హిందూత్వ: సావర్కార్ ఏమన్నారు?

ABN , First Publish Date - 2022-08-05T10:16:46+05:30 IST

హిందూత్వ ఒక రాజకీయ పథకం. ఇది మొదటి నుంచీ ఒక వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్నది. ఒక పక్క సమ్మిళితతత్వాన్ని ప్రతిపాదిస్తూనే మరో పక్క నిర్దిష్ట సామాజిక వర్గాలను...

హిందూత్వ: సావర్కార్ ఏమన్నారు?

హిందూత్వ ఒక రాజకీయ పథకం. ఇది మొదటి నుంచీ ఒక వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్నది. ఒక పక్క సమ్మిళితతత్వాన్ని ప్రతిపాదిస్తూనే మరో పక్క నిర్దిష్ట సామాజిక వర్గాలను తన లక్ష్య పరిధి నుంచి మినహాయిస్తున్నది. ఈ ధోరణి అయోమయాన్ని కలిగిస్తున్నది. దాని ప్రతిపాదనలను అర్థం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తున్నది. ఇటువంటి పునాది వైరుధ్యంతో హిందూత్వకు నైతిక, సాంస్కృతిక న్యాయబద్ధత ఎలా సమకూరుతుంది? భారతావని సమస్త నాగరికతా వారసత్వమే హిందూత్వ అని విశ్వసనీయంగా ఉద్ఘోషించాలంటే ఆ రాజకీయ పథకం విశాల ప్రాతిపదికలు కలిగి ఉండాలి. అప్పుడే దానికి ధర్మ బద్ధత లభిస్తుంది. అయితే రాజకీయ అనివార్యతలు హిందూత్వను సంకుచితత్వం వైపు తీసుకువెళుతున్నాయి. కేవలం హిందూ మతస్థులతో మాత్రమే ఒకే ఒక్క రాజకీయ సమాజాన్ని సృష్టించడమే హిందూత్వ సంకల్పంగా ఉంది. ఇదెలా సాధ్యం? ఈ సంకల్ప సాధనకు ఎదురవుతున్న అవరోధాల నుంచి బయటపడేందుకు సంపూర్ణ నయవంచన లేదా నైతిక మూర్ఖత్వం మినహా మరో మార్గముందా? భారత ప్రజలు ఇప్పుడు సంపూర్ణ శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేయవలసిన, సంబంధిత కార్యాచరణలో పాల్గొనవలసిన భావజాలమే హిందూత్వ అని ఇటీవల విడుదలయిన ఒక కొత్త పుస్తకం మనలను ప్రేరేపిస్తోంది. అది వినాయక్ దామోదర్ సావర్కార్ (1883–1966) మేధో జీవితచరిత్ర. అయితే ఈ నిష్పాక్షిక రచన సైద్ధాంతిక గందరగోళం, చారిత్రక అస్పష్టత, వలసవాదంపై రాజకీయ ద్వైధీభావం, హిందూత్వ భావజాల స్వతస్సిద్ధ హింసా ప్రవృత్తికి నైతిక సమర్థనతో ముగిసింది. 


మొదట ప్రాథమిక వైరుధ్యాన్ని అర్థం చేసుకుందాం. అన్ని జాతీయ వాదాల వలే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (అంతకు ముందు హిందూ మహాసభ) ప్రవచించే జాతీయవాదం కూడా భారతదేశపు జాతీయతా అస్తిత్వం అనాది నుంచి ఉందని పేర్కొంటూ వలస పాలన పూర్వపు నాగరికతా యశస్సును గర్వకారణంగా భావిస్తోంది. ఈ మేధో వాదనను అంగీకరించేందుకు రెండు స్పష్టమైన సమస్యలు ఉన్నాయి. ఈస్టిండియా కంపెనీ దేశ పాలనాధికారాన్ని స్వాధీనం చేసుకోక పూర్వమున్న సమస్త సంస్కృతులు, సామాజిక సమూహాలను కలుపుకుంటూ భారత జాతీయతని నిర్వచిస్తారా? అలా అయితే చాలా వైవిధ్య సంస్కృతులు, సామాజిక సమూహాలు, విభిన్న మత సంప్రదాయాలు భారత జాతీయతలో భాగంగా ఉంటాయి. హిందువులతో పాటు సిఖ్‌లు, జైనులు, బౌద్ధులు మాత్రమే కాదు వలస పాలన ప్రారంభమవ్వక ముందే శతాబ్దాల నుంచి ఈ దేశంలో నివశిస్తున్న ముస్లింలు, క్రైస్తవులు కూడా భారత జాతీయతకు వారసులు అవుతారు. రెండో సమస్య– మనం ఇప్పుడు హిందూ మతంగా భావిస్తున్న మతం ప్రభవించిక పూర్వం నుంచీ ఈ గడ్డపై నివశిస్తున్న దేశీయ ప్రజలకు సంబంధించినది. భారత జాతీయతకు మౌలిక వారసులుగా తమను తాము భావించుకునే హక్కు వారికి లేదూ?


సమస్య కఠినమైనది. భారత జాతీయత పురాతనతకు, నవీనతకు విభజన రేఖ ఎక్కడ నిర్ణయిస్తారు? అది ఇటీవలి సహస్రాబ్దాలలో అయితే ముస్లింలు, క్రైస్తవులు కూడా భారత జాతీయతకు వారసులే. అయితే ఆ విభజన రేఖ ఇంకా పూర్వపు సహస్రాబ్దాలలోనిది అయితే హిందువులు కూడా మినహాయించబడతారు! ఈ రెండు కాల రేఖల పరిధిలో హిందువులు లేకుండా భారత జాతీయత వారసత్వం తమదే అని చెప్పుకోవడం ఎలా? ఈ సమస్యకు ప్రతిస్పందనే సావర్కార్ హిందూత్వ భావన. ఆదొక నవ భావన, కొత్త ఆలోచన. సావర్కార్ మేధో కృషి వివిధ సాహిత్య ప్రక్రియల (కవిత్వం, నాటకాలు, చరిత్ర, వాద ప్రతివాదాలు)లో, భాషల (మరాఠీ, ఆంగ్లం)లో, నడయాడిన ప్రదేశాల (లండన్, అండమాన్, మహారాష్ట్ర)లో, వివిధ రాజకీయ దశల (గాంధీకి ముందు, గాంధీ కాలంలో, గాంధీ అనంతరం)లో జరిగింది. ఆయన రచనా వ్యాసంగమంతా భారత జాతి, మరాఠాలు, తనను గురించిన చరిత్ర గ్రంథాలను వెలయించే ప్రయత్నమే. హిందూత్వ రాజకీయ వాదనలు, హక్కులు, అర్హతలను సమర్థించడమే ఆయన విద్వత్ వ్యాపకాల ఏకైక ఎజెండా.


వినాయక్ చతుర్వేది రాసిన సావర్కార్ మేధో జీవిత చరిత్ర ‘వి.డి. సావర్కార్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ హిస్టరీ’ ఒక పుణ్య పురుషుని జీవిత కథ కాదని నిశ్చితంగా చెప్పవచ్చు. హిందూత్వ ప్రతిపాదకుని పట్ల లౌకికవాద చరిత్రకారులు పలువురు అనుసరించిన దృక్పథాన్ని చతుర్వేది అనుసరించలేదు. తన కథానాయకుని కృషిని ఆయన చాలా జాగ్రత్తగా విశ్లేషించారు. చరిత్రలో సావర్కార్ స్థానం గురించి తనదైన తీర్పు ఇచ్చేందుకు చతుర్వేది ఆరాటపడలేదు. సావర్కార్ భావాలపైనే ఆయన తన దృష్టిని కేంద్రీకరించారు. ఆయన చుట్టూ ఉన్న వివిధ వివాదాలలోకి చతుర్వేది వెళ్లలేదు. వివిధ మారు పేర్లతో సావర్కార్ తనను తాను కీర్తించుకుంటూ రాసిన వివిధ జీవిత చరిత్రలు చరిత్రలో తనకొక సమున్నత స్థానాన్ని కల్పించుకోవడానికేనా? మహాత్మా గాంధీ హత్యకు జరిగిన కుట్రలో ఆయనకు ప్రమేయమున్నదా?... ఇత్యాది విషయాలకు చతుర్వేది ప్రాధాన్యమివ్వలేదు. మొత్తం మీద సావర్కార్ పరిస్థితుల పట్ల సానుభూతి దృక్పథాన్నే రచయిత చూపించారు. వర్తమాన భారత రాజకీయాల కోణం నుంచి సావర్కార్‌్‌ను చూడవద్దని కూడా ఆయన కోరారు. ఇంచుమించు 500 పేజీల ఈ పుస్తకంలో సావర్కార్ రాజకీయ కార్యాచరణపై కాకుండా రాజకీయ సిద్ధాంతంపైనే చతుర్వేది తన దృష్టిని దృఢంగా కేంద్రీకరించారు.


హిందూత్వ సైద్ధాంతిక వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించారు? తన రాజకీయ క్రియాశీల జీవిత తొలిదశలో ఆయన ఎటువంటి పరిష్కారాన్ని చూపలేదు. ఆయన ప్రథమ ప్రధాన పుస్తకం ‘1857 సిపాయీల తిరుగుబాటు’ గాథను జాతీయవాద కోణంలో పునరావిష్కరించింది. ఆ తిరుగుబాటును ఆయన ‘భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం’గా ఆయన అభివర్ణించారు. ఈ దృక్పధం పూర్తిగా సమ్మిళిత జాతీయవాద చట్రంలో ఉందని మరి చెప్పనవసరం లేదు. నిజానికి, ఆయన ఏమి రాశారో చూడండి: ‘ఇక ఇప్పుడు హిందువులు, ముస్లింల మధ్య విరోధ భావాన్ని గతానికి నెట్టివేయాలి. ప్రస్తుతం వారి మధ్య ఉన్న సంబంధాలు పాలకులు–పాలితుల మధ్య ఉండేవి కావు. విదేశీ పాలకులు, దేశీయ ప్రజల మధ్య ఉన్నటువంటివి అసలే కావు. ఇప్పుడు వారు సోదరులు. ఒక్క మతం మాత్రమే వారి మధ్య ఉన్న అంతరం’. హిందువులు ఇప్పుడు ముస్లింల పట్ల విద్వేషాన్ని చూపడం ‘అన్యాయం, మూర్ఖత్వం’ అని కూడా సావర్కార్ స్పష్టం చేశారు. అయితే అండమాన్‌లో కారాగార వాసం అనంతరం సావర్కార్ వైఖరి పూర్తిగా మారిపోయింది. 1923లో తొలుత ప్రచురితమైన ఆయన పుస్తకం ‘ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందూత్వ’ లో హిందూ జాతీయవాద ప్రత్యేక భావజాల మూలాలు ఉన్నాయి.


హిందువులు ఎవరు అని నిర్వచించడంలో ఎదురయిన సమస్యకు సావర్కార్ పరిష్కారం హిందూత్వ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. హిందువులను కేవలం హిందూ మత అనుయాయులకే పరిమితం చేయకూడదు– అలా చేయడమంటే పాశ్చాత్య మత భావనను అనుకరించడమేనని ఆయన విశ్వసించారు. అంతేకాక హిందూ ధర్మాన్ని ఆవరించి ఉన్న సిఖ్, జైన, బౌద్ధ మతాలను మినహాయించడమే అవుతుందని ఆయన భావించారు. మరి ఎవరు హిందువులు? సావర్కార్ ప్రకారం మీ మాతృభూమి, పితృభూమి, పుణ్యభూమి ‘హిందుస్థాన్’ అయితే మీరు హిందువు. మాతృభూమి అనేది ఒక భౌగోళిక భావన. భారతదేశ భూభాగాలలో నివశించే వారందరికీ ఇది వర్తిస్తుంది. అయితే అన్ని జాతులు, తెగలు, మతాలు, సామాజిక సముదాయాలకు చెందిన వారందరూ ఈ భావన పరిధిలోకి వస్తారు. పితృభూమి భావన ఈ విశాలత్వాన్ని కుదిస్తుంది. ఒకరితో మరొకరికి రక్త సంబంధాలు ఉన్న వారందరూ ఈ భావన పరిధిలోకి వస్తారు. అయినప్పటికీ ఇది గతంలో ఎన్నడో ఇస్లాం, క్రైస్తవ మతాలకు మారిన వారి వారసులకు పితృభూమి భావన నుంచి మినహాయింపు ఉండదు. మరి ఎవరు హిందువులు? ఇదీ సావర్కార్ చివరి షరతు: మక్కా లేదా జెరూసలేంను కాకుండా హిందుస్థాన్‌ను మాత్రమే తమ పుణ్యభూమిగా విశ్వసించేవారినే హిందువులుగా భావించాలని ఆయన స్పష్టం చేశారు.


సరే, ‘హిందువులు’ భారత భూమికి రాక ముందు ఇక్కడ నివశిస్తున్న వారి మాటేమిటి? ఈ విషయానికి సావర్కార్ చాలా ప్రాధాన్యమిచ్చారు. భారత్‌కు వేద సంస్కృతీ, నాగరికతలను ఆర్యులే తీసుకువచ్చారని ఆయన ప్రగాఢంగా విశ్వసించడమే అందుకు కారణమని చెప్పవచ్చు. భారత భూమి మూలవాసులను హిందువులు హింసాత్మకంగా జయించారని, అయితే ఆ విజితులను హిందూ సంస్కృతిలో సంలీనం చేసుకున్నామని ఆయన నిక్కచ్చిగా వాదించేవారు. ఈ భావనలు, వాదనలు హిందూత్వను ఒక పొందికైన భావజాలంగా రూపొందించాయా? లేదు. హిందూత్వకు ఒక స్పష్టమైన నిర్వచనాన్ని సావర్కార్ ఇవ్వనే లేదని చతుర్వేది పుస్తకం స్పష్టంగా చెప్పింది. హిందూత్వ ఏమిటో చూపడానికి ఆయన చరిత్రను ఆసరాగా తీసుకునేవారు. చరిత్రను విశాల దృక్పథంతో అధ్యయనం చేసిన చరిత్రకారులు, మరీ ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఆదివాసీలు, ద్రావిడియన్ల గతానికి ప్రాధాన్యమిచ్చే చరిత్రకారులు ఎవరూ సావర్కార్‌తో ఏకీభవించరు. బయట నుంచి వచ్చిన హిందువులు భారత భూమిలో మొదటి నుంచీ ఉన్నవారిని హింసాత్మకంగా జయించడాన్ని నైతికంగా సమర్థించిన సావర్కార్ అదే విషయమై ముస్లిం దురాక్రమణదారులు, బ్రిటిష్ వలసపాలకులను ఎందుకు సమర్థించలేదు? సావర్కార్ సిద్ధాంతాలు విద్వేషపూరిత, మత సంకుచితత్వ, హింసాత్మక హిందూత్వ రాజకీయ పథకాన్ని సమర్థిస్తున్నాయా? వినాయక్ చతుర్వేది పుస్తకం నేరుగా ఇటువంటి వాదన ఏదీ చేయలేదు. అయితే చదివి తీరాల్సిన ఈ మేధో జీవిత చరిత్ర మనకు మరే ఇతర అభిప్రాయాన్ని కలిగించడంలేదు.


యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2022-08-05T10:16:46+05:30 IST