చారిత్రక సన్నివేశం

ABN , First Publish Date - 2020-08-06T06:43:04+05:30 IST

రాముడు ఈ దేశమంతటికీ చెందినవాడు, ప్రతి ఒక్కరిలోనూ రాముడున్నాడు– భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం నాడు అయోధ్యలో రామజన్మభూమి ఆలయానికి భూమిపూజ చేసిన...

చారిత్రక సన్నివేశం

రాముడు ఈ దేశమంతటికీ చెందినవాడు, ప్రతి ఒక్కరిలోనూ రాముడున్నాడు– భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం నాడు అయోధ్యలో రామజన్మభూమి ఆలయానికి భూమిపూజ చేసిన సందర్భంగా అన్న మాటలివి. మానవులు రాముడి మీద విశ్వాసం కలిగివున్నప్పుడు పురోగతి జరుగుతోంది, ఆ మార్గం నుంచి వైదొలగినప్పుడు విధ్వంసపు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. అందరి మనోభావాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి, అందరికీ అభివృద్ధి అందించాలి. అందరి మద్దతూ మనకు కావాలి– మోదీ అసాధారణమైన వాగ్ధారలో మరి కొన్ని ఆణిముత్యాలు ఇవి. ఇక, దేశప్రజలందరూ ఈ క్షణం కోసం నిరీక్షిస్తూ ఉన్నారని, అందరూ రామనామంలో పులకించిపోతున్నారని, ప్రపంచమంతా ఈ గుడిగంటలు మారుమోగుతున్నాయని మోదీ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. నిజంగానే, ఈ రోజు అయోధ్య పట్టణంలో జరిగింది ఒక చరిత్రాత్మక ఘటన. స్వాతంత్ర్యానంతర భారతదేశ చరిత్రలో ఆగస్టు 5 వ తేదీకి మరో ప్రాముఖ్యం లభించింది. పోయిన ఏడాది ఇదే రోజున జమ్మూకశ్మీర్‌ ప్రత్యేకప్రతిపత్తిని తొలగించారు. 


రామాలయం భూమి పూజ భక్తులందరికీ గొప్ప సందర్భం. బుధవారం నాడు వార్తాచానెళ్లన్నీ తమ తెరలను రామ్‌లల్లాకే అంకితం చేశాయి. ప్రధాని మోదీ, యుపి ముఖ్యమంత్రి యోగి దగ్గర నుంచి సమస్తమూ కాషాయంలో మెరిసిపోయింది. ఆ పవిత్ర కార్యక్రమంలో ఆధ్మాత్మికత ఎంత ఉన్నదీ, విజయోత్సాహం ఎంత ఉన్నదీ ఎవరికి వారు అంచనా వేసుకోవలసిందే. రెండు నెలలలో జరగవలసి ఉన్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, ఈ భూమిపూజకు సంబంధం ఉన్నదని భావించనక్కరలేదు. వచ్చే ఎన్నికలలోపు ఆలయనిర్మాణం పూర్తి అవుతుందన్న ఊహాగానాలు అవసరం లేదు. నేటి ధార్మిక కార్యక్రమం వెనుక రాజకీయాలే లేకుంటే, ప్రధానమంత్రి అక్కడ ముఖ్య అతిథి కానక్కరలేదు. రెండు పక్షాల మధ్య వివాదం న్యాయస్థానంలో ముగిశాక, అనంతర కార్యక్రమాన్ని అక్కడి ట్రస్టుకు, ధార్మిక సంస్థలకు వదిలి ఉండవచ్చు. కానీ, నిరీక్షించిన దశాబ్దాలలోనే మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయాల పురోభివృద్ధి జరిగింది. రెండు లోక్‌సభ స్థానాల నుంచి, లెక్క లేనంత మెజారిటీకి ప్రయాణం సాగింది. 


మూడున్నర దశాబ్దాల చరిత్ర. ఇప్పటి యువకులకు, పిల్లలకు ఎంత వరకు పరిచయమో తెలియదు. ఒక ఆలయమో, ప్రార్థనాస్థలమో నిర్మించడం సువిశాల భారతదేశంలో పెద్ద విషయమేమీ కాదు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్నామంటే, ఏ కీలక క్రమానికి ఇది పతాక సన్నివేశం అయి ఉండాలి? బుధవారం నాటి క్రతువును, తతంగాన్ని మాత్రమే చూస్తే, దాని పూర్వాపరాలను తెలుసుకోకపోతే, అవగతమయ్యేది అరకొర మాత్రమే. ఒక సుదీర్ఘ వివాదానికి ముగింపు తరువాత, జరిగిన కార్యక్రమం ఇది. ఇప్పుడు స్థానికంగా అయోధ్య వరకు కక్షిదారులు స్నేహితులు అయి ఉండవచ్చును కానీ, ఆ వివాదం దేశమంతటా కల్పించిన విభజన మాత్రం ఈ దేశ సామాజిక జీవనంలో కొనసాగుతుంది. వివాదం ఎట్లా మొదలయింది, ఎవరిది న్యాయం, ఎవరెట్లా ప్రవర్తించారు– వంటి అంశాల చర్విత చర్వణానికి ఇది సమయం కాదు. కానీ, ఈ కాలమంతా కల్లోలంగా గడిచింది, అనేక వినాశక పర్యవసానాలు, అనేక రాజకీయ ప్రయోజనాలు, నష్టాలు– ఈ వివాదం నుంచి జనించాయని విస్మరించలేము.


నరేంద్రమోదీ చెప్పినట్టు, ఈ దేశ సాంస్కృతిక జీవనంలో రాముడు అంతర్భాగం. దేశప్రజలందరి ఉమ్మడి జ్ఞాపకంలో మెలిగే ఇతిహాసాలలో, పురాణాలలో రాముడుంటాడు. జానపదులు చెప్పుకునే కథల్లో, ఆడవాళ్లు పాడే పాటల్లో, కవులు పదే పదే రాసే రామాయణాల్లో రాముడుంటాడు. రకరకాల రాములు మనకు తెలుసు. ఒక ధీరోదాత్తుడయిన రాముడు, వినయవంతుడైన రాముడు, కర్తవ్యనిర్వహణతో నిర్లిప్తుడైన రాముడు, బాలరాముడు, సీతారాముడు, ఇట్లా ఎందరో రాములు మనకు తెలుసు. రాముడు చారిత్రకపురుషుడా, అతని కథనంలో ఉన్న విలువలేమిటి, ఆయన ఆదర్శాలు అనుసరణీయమా– వంటి చర్చలు ఎన్నైనా చేయవచ్చు. చేశారు, చేస్తున్నారు కూడా. రాముడు పాలించిన రాజ్యంలో అంతస్థులు, తరతమభేదాలు ఎట్లా ఉండేవి– అన్న విచికిత్స కూడా హేతువాది అయిన మనిషికి సహజమే. కానీ, ప్రజలకు సులభపరిచితుడైన ఒక పాత్ర రాముడు. ఒక జనామోద నాయకుడు. మేధావులు, విమర్శకులు, లౌకిక వాదులు తమ వ్యూహాలలో ఆ విషయం మరచిపోయారు. అంతేకాదు, ఒక స్థూల, ప్రజా కథనం రామరాజ్యంలో అందరూ సుఖంగా ఉంటారని, అందరికీ న్యాయం జరుగుతుందని చెబుతుంది. ప్రజల నమ్మకం అది. మరో రకంగా చెప్పాలంటే, మనోభావం అది. 


కానీ, దురదృష్టవశాత్తూ రాముడు రాజకీయుల చేతికి చిక్కాడు. రాముడిని తీవ్రంగా విమర్శించినవారి కంటె రాముడి ప్రతినిధులుగా చెప్పుకునేవారే ఆయనకు అన్యాయం చేశారనిపిస్తుంది. అందరికీ ఎంతో సన్నిహితంగా ఉండే కథాపురుషుడిని, కేవలం కోదండరాముడిగా, యుద్ధవీరుడిగా, పరాక్రమానికి మాత్రమే గుర్తుగా మార్చేశారు. రాముడనే ప్రతీకను సరికొత్తగా తీర్చిదిద్దుతున్న క్రమంలో– దేశంలో ఒక అవాంఛనీయ విభజన వాతావరణం కమ్ముకున్నది. విధ్వంసాలు, నిరసనలు, కాల్పులు, కల్లోలాలు, మారణకాండలు, ఉగ్రవాదాలు– అన్నీ సాగరమథనంలోనుంచి పుట్టిన హాలాహలం వలె పుట్టుకువచ్చాయి. ఎంత ప్రాణనష్టం? ఎంతటి మానవీయతను కోల్పోయాము? 


జాతీయవాదపు ప్రతికూలాంశాలను ప్రేమించే శక్తులు, మతాన్ని కూడా దానికి జోడించాయి. మతతత్వం, తీవ్రజాతీయవాదం–ఈ కలయిక అత్యంత ప్రమాదకరమైనది. దైవభక్తే దేశభక్తిగా మారడం– మతరాజ్యాలలో మాత్రమే జరిగే దుర్మార్గం. ఈ ప్రమాదకరమైన క్రీడలో జాతీయోద్యమ కాలం నుంచి భారతదేశంలోని ప్రగతిశీల ప్రయత్నాలన్నీ సృజించిన ఉత్తమ విలువలన్నీ పరాజితమయ్యాయి. చిత్తశుద్ధి, సంకల్పబలం లేని శక్తులు ఎంతటి డొల్లగా మారిపోతాయో, రామాలయ భూమి పూజ సందర్భంగా రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ ఇచ్చిన సందేశాలు చెబుతాయి. వారే కాదు, మందిర్‌ ఉద్యమం ప్రమాదమని, దాన్ని ఎదిరిస్తామని చెప్పుకున్న సామాజిక న్యాయశక్తులు కూడా ఇవాళ నిస్సహాయంగానో, నీరసంగానో మిగిలిపోయారు. ఇక వామపక్షాల వైఫల్యగాథలు చెప్పనక్కరలేదు. మరి కొందరు ప్రధానస్రవంతిలో సంలీనమయ్యారు. భారతీయజనతాపార్టీ రథయాత్ర తన అంతిమలక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, మార్గమధ్యంలో తన ప్రత్యర్థి శక్తులన్నిటినీ చక్రాల కింద తొక్కేసింది. ఇంకా తలలెత్తుతున్న వారెవరన్నా ఉంటే, వారి సంగతి భవిష్యత్‌ ప్రధాని అని ఊహాగానాలు వినిపిస్తున్న యోగి చూసుకుంటారు.


మందిర నిర్మాణ ఆరంభం అప్రియమైన పరిణామపరంపరకు ఒక ముగింపు కూడా. ఇక్కడితో ఈ తరహా ప్రయత్నాలు నిలిచిపోతాయని ఆశించవచ్చునా? ఏమో? ఈ చరిత్ర నుంచి అందరూ గుణపాఠాలు నేర్చుకుంటారని మాత్రం కోరుకోవాలి. ఎందుకంటే, ఈ క్రమం అంతటిలో, విజేతను గెలిపిస్తూ వచ్చింది పరాజితుల డొల్లతనమే, అంచనాలు తెలియని అత్యుత్సాహమే! 

Updated Date - 2020-08-06T06:43:04+05:30 IST