Hiroshima Day: ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు?

ABN , First Publish Date - 2022-08-06T23:37:23+05:30 IST

హిరోషిమా (Hiroshima)పై అమెరికా అణ్వాయుధం జారవిడిచి నేటికి 77 సంవత్సరాలు. ఆగస్టు 6వ తేదీని జపాన్ ‘హిరోషిమా డే’గా

Hiroshima Day: ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు?

న్యూఢిల్లీ: హిరోషిమా (Hiroshima)పై అమెరికా అణ్వాయుధం జారవిడిచి నేటికి 77 సంవత్సరాలు. ఆగస్టు 6వ తేదీని జపాన్ ‘హిరోషిమా డే’గా జరుపుకుంటోంది. సరిగ్గా 77 సంవత్సరాల క్రితం అంటే.. 6 ఆగస్టు 1945న జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణ్వాయుధంతో దాడిచేసింది. ఈ దాడితో హిరోషిమా శవాల దిబ్బగా మారిపోయింది. 1,40,000 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకు అంటే ఆగస్టు 9న నాగసాకి (Nagasaki)పై అమెరికా మరో అణ్వాయుధం ప్రయోగించింది. ఫలితంగా 74వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరు రోజులుపాటు పోరాడిన జపాన్ ఆ తర్వాత లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడింది. 


ఆధునిక ప్రపంచ చరిత్రలో హిరోషిమా, నాగసాకిలపై బాంబుదాడి ఘటనలు మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. అణుబాంబులు మానవాళికి ఎంత చేటుచేస్తాయో చెప్పేందుకు ఈ రెండు ఘటనలు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. అంతేకాదు, దాదాపు 8 దశాబ్దాలు కావొస్తున్నా నాటి దాడి నుంచి ఈ రెండు నగరాలు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేకపోతున్నాయి. ఈ విలయాన్ని ప్రపంచ దేశాలన్నీ కళ్లారా చూసినా సరే వెనక్కి తగ్గడం లేదు. అణ్వస్త్రాలను నానాటికీ పెంచుకుంటూ, పేర్చుకుంటూ పోతున్నాయే తప్ప వాటిని తయారీని మాత్రం ఆపడం లేదు. 


అణ్వస్త్రం చేతిలో ఉంటే మన వైపు మరే దేశమూ కన్నెత్తి చూడలేదన్న ధీమానో, రక్షణ పరంగా తమను తాము బలోపేతం చేసుకోవాలని కోరికో ఏమో గానీ.. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు చెందుతున్న దేశాలు కూడా అణ్వస్త్రాలపై మోజు పెంచుకున్నాయి. ఇబ్బడిముబ్బడిగా వాటిని పెంచుకుంటూ అమ్ములపొదిలో చేర్చుకుంటూ పోతున్నాయి. హిరోషిమా, నాగసాకిపై అణ్వాయుధ దాడి జరిగిన నాలుగేళ్లకు అంటే 1949లో అప్పటి సోవియట్ యూనియన్ తొలిసారి అణుబాంబును పరీక్షించింది. ఆ తర్వాత వరుసగా దేశాలన్నీ ఇదే బాట పట్టాయి. 1952లో యూకే, 1960లో ఫ్రాన్స్, 1964లో చైనా.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అణ్వాయుధ శక్తులుగా మారాయి. 


రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా పలుమార్లు పలు దేశాలు అణ్వాయుధ ప్రయోగాలకు దగ్గరగా వచ్చాయి. అందులో అత్యంత ముఖ్యమైనది 1962లో జరిగిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ (Cuban Missile Crisis). అప్పుడు అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు 13 రోజులపాటు ఈ రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక ప్రతిష్ఠంభన నెలకొంది. 


మరి ఇప్పటి సంగతేంటి?

ప్రస్తుతం 9 దేశాల వద్ద 13 వేలకుపైగా అణువార్‌హెడ్‌లు ఉన్నాయి. సరిగ్గా ఎన్ని బాంబులు ఉన్నాయని చెప్పడం కొంత కష్టమైనపనే. ఎందుకంటే ఈ విషయాలను ప్రభుత్వాలు చాలా రహస్యంగా ఉంచుతాయి. ఐసీఏఎన్ (International Campaign to Abolish Nuclear Weapons) ప్రకారం.. రష్యా వద్ద 6,255 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా అమెరికా వద్ద  5,550 బాంబులు ఉండగా, 350 అణుబాంబులు కలిగిన చైనా మూడో స్థానంలో ఉంది. అంటే, ప్రపంచంలో ఉన్న మొత్తం అణుబాంబులలో దాదాపు 90 శాతం రష్యా, అమెరికా వద్ద ఉన్నాయి. అలాగే, ఫ్రాన్స్ వద్ద 290, యూకే వద్ద 225, పాకిస్థాన్ వద్ద 165, ఇండియా వద్ద 150, ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తరకొరియా వద్ద 50 అణ్వాయుధాలు ఉన్నాయి. 


అయితే, ఈ లిస్ట్‌కు ఇక్కడితో ముగిసిపోలేదు.  నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO), కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (CSTO) ద్వారా తమ తరపున అణ్వాయుధాల వినియోగాన్ని27 దేశాలు ఆమోదించాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్ కూడా ఉన్నాయి.  సోవియట్ యూనియన్ నుంచి అణువార్‌హెడ్లను అందుకున్న బెలారస్, కజకిస్థాన్, ఉక్రెయిన్‌లు 1994లో నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ (NPT)లో చేరిన తర్వాత వారు వాటిని తిరిగి సోవియట్ యూనియన్‌కు అప్పగించాాయి. 


రెండో ప్రపంచ యుద్ధం దారుణంగా ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి అణ్వాయుధాలు ప్రయోగించకుండా ‘అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం’ (NPT)ని ముందుకు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంలో 191 దేశాలు (నార్త్ కొరియా మినహా) ఉన్నాయి. ఇందులో ఐదు అణ్వాయుధ దేశాలు కూడా ఉన్నాయి. ఇండియా, పాకిస్థాన్, నార్త్ కొరియా దేశాలు ఇప్పటి వరకు ఈ ఒప్పందంలో సంతకం చేయలేదు. ఒప్పందాలు సరే.. అణుబాంబుల ప్రయోగం కారణంగా హిరోషిమా, నాగసాకి వంటి నగరాలు ఎంతటి వినాశాన్ని అనుభవించాయో ప్రత్యేక్షంగా చూసిన తర్వాత కూడా ప్రపంచ దేశాలల్లో ఇంకా అణ్వాయుధాలను కూడగట్టుకోవాలన్న మోజు తీరలేదు. అణ్వాయుధాలను సమకూర్చుకుంటూ పోతున్న దేశాలను ఏ ఒప్పందాలు అడ్డుకోలేకపోతున్నాయి. విధ్వంసాన్ని కళ్లారా చూసి కూడా కళ్లు తెరవలేకపోతున్నాయి. అణ్వాయుధాలను బూచిగా చూపి శత్రుదేశాలను భయపెట్టాలనుకునే బలహీనత ఉన్నంత వరకు అణ్వాయుధాలు కుప్పలుతెప్పలుగా పెరిగిపోతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 6ను జపాన్ మాత్రం ‘హిరోషిమా డే’ జరుపుకుంటూనే ఉంటుంది.

Updated Date - 2022-08-06T23:37:23+05:30 IST