హిప్నో కమలాకర్‌ మృతితో విషాదఛాయలు

ABN , First Publish Date - 2021-04-23T05:48:58+05:30 IST

ప్రముఖ సైకాలజిస్ట్‌, హిప్నాటిస్ట్‌ డాక్టర్‌ హిప్నో కమలాకర్‌ బుధవారం రాత్రి హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

హిప్నో కమలాకర్‌ మృతితో విషాదఛాయలు

గోదావరి సిటీ(రాజమహేంద్రవరం), ఏప్రిల్‌ 22: ప్రముఖ సైకాలజిస్ట్‌, హిప్నాటిస్ట్‌ డాక్టర్‌ హిప్నో కమలాకర్‌ బుధవారం రాత్రి హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ రాగా క్వారంటైన్‌ అనంతరం నెగిటివ్‌ నిర్ధారణయింది. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చగా బుధవారం రాత్రి 10:30 గంటలకు మరణించారు. కమలాకర్‌ జర్నలిస్ట్‌, న్యాయవాదిగా పనిచేయడంతో పాటు రెండు దశాబ్దాలుగా స్టేజ్‌ హిప్నాటిస్ట్‌గా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. కమలాకర్‌ సతీమణి డాక్టర్‌ హిప్నో పద్మాకమలాకర్‌ దేశంలో తొలి మహిళా హిప్నాటిస్ట్‌. ఆయనకు కుమార్తె సరోజారాయ్‌, కుమారుడు హిమకర్‌ ఉన్నారు. ఆయనది రాజమహేంద్రవరం సమీపంలోని నాగుల్లంక గ్రామం కాగా 15ఏళ్లుగా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.


  ప్రెస్‌క్లబ్‌లో సంతాపం
రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఉదయం హిప్నో కమలాకర్‌కు సంతాప సభ ఏర్పాటు చేశారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి, ఇతర సీనియర్‌ పాత్రికేయులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

Updated Date - 2021-04-23T05:48:58+05:30 IST