కిరాయి వ్యూహకర్తలు, బడాయి పాలకులు

ABN , First Publish Date - 2021-06-13T05:58:44+05:30 IST

‘కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కోసం పని చేస్తాను’ అని ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం పొందుతున్న ప్రశాంత్‌ కిశోర్‌ ఈ మధ్య ఎక్కడో ప్రకటించారు. ఆ వెంటనే ‘వద్దు వద్దు నరేంద్ర మోదీకే పని చేయండి’ అని...

కిరాయి వ్యూహకర్తలు, బడాయి పాలకులు

‘కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కోసం పని చేస్తాను’ అని ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం పొందుతున్న ప్రశాంత్‌ కిశోర్‌ ఈ మధ్య ఎక్కడో ప్రకటించారు. ఆ వెంటనే ‘వద్దు వద్దు నరేంద్ర మోదీకే పని చేయండి’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. పీకేగా పిలిచే ప్రశాంత్‌ కిశోర్‌ను తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడం కోసం తలలు పండిన రాజకీయ నాయకులు సైతం ఎందరో పోటీ పడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వారు కూడా పీకే కోసం ఆరాటపడుతున్నారు. ఆయన వ్యూహరచన చేయకపోతే తాము అధికారంలోకి రాలేమన్న అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చారు. సిద్ధాంతాల ప్రాతిపదికగా రాజకీయాలు నడిచిన మన దేశంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఏడేళ్ల క్రితం భారతీయ జనతాపార్టీ తరఫున నరేంద్ర మోదీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే, మోదీ ప్రతిష్ఠను అమాంతం పెంచి అధికారంలోకి రావడానికి కృషి చేశారు. దీంతో పలువురు నాయకుల దృష్టి ఆయనపై పడింది. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పీకేను వ్యూహకర్తగా నియమించుకుని విజయం సాధించారు. దీంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో తాజాగా జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ, స్టాలిన్‌ తరఫున ఆయన పని చేశారు. బీజేపీ నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా మమతా బెనర్జీ మూడో పర్యాయం కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్టాలిన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తనను నియమించుకున్న నాయకులు అధికారంలోకి రావడానికి పీకే ఏదైనా మంత్రదండం ప్రయోగిస్తున్నాడా? అంటే కాదనే చెప్పవచ్చు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా ఆయన విజయం సాధిస్తున్నారు. ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యాప్తి చేయడంతోపాటు నరేంద్ర మోదీ ఇమేజ్‌ను అమాంతం పెంచడానికి కృషి చేశారు. ఈ మొత్తం వ్యూహంలో మతాన్ని అంతర్లీనంగా ప్రయోగించారు. దీంతో హిందువులలో అత్యధికులు నరేంద్ర మోదీ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఆయన ప్రధానమంత్రి కావడం, ఆ తర్వాత దేశంలోనే ఎదురులేని నాయకుడిగా ఎదగడాన్ని చూశాం. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి విషయానికి వద్దాం! పీకే రూపొందించిన వ్యూహం ఫలించి ఆయన ముఖ్యమంత్రి కావడం, అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని పంచిపెట్టే మోడల్‌ను అమలు చేయడం ద్వారా బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం. నిజానికి జగన్‌ రెడ్డిని ఆశ్రయించడానికి ముందు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తరఫున పని చేయడానికి కూడా ప్రశాంత్‌ కిశోర్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఇందుకోసం 350 కోట్లకు పైగా ఫీజు చెల్లించవలసి ఉంటుందని పీకే ప్రతిపాదించడంతో చంద్రబాబు ఆయనను వద్దనుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ రెడ్డి తరఫున పీకే పని చేశారు. మమతా బెనర్జీ, స్టాలిన్‌ గెలుపునకు పీకే వ్యూహాలు ఎంతవరకు కారణమో తెలియదుగానీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి విజయానికి మాత్రం అవి బాగా ఉపయోగపడ్డాయి. స్థానిక పరిస్థితులను  బట్టి కులం, మతం కార్డులను ప్రయోగించడం పీకేకు ఆనవాయితీ. ప్రజల బలహీనతలను గుర్తించి వాటినే అస్ర్తాలుగా మలచి ఆయన తన క్లయింట్‌ కోసం పని చేస్తారు. ప్రజలను సొంతంగా ఆలోచించలేని స్థితిలోకి నెట్టి హిస్టీరిక్‌ సైకాలజీ ద్వారా తన క్లయింట్‌కు అనుకూలంగా తీర్పు వచ్చేలా వ్యూహరచన చేయడంలో ప్రశాంత్‌ కిశోర్‌ దిట్ట. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ర్టాలలో రాజకీయాలను భ్రష్ర్టు పట్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. కులాల కుంపట్ల వల్ల అప్పటికే పొగచూరిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి విషం ఎక్కించారు. ఇంకేముంది... అన్ని వర్గాల ప్రజల్లో కుల విద్వేషాలు వ్యాపించాయి. ఒక కులానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకృతం చేశారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలతోపాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి సహకారం పుష్కలంగా లభించడంతో తిరుగులేని మెజారిటీతో జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ దశ తిరిగింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్లు సైతం పీకేలాంటి వారి కోసం పోటీపడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సిద్ధాంతాలను మరచిపోయారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి పోరాటాలు చేయడం మరచిపోయారు. పెళ్లిళ్లు, పేరంటాలకు ఈవెంట్‌ మేనేజర్లను నియమించుకున్నట్టుగా ఎన్నికల సమయంలో పీకేలాంటి వారిని నియమించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అసత్యాలను సత్యాలుగా నమ్మించడం పెరిగిపోయింది. దీంతో పాలు నీళ్లను విడివిడిగా చూడలేని పరిస్థితికి ప్రజలు చేరుకున్నారు. తలలు పండిన నాయకులు సైతం నిస్సహాయులు అవుతున్నారు. 


మాల్యాకూ ఒక్క చాన్స్‌!

చేసిన అప్పులు తీర్చలేక విజయ్‌ మాల్యా దేశం విడిచి పారిపోయాడు గానీ, ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వాడిని నమ్ముకుని ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యేవాడేమో! నిజానికి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని విజయ్‌ మాల్యాకు ఎప్పటినుంచో ఉందట. 2004కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు వద్ద ఫార్ములా వన్‌ రేస్‌ అధినేత ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘మీ దేశానికి చెందిన విజయ్‌ మాల్యా ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి గానీ అవుతారా?’ అని ఆయనే చంద్రబాబును ప్రశ్నించగా, ‘అలా ఎందుకు అనుకుంటున్నారు? అదెలా సాధ్యం?!’ అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయ్‌ మాల్యానే తన వద్ద ఆ విషయం ప్రస్తావించారని ఫార్ములా వన్‌ అధినేత చెప్పారట. విజయ్‌ మాల్యా ఈ విషయం మరచిపోయి ఉంటారు. లేకపోతే ప్రశాంత్‌ కిశోర్‌లాంటి వారిని నియమించుకుని ముఖ్యమంత్రి అయ్యుండేవారు. దాంతో ఆయనపై కేసులు ఉండేవి కావు. కేసులు ఉన్నప్పటికీ బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి అయిపోయేవారు. ఇలా వ్యాఖ్యానించడం అతిశయం అనిపించవచ్చు గానీ, దేశ రాజకీయాలపై అటువంటి అభిప్రాయం ఉన్నవారిని తప్పుబట్టలేం.


సిద్ధాంతాలు పక్కకు... 

ఈవెంట్‌ మేనేజర్ల తరహాలో ఎన్నికల వ్యూహకర్తలకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు ఆవిరైపోయాయి. ఎన్నికలు అయ్యాక ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు. అదేదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘అరే బాలరాజూ నీ వల్ల దేశానికి ఏమి ఉపయోగం రా!’ అని అన్నట్టుగా ముఖ్యమంత్రులు అయినవారి వల్ల రాష్ర్టాలు బాగుపడితే విలువలూ సిద్ధాంతాలది ఏముందిలే అని సర్దిచెప్పుకోవచ్చు. పీకేలాంటి వారి కుయుక్తులతో అధికారంలోకి వచ్చినవారు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం తమదైన శైలిలో ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో దారిద్య్రం పెరిగిపోయేట్టుగా అడ్డగోలు సంక్షేమానికి తెర తీస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలతో మొదలైన ఈ సంతర్పణ ఇప్పుడు ఉత్తరాది రాష్ర్టాలకు కూడా పాకింది. దీంతో రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నిదర్శనం. అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారు. సొంత సొమ్మును దానం చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ అపర దానకర్ణులవలె కీర్తింపబడటాన్ని ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. ప్రజలను కూడా ప్రభుత్వాల నుంచి ఆయాచితంగా ఆర్థిక సహాయం పొందడానికి అలవాటు చేశారు. ఈ క్రమంలో ‘మజ్జిగ మీకు.. మీగడ మాకు’ అన్న సిద్ధాంతాన్ని జగన్‌ రెడ్డి పకడ్బందీగా అమలుచేస్తున్నారు. నిజానికి ఈ సిద్ధాంతాన్ని ఆయన తండ్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొంత అమలు చేశారు. ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను అమలుచేసిన రాజశేఖర్‌ రెడ్డి వాటి మాటున ఏం చేశారో అందరికీ తెలిసిందే. వాటి ఫలితమే నేటి ముఖ్యమంత్రి జగన్‌ ఎదుర్కొంటున్న సీబీఐ కేసులు. 2004కు ముందు రెండు కోట్ల రూపాయల కోసం తాము ఉంటున్న ఇంటిని సైతం తాకట్టు పెట్టడానికి సిద్ధపడిన జగన్‌ రెడ్డి, ఇప్పుడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారంటే ఏం జరిగి ఉంటుందో అర్థం కావడం లేదా? మామూలుగా అయితే అపరిమిత సంపద పోగైనప్పుడు ఎవరైనా సంతృప్తి చెందుతారు. పరివర్తన చెందుతారు. విచిత్రంగా జగన్‌ రెడ్డి విషయంలో ఈ రెండూ కనిపించడం లేదు. అవినీతిని ఎవరూ ఊహించని విధంగా ఆయన కేంద్రీకరించారని ప్రచారం జరుగుతోంది. లిక్కర్‌ వ్యాపారాన్ని టోకుగా మార్చి అవినీతికి పాల్పడటాన్ని జగన్‌ రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంతకుముందు లిక్కర్‌ వ్యాపారులు ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రులకు ఆర్థిక సాయం చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి నెలా నిర్ణయించిన మొత్తాలు అందాల్సిందే. ఈ కారణంగానే దశాబ్దాలుగా లిక్కర్‌ వ్యాపారంలో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటివారు ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు ఇసుక కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరింది. ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అంతా రివర్స్‌ నడుస్తోంది. ఎవరో కన్న బిడ్డలను మరెవరో తమ బిడ్డలుగా సొంతం చేసుకుంటున్నారు. అంటే కంపెనీల యాజమాన్యాలు మారిపోతున్నాయి. ఇక్కడ భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌కు ఉపయోగపడే వారి చూపు ఏ కంపెనీ మీద పడితే అది వారి సొంతమైపోతోంది. సంక్షేమం మత్తులో మూలుగుతున్న ప్రజలకు ఇవేమీ పట్టడం లేదు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేని స్థితికి ప్రజలను చేర్చారు. ప్రభుత్వం నుంచి ఇదే విధంగా శాశ్వతంగా డబ్బు అందుతూనే ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజానీకం ఈ స్థితిలో ఉన్నప్పుడు పాలకులు ఏం చేసినా చెల్లుబాటవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్నది అదే.


అప్పు చేసి పప్పు కూడు!

There should be method in madness అని అంటారు. సంక్షేమ పథకాల అమలుకు కూడా ఒక పద్ధతి ఉండాలి. అందినకాడి అప్పు చేసి సంక్షేమం పేరిట పంచడం సంక్షేమమా? అరాచకమా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కానీ, అధికారులు కానీ వ్యక్తిగతంగా బాధ్యులు కారు. చేసిన అప్పులకు బాధ్యత తీసుకోవలసింది ప్రజలే. ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఏ రాష్ట్రమైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. అప్పుడు పూట గడవడం కష్టమవుతుంది. జగన్‌ రెడ్డి అప్పులు చేస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు పట్ల విజ్ఞత ఉన్న వారెవరికైనా ఆందోళన కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసే అప్పులకు పరిమితి అయిపోవడంతో ఆస్తుల అమ్మకంపై జగన్‌ రెడ్డి సర్కార్‌ దృష్టి సారించింది. రాష్ర్టాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి ప్రభుత్వ అధీనంలోని ఆస్తులను దానికి బదిలీ చేసి వాటిని కుదువ పెట్టి అప్పు చేయబోతున్నారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్తులను ఈ సంస్థకు బదిలీ చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు రహదారులు, భవనాల శాఖకు చెందిన ఆస్తులను కూడా బదిలీ చేస్తోంది. రేపు ఇంకేమి ఆస్తులను బదిలీ చేస్తారో తెలియదు. మొత్తమ్మీద మరికొన్ని రోజులు గడిచేసరికి రాష్ర్టాన్ని కుదవ పెట్టే దిశగా జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ర్టాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా చేయబోయే అప్పులతో ఏమి అభివృద్ధి చేస్తారో, దానివల్ల ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుందో జగన్‌ రెడ్డి చెప్పడం లేదు. అభివృద్ధి పేరిట తెచ్చే అప్పులను సంక్షేమ పథకాలకు మళ్లించడం నేరం అవుతుంది. ఆదాయమార్గాలు పెరగకుండా అప్పులు ఇవ్వడానికి ఆయా సంస్థలు సైతం ముందుకు రాకపోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ర్టాలను అదుపు చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయ అవసరాల కోసం తన బాధ్యత నుంచి తప్పుకుంటోంది. విశాఖపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయాన్నో, మరో భూమినో తాకట్టు పెడితే మేమెందుకు పట్టించుకోవాలి అన్నట్టుగా సమాజం ఉంది. ‘‘జగన్‌ బాబు మాకు ఇచ్చేవి మాకిస్తే చాలు’’ అని లబ్ధిదారులు భావిస్తున్నారు. ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న జగన్‌ రెడ్డి ప్రభుత్వం అంతటితో ఆగకుండా వ్యవస్థలు అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థలోని అధికారులను సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని స్థితికి నెట్టారు. మరో స్తంభమైన న్యాయవ్యవస్థను అడుగడుగునా భయపెడుతున్నారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉండటంతో శాసన వ్యవస్థను ఏకపక్షం చేశారు. నాలుగో స్తంభమైన మీడియాను లొంగదీసుకున్నారు. కాదూ కూడదూ అంటున్న మీడియాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఢిల్లీలోని ఆ ఇద్దరు పెద్దల ఆశీస్సులు ఉన్నంత కాలం తనకు ఢోకా ఉండదని జగన్‌ రెడ్డి నమ్ముతున్నారు.


 ‘స్వీయ’ రక్షణకే పెద్ద పీట!

రెండేళ్ల జగన్‌ పాలనను పరిశీలిస్తే, అప్పులు, సంక్షేమం తప్ప ఇంకేం కనిపించడం లేదు. జగన్‌ ప్రభుత్వం గురించి చెప్పాలంటే.. ‘‘ఎందుకు కూలుస్తాడో తెలియదు.. కట్టింది ఒక్కటి కూడా ఉండదు. కోట్లాది రూపాయలు ఫీజు కింద న్యాయవాదులకు చెల్లిస్తూ ఎందుకు కేసులు వేస్తాడో తెలియదు. గెలిచిన కేసు ఒక్కటీ ఉండదు. ఎందుకు అప్పులు చేస్తాడో తెలియదు.. తీర్చే దారి మాత్రం కనపడదు. టెండర్లు ఎందుకు పిలుస్తారో తెలియదు. ఒక్కరు కూడా టెండర్లలో పాల్గొనరు’’ అన్నట్టు ఉంది. ప్రభుత్వం విశ్వసనీయత, పరపతి కోల్పోవడం అంటే ఇదే! అయినా సరే జగన్‌ రెడ్డి రూటే సెపరేటు! తనను ధిక్కరించిన రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలో కొట్టడం ఇప్పుడు జాతీయ స్థాయిలో జగన్‌కు మరింత అప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో ముఖ్యమంత్రి కూడా కలత చెందుతున్నట్టు చెబుతున్నారు. జాతీయస్థాయిలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతోపాటు ఉత్తరాదిన బలమైన రాజ్‌పుత్‌ వర్గం కూడా రఘురాజుకు సంఘీభావం తెలిపినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం రఘురాజు విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని క్షత్రియులను మంచి చేసుకోవడం ఎలా? అన్నదానిపై జగన్‌ రెడ్డి దృష్టిసారించినట్టు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా క్షత్రియ వర్గానికి చెందిన వారిని నియమించే విషయమై ఆయన యోచన చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ‘అడుసు తొక్కనేల కాలు కడగనేల’ అన్నట్టుగా ముఖ్యమంత్రి పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో జగన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. ఢిల్లీలో పలువురు మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ హోంమంత్రి అమిత్‌ షాతో జరిగిన సమావేశంలో ఏం జరిగి ఉంటుందా? అనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రధాని మోదీ అనుమతి లేకుండా కేంద్ర మంత్రులు ఎవరూ వినతిపత్రాలపై చర్యలు తీసుకోరు. చంద్రబాబు హయాంలో రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ ఇద్దామనుకున్నప్పుడు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో సంప్రదించిన తర్వాత మాత్రమే సదరు ప్యాకేజీకి తుది రూపు ఇచ్చారు. దీన్నిబట్టి చంద్రబాబు అయినా, జగన్‌ రెడ్డి అయినా ఢిల్లీ చుట్టూ ఎన్ని పర్యాయాలు చక్కర్లు కొట్టినా నరేంద్ర మోదీ కరుణ లేకపోతే జరిగేది ఏమీ ఉండదు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలను మభ్యపెట్టడానికి కేంద్రాన్ని అదడిగాం ఇదడిగాం అని చెబుతుంటారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి పర్యటన వల్ల కూడా అంతకంటే ఒరిగేది ఏమీ ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్‌ రెడ్డి ఏమి కోరారో ఇప్పుడూ అవే కోరుతున్నారు. విపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా ప్రయోజనాల గురించి ఊరూరా ప్రచారం చేసిన జగన్‌ రెడ్డి... అధికారంలోకి రాగానే ఈ విషయంలో చేతులెత్తేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్‌ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నష్టపోయారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, ఇవ్వజూపుతున్న ప్రత్యేక ప్యాకేజీనైనా అంగీకరించండి అని అప్పట్లో నేను పదే పదే చెప్పాను. చివరికి సంకుచిత రాజకీయాల పుణ్యమా అని ప్రత్యేక ప్యాకేజీ కూడా రాష్ర్టానికి దూరమైపోయింది. ఇప్పుడు ప్యాకేజీనైనా ఇప్పించండి అని జగన్‌ రెడ్డి కోరడం లేదు. అప్పట్లో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించిన జన సేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు బీజేపీతో జత కట్టారు కనుక ఆయనైనా చొరవ తీసుకుని కనీసం అదే ప్యాకేజీని ఇప్పిస్తే బాగుంటుంది. ‘చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అన్నట్టుగా ప్రజలు సంతృప్తి పడకపోతారా? ఏ నాయకుడైనా తన రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తాడు. జగన్‌ రెడ్డి ఈ విషయంలో ఒక ఆకు ఎక్కువే చదివారు. ఒకవైపు బెయిల్‌ రద్దు పిటిషన్‌, మరోవైపు సీబీఐ కేసుల విచారణ తరుముకొస్తున్నందున రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వీయరక్షణే జగన్‌కు ప్రాధాన్యంగా మారుతోంది. ఈ విషయంలో అమిత్‌ షా ఏ మేరకు హామీ ఇచ్చారో మరికొన్ని రోజులు గడిస్తే గానీ తెలియదు. జగన్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆయన సొంత సమస్య! రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమస్య. ప్రజలు వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా జగన్‌ అండ్‌ కో కపట ప్రచారాన్ని నమ్ముకుని అమలుచేస్తున్నారు. ‘చారానా కోడికి బారానా మసాలా’ అన్నట్టుగా గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. చివరికి కరోనాకు ఆనందయ్య అనే ఆయన ఇస్తున్న మూలికా ఔషధాన్ని కూడా తమ సొంతం అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడాన్ని చూస్తున్నాం కదా! ఉబ్బసం వ్యాధికి హైదరాబాద్‌లోని బత్తిన హరనాథ్‌ గౌడ్‌ కుటుంబం దశాబ్దాలుగా చేప మందు అందిస్తోంది. మృగశిర కార్తె ప్రవేశించిన తొలి రోజు ఇచ్చే ఈ మందు కోసం దేశవ్యాప్తంగా వేల మంది వస్తారు. చేప మందు సజావుగా పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బారికేడ్లు నిర్మించి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తూ వస్తోంది. ఈ చేప మందుపై వివాదం గానీ, ఆ మందుతో ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం గానీ మనం చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిదీ వివాదమే అవుతోంది. అన్నింట్లో రాజకీయ లబ్ధి పొందాలన్న అధికార పార్టీ ఆరాటం వల్ల ఇటువంటి వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆనందయ్య మందు పంపిణీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదే ప్రశ్న. ఆనందయ్య మందును తమ బొమ్మలున్న సీసాలలో నింపి ప్రజలకు పంచిపెట్టడం ద్వారా వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడం ఎబ్బెట్టుగా లేదా? ప్రశాంత్‌ కిశోర్‌లాంటి వ్యూహకర్తల కృషి ఫలితంగా ఏర్పడే ప్రభుత్వాలలో హుందాతనాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. సంక్షేమ రాజ్యం అంటే అప్పులు చేసుకుంటూ పోవడమనే నిర్వచనం కాదేమో! అని జగన్‌ అండ్‌ కో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాదూ కూడదూ అనుకుంటే అధికారంలోకి రావాలనుకుంటున్న మరొకరు ఇంతకంటే ఎక్కువగా పంచిపెడతామని చెప్పి ప్రశాంత్‌ కిశోర్‌ను తలదన్నే వాడిని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి? హతవిధీ!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి



Updated Date - 2021-06-13T05:58:44+05:30 IST