Hindus మా పూర్వీకులు...గోవధ వద్దు...Assam ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-08T16:34:36+05:30 IST

అసోం ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్, ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ బక్రీద్ నేపథ్యంలో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు...

Hindus మా పూర్వీకులు...గోవధ వద్దు...Assam ఎంపీ సంచలన వ్యాఖ్యలు

గౌహతి(అసోం):అసోం ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్, ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ బక్రీద్ నేపథ్యంలో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులు మా పూర్వీకులు...గోవధ వద్దు’’ అని అసోంకు చెందిన బద్రుద్దీన్ అజ్మల్ కోరారు.అదే సందర్భంలో ఈద్-ఉల్-అదా రోజున ‘ఖుర్బానీ’ చేయడం ముస్లింల విధి అని బద్రుద్దీన్ అజ్మల్ పేర్కొన్నారు.అసోం పశువుల సంరక్షణ చట్టం 2021ని గౌరవించాలని బద్రుద్దీన్ అజ్మల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎంపీ అయిన మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అసోం స్టేట్ జమియత్ ఉలమా (ASJU) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఈ వారం ఈద్-ఉల్-అదా సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని అసోం ముస్లింలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని అజ్మల్ పునరుద్ఘాటించారు.


‘‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ రాజ్‌ని చేయడానికి ప్రయత్నించడం ద్వారా హిందుస్థాన్‌ను అంతం చేయాలనుకుంటోంది...హిందూ రాజ్ ఆర్ఎస్ఎస్ వారి కలలో కూడా వాస్తవం కాలేదు. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ముస్లింలు, హిందువుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయలేదు.’’అని ఎంపీ అజ్మల్ చెప్పారు. ‘‘మీరు ఈద్ రోజున ఆవులను తినకండి. మేం పండుగను హిందూ భాయ్‌లతో జరుపుకుంటాం. మా పూర్వీకులందరూ హిందువులు. వారు ఇస్లాంలోకి వచ్చారు, ఇతర మతాల మనోభావాలను గౌరవించడమే మా అభిమతం’’ అని అజ్మల్ గౌహతిలో విలేకరులతో అన్నారు. భారతదేశంలోని చాలా మంది నివాసులు సనాతన ధర్మాన్ని పాటిస్తారని, ఆవును పవిత్ర జంతువుగా పరిగణిస్తుంటారని ఎంపీ చెప్పారు.


హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు నివాసమున్న ప్రాంతాల్లో గొడ్డు మాంసం లేదా దాని ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ గత సంవత్సరం ఆమోదించిన అస్సాం పశుసంరక్షణ చట్టం 2021ని గౌరవించాలని ఆయన ప్రజలను కోరారు. ‘‘ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ముస్లింలు ప్రతిస్పందించకూడదు. దీనికి బదులుగా, నూపుర్ శర్మ వంటి వారికి దేవుడు బుద్ధి ఇవ్వాలని ప్రార్థించాలి. శిరచ్ఛేదం చేయడం మూర్ఖత్వం’’ అని అజ్మల్ వివరించారు.రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేయవచ్చన్న వార్తలను కూడా ఎంపీ ఖండించారు.


Updated Date - 2022-07-08T16:34:36+05:30 IST