకాశం ఉన్నప్పటికీ, భక్తుడు మాత్రం ఆ పని చేయలేదు. పంటి బిగువున నొప్పి భరిస్తూనే, అభిషేకం పూర్తి చేశాడు. తాను వేసే దెబ్బ పొరపాటున లింగానికి తగిలితే, శివుడికి కోపం వస్తుందేమో అని భక్తుడి మదిలో తలెత్తిన శంక, భయం.. తేలును కొట్టకుండా చేశాయి. ‘శివ లింగం మీద తేలు’ అనే నానుడి వెనుక పరమార్థం ఇది.


ఆరున్నర ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూకుడు జగద్విదితమే. కేసీఆర్‌ శృతి మించి దూషించినప్పటికీ, రాజకీయ ప్రత్యర్థులు గట్టిగా బదులిచ్చే సాహసం చేయలేదు. ఆయనను తప్పుబడితే తెలంగాణ ప్రజలకు ఎక్కడ కోపం వస్తుందో అని మిన్నకుండిపోయారు. ఎందుకంటే, కేసీఆర్‌ అవటానికి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ, ‘తెలంగాణ’కు ప్రతీకగా నిలవటం వల్ల..


ఆరున్నర ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీని దునుమాడితే, హిందువులపై దాడి అనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులే కాబట్టి, బీజేపీ వ్యతిరేకులు ఆ పార్టీని మతం ప్రాతిపదికన నిందించాలంటే వెనుకాముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, కేంద్రంలోని అధికార బీజేపీ తాము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువగా హిందూత్వ అజెండాను నమ్ముకోవటం వల్ల..


అప్పుడు కేసీఆర్‌ను, ఇప్పుడు బీజేపీని తేలు అనే జీవితో పోల్చటం నా ఉద్దేశం కాదు. నాడు తెలంగాణ, నేడు హిందువులను శివలింగంగా చూడాల్సి రావటమే సారూప్యత!!


తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉరకలెత్తించే క్రమంలో కేసీఆర్‌ మాటల తూటాలతో చెలరేగిపోయారు. వేర్వేరు కారణాల వల్ల ఆంధ్రా వాళ్లపై ఇక్కడి ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతను ఆయన రాజకీయంగా సొమ్ము చేసుకోవటానికి వెనుకాడలేదు. ‘ఆంధ్రా వాళ్లది పెండ బిర్యానీ!’.. ‘లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే!!’.. ‘ఎవని తెలుగు తల్లి? ఎవనికి పుట్టిన తల్లి??’ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో అప్పుడు కేసీఆర్‌ నోట వచ్చాయి. ఇవి తెలంగాణ భూమి పుత్రుల ‘ఇగో’ను సంతృప్తి పర్చాయి. ‘అబ్బ..! ఆంధ్రోళ్లను ఏం తిడుతున్నాడ్రా!!’ అని ఆ సమయాన తెలంగాణలో కేసీఆర్‌ను మెచ్చుకోకుండా ఉండని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. దీని వల్లనే తెలంగాణవాదాన్ని, సెంటిమెంట్‌ను రగిలించటం ఆయనకు తేలికైంది. రాష్ట్ర సాధన ఉద్యమం తీరం చేరింది.


2014లో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి కొన్ని నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్‌ బాగా వాడుకున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. ఆయన కాంగ్రెస్‌, టీడీపీలను ఆంధ్రా పార్టీలుగా, టీఆర్‌ఎస్‌ను తెలంగాణ ఇంటి పార్టీగానూ అభివర్ణించారు. తన వాదనతో జనాన్ని మెప్పించారు కూడా. అప్పటికే కాంగ్రెస్‌, టీడీపీ పాలన తీరుపై మొహమెత్తిన తెలంగాణ ప్రాంతం ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ని ఆదరించింది.


తర్వాత ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2018 నాటికి రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌.. మహా కూటమిగా జట్టు కట్టి టీఆర్‌ఎస్‌తో తలపడ్డాయి. అప్పుడు కూడా కేసీఆర్‌ నాలుగున్నర ఏళ్ల తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కంటే, తెలంగాణ సెంటిమెంట్‌పైనే అధికంగా ఆధారపడ్డారు. మహా కూటమిలో చంద్రబాబు భాగస్వామిగా ఉండటాన్ని తెలంగాణ ప్రజలకు బూచిగా చూపించారు. ‘ఆంధ్రా బాబు మళ్లీ వస్తున్నాడు!’ అని మరోసారి సెంటిమెంట్‌ను రాజేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌సహా తెలంగాణ ప్రాంతంలోనూ ఎంతో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ, ఉద్యమ కాల గమనంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆయన వైఖరి, తీసుకున్న నిర్ణయాలు ఇక్కడి ప్రజలకు అజీర్ణంగానే ఉండిపోయాయి. దీనిని కేసీఆర్‌ సానుకూలంగా మలుచుకొని రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నారు.


2019 లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్‌ ఇంకోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునే అవకాశం లేకుండా పోయింది. అప్పటికే రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు కావచ్చింది. ‘ఇంకా సెంటిమెంట్‌ ఏంది? మాకోసం ఏం చేశారు అన్నది ముఖ్యం’ అనే ధోరణి ప్రజల్లో పెరిగింది. మరోవైపు కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడల పర్యవసానంగా టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్‌ కుదేలైంది. బీజేపీ 105 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి, డీలా పడిన సందర్భం అది. ఈ దశలో తనయుడు కేటీఆర్‌ను తన స్థానంలో సీఎంను చేసి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కమలనాథులను కేసీఆర్‌ టార్గెట్‌ చేసుకోవటంతోనే అసలు కథ మొదలైంది.


ఆడే నోరు.. కదిలే కాలు ఊరుకోదు కదా! లోక్‌సభ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ తన మాటల మంత్రాంగానికి పదును పెట్టారు. కరీంనగర్‌ ప్రచార సభలో ‘హిందూగాళ్లు.. బొందూగాళ్లు’ అనే వ్యాఖ్యలు చేశారు. వరుస ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రానప్పటికీ, తెలంగాణలో పాగా వేయటానికి ఎంతోకాలంగా కాచుకొని ఉన్న బీజేపీకి కేసీఆర్‌ వ్యాఖ్యలు వరంగా మారాయి. ఆయాచితంగా అందివచ్చిన అవకాశాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? కేసీఆర్‌ కరీంనగర్‌ గడప దాటకముందే కమలనాథులు, ఆయన హిందువులపై చేసిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని చుట్టించారు. పనిలోపనిగా టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా హిందువులను కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆసరికే టీఆర్‌ఎస్‌ పార్టీ, ఎంఐఎం మధ్య దోస్తీ బహిరంగ రహస్యం కావటం, బీజేపీ కార్యాన్ని మరింత తేలిక చేసింది. ఇందుకు స్థానిక పరిస్థితులు కూడా తోడు కావటంతో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ  గెలిచింది. టీఆర్‌ఎస్‌కి ఆ పార్టీ నుంచి ఎదురైన మొదటి సవాల్‌ ఇదే!


లోక్‌సభ పోరు తదుపరి పరిషత్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ, కమలనాథులు హిందూత్వ అజెండాను వదిలిపెట్టలేదు. ఎంఐఎం, ముస్లిములకు టీఆర్‌ఎస్‌ కొమ్ముకాస్తోందనే దాడిని చాపకింద నీరులా కొనసాగిస్తూ వచ్చారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సఖ్యతగా మెలిగితే, రాష్ట్రానికి కొత్త పథకాలు, అనుమతులు, నిధులు తెచ్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వంగా టీఆర్‌ఎస్‌ ఆశ పడింది. కేంద్రానికి అంశాల వారీ మద్దతు కొనసాగించింది. పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనల్లో తమ పథకాలను మెచ్చుకుంటే, ఉబ్బితబ్బిబైపోయింది. అనుకోకుండా దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలు వస్తేగానీ, బీజేపీ తత్వం ఏమిటో టీఆర్‌ఎస్‌కి బోధపడలేదు. 


ఇదివరకటిలా తెలంగాణ సెంటిమెంట్‌ అస్త్రం లేకపోవటంతో దుబ్బాక పోరులో ‘గులాబీ’ దళం తాము చేసిన అభివృద్ధినే ఆయుధంగా సంధించింది. బీజేపీ మాత్రం లోక్‌సభ ఎన్నికల తరహాలోనే హిందూత్వ ప్రచారానికి పెద్దపీట వేసింది. ఆ ఎన్నికల్లో కమలనాథుల సోషల్‌ మీడియా ప్రచారానికి ఒక దశలో టీఆర్‌ఎస్‌ ఉక్కపోతకు గురైంది. దాని నుంచి బయటపడి, ఎదురుదాడికి సిద్ధమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దుబ్బాక ఫలితం ప్రతికూలంగా వచ్చాకగానీ, టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి జ్ఞానోదయం కలగలేదు!


ఆ వెంటనే కొనితెచ్చుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమరంలోనూ టీఆర్‌ఎస్‌, తమ అమ్ముల పొదిలో మిగిలిన ఆఖరి బాణం అభివృద్ధితోనే పోరాడింది. బీజేపీ మాత్రం అభివృద్ధి–హిందూత్వం అనే రెండు అంచుల కత్తిని ఇష్టానుసారం తిప్పింది. టీఆర్‌ఎస్‌కి ఎంఐఎంతో ఉన్న సంబంధ బాంధవ్యాలను దృష్టిలో పెట్టుకొని, కమలనాథులందరూ హిందూత్వ అంచును నూరటంలోనే నిమగ్నమయ్యారు. ఇది మెజార్టీ ప్రజలకు కొత్తగా అనిపించింది. టీఆర్‌ఎస్‌ని బాగా ఇబ్బంది పెట్టింది. దీనిని ఆ పార్టీ నేతలు బయటికి అంగీకరించకపోవచ్చు! కానీ, వారి అంతరాత్మకు అదే పచ్చి నిజం అని తెలుసు!!


కేసీఆర్‌కు మొదట్లో తెలంగాణ సెంటిమెంట్‌ ఉపయోగపడినట్టే, ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో హిందుత్వం అజెండా ఉపయోగపడుతోంది!


అల్లోపతి మందుల వాడకం గడువు తీరినట్టు.. కొంచెం అటు, ఇటుగా ఐదేళ్లతోనే తెలంగాణ సెంటిమెంట్‌ కాల పరిమితి తీరిపోయింది. గడువు తీరిన మాత్రను వేసుకుంటే, వికటించటం తప్ప ప్రయోజనం ఉండదు! అందుకేనేమో కాలం తీరిన తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్‌ సన్యసించారు!? కొత్తగా రాష్ట్ర ప్రజల స్వీయ అనుభవంలోకి వచ్చిన అభివృద్ధి జెండాను చేబూనారు. సూర్య, చంద్రుల మాదిరి శాశ్వతమైన ఈ జెండా, భావోద్వేగాల పొరలు కమ్మేసిన కళ్లకు కనిపించకపోవచ్చు! కానీ, ఏదో ఒక రోజు ఆకాశాన్ని కమ్ముకున్న మబ్బుల వలె ఆ పొరలు కూడా తొలగిపోయేవే!!


బీజేపీ హిందూత్వ అజెండా అనేది చక్కెర పూత పూసిన చేదు గుళిక లాంటిది! మొదట్లో జనానికి తియ్యగా ఉన్నప్పటికీ, కరిగే కొద్దీ చేదు రుచి చూడక  తప్పదు!! హిందూత్వ అజెండా వల్ల బీజేపీకి రాజకీయంగా తాత్కాలిక ప్రయోజనం కలిగితే కలగవచ్చు. కానీ, దీర్ఘకాలం నిలదొక్కుకోవటానికి అభివృద్ధి అజెండా తప్ప ఆ పార్టీకి మరో మార్గం లేదు! ప్రత్యేకించి తెలంగాణ వంటి ప్రగతిశీల, చైతన్యవంతమైన రాష్ట్రంలో హిందుత్వ మాత్రలు ఎక్కువ కాలం పనిచేయవని బీజేపీ ఎంత తొందరగా గుర్తిస్తే, అంత మంచిది!! 


ఎందుకంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి హైదరాబాద్‌ రాష్ట్రం నిజాం పాలనలో ఉంది. తర్వాత ఇండియన్‌ యూనియన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైనప్పటికీ, తెలంగాణ గడ్డ హిందూ, ముస్లిం కుటుంబాల సమైక్య జీవనంతో ప్రత్యేకతను చాటుకుంది. సంస్కృతి, సంప్రదాయాల్లో కొత్త ఒరవడికి నాందీవాచకం పలికింది. అంతేకాదు.. పూర్వం నుంచి ఇక్కడ మత మార్పులు తక్కువే! ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఏ పార్టీ చేసినా, ఒప్పు ఎలా అవుతుంది? దేశానికి వ్యతిరేకంగా జరిగే ఉగ్రవాద చర్యల్లో లేదా హిందూ మతాన్ని కించపర్చే కుసంస్కారుల్లో ఎవరైనా ముస్లిం మతస్తులు ఉంటే, రాష్ట్రంలోని ముస్లింలందరినీ అదే కోణంలో చూడటం ఎంతవరకు సమంజసం? బీజేపీ మూలాల్లో ఒకటిగా భావించే శ్రీ సరస్వతి శిశుమందిరాల్లో హిందూ, ముస్లిం మతస్తులు కలిసి చదువుకోలేదా? శిశు మందిరాల్లో సదాచారం అభ్యసించి, స్నేహితుల్లా బయటికి వచ్చి, వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డ వాళ్లంతా ఇప్పుడు మతం పేరుతో విడిపోయి ద్వేషించుకోవాలా?


దేహంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి యాంటీబయోటిక్స్‌ ఉపయోగిస్తారు. అట్లా అని చెప్పి అదే యాంటీబయోటిక్స్‌ పదే పదే వాడితే, పనిచేయకుండా పోతాయి. డోసు పెంచి చూసినా ప్చ్‌..లాభం ఉండదు. అది తెలంగాణ సెంటిమెంట్‌ కావచ్చు! హిందూత్వమూ కావచ్చు!!

మెండు శ్రీనివాస్‌

Updated Date - 2020-12-31T06:14:11+05:30 IST