అమరం ఆంధ్రుల చరితం

Published: Sun, 14 Aug 2022 03:44:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమరం ఆంధ్రుల చరితం

  • తెల్లదొరతనంపైతిరగబడ్డ తెలుగుపోరుగడ్డ
  • తలొగ్గని జాతిపొగరుకు తిరుగులేని చిరునామా
  • దేశభక్తుల త్యాగతోరణం తెనాలి రణరంగం చౌక్‌
  • తమ ప్రాణాలు ఇచ్చి ‘క్విట్‌ ఇండియా’కు ఊపిర్లు
  • పెద్దాపురంలో మరో జలియన్‌వాలాబాగ్‌
  • రహస్య స్ధావరాలు ఏర్పరిచి విముక్తి రచన
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేళ 
  • మేల్కొంటున్న విస్మృత గాథలు

ఆడిపాడవోయి విజయగీతిక 

భాష, భావ, సంస్కృతి, సిద్ధాంత వైరుధ్యాల సుడిగుండాలు.. వేర్పాటు వాద కుబుసాలు.. ప్రాంతీయ విభేదాలు.. ఎన్నో.. మరెన్నో సవాళ్లు! ఈ బంధనాల నుంచి బయటపడేందుకు జెండా కర్రకు తాడులో ముడుచుకొని ఉన్న మువ్వన్నెల పతాకం చిటారుకు చేరి విచ్చుకొని.. రెపరెపలాడింది! సవాళ్ల చీకట్లు తొలగినట్లుగా ఆ త్రివర్ణ పతాకంలోంచి రాలిన రంగురంగుల పువ్వులు  అభివృద్ధికి నకళ్లయ్యాయి! వీనుల విందైన జనగణమన  గీతం.. కులమతాలు, ప్రాంతాల కట్టుబాట్లను తెంచుకొని  సోదర భావానికి హితమై.. భిన్నత్వాన ఏకత్వం అనే సందేశంతో జన సమ్మతమైంది! మూడు రంగుల్లోంచి పుట్టిన మన ప్రజాస్వామ్యం, ప్రపంచానికి పురివిప్పిన మయూర పింఛమంత అందం.. తామర పుప్పొడంత సుగంధం.. ఫలరాజు మామిడి అంత మఽధురం.. గంగాజలమంత పవిత్రం! నిజం.. 75 ఏళ్ల స్వతంత్ర భారతం జగతి సిగలో జాబిలమ్మే!! వందనం.. మాతరం!! 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌): స్వేచ్ఛావాయువులకోసం భారత జాతి తన ఊపిరిని జెండాలా ఎగరేసిన వేళ తెలుగునేలా దేశభక్తితో ఊగింది. వలస స్వార్థ పాలనపై నిస్వార్థ త్యాగనిరతి.  తెగువతో తలపడింది. తూటాలకు తనువులను చాలించడానికైనా సిద్ధమే. కానీ, బానిసత్వ విధానాలకు మాత్రం తలవంచలేదు. ‘ఎక్కడుంది తెనాలి?’ అని బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఆరాతీసేలా.. విముక్తి ఉద్యమాన్ని ఆంధ్రులు రగిలించారు. అణచివేత, దమనకాండకు ఎదురొడ్డి ఏడుగురు తమ బలిదానాలతో ఉద్యమాన్ని బతికించుకున్నారు. పెద్దాపురం సభపై జరిపిన లాఠీచార్జి రేపిన ఆగ్రహావేశాలు లండన్‌ పార్లమెంటును కదిలించి దురుసు అధికారుల మెడలు వంచాయి. అంతిమంగా జాగృతమైన జాతి ముందు జాత్యాహంకారం ఓడిపోయింది. జగమెరిగిన, జనంమది గెలిచిన బాపూ, అల్లూరి స్మృతులెన్నో! విస్తృత దేశభక్తుల త్యాగగాథలన్ని! ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేళ తొలిసారి అవన్నీ మేల్కొంటున్నాయి. బెంగాల్‌ విభజన, సంఘ ఉద్దరణ, శాసనొల్లంఘన, క్విట్‌ ఇండియా.. మీదుగా పురివిప్పిన ఆంధ్రుల పోరాటశీలతను అలుపెరగకుండా గానం చేస్తున్నాయి.

అమరం ఆంధ్రుల చరితం

లండన్‌ పార్లమెంటులో ‘పెద్దాపురం’ 

మహాత్మాగాంధీ పిలుపు మేరకు శాసనోల్లంఘనపై కార్యాచరణ కోసం 1930 డిసెంబరు 16న సుమారు 80 మంది మహిళలు, యువకులు, పెద్దలు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని బొక్కా నారాయణమూర్తి తోటలో సమావేశమయ్యారు. అయితే, ఆ ప్రాంతాన్ని బ్రిటిష్‌ పోలీసులు చుట్టుముట్టి సత్యాగ్రహులను విచక్షణారహితంగా కొట్టారు. గాయపడినవారికి చికిత్స అందించడానికి మందులు తీసుకుని వస్తున్న వైద్యులను కూడా వదిలిపెట్టలేదు. 

జలియన్‌వాలీబాగ్‌ దుశ్చర్యను తలపించిన ఈ ఘటనను లండన్‌ పార్లమెంట్‌ ఖండించింది. లండన్‌ న్యూస్‌ పేపర్‌ (ది గార్డియన్‌) పత్రికలో సవివరంగా పెద్దాపురం ఘటన నమోదైంది. జాతీయ కాంగ్రెస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనకు కారణమైన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ డప్పుల సుబ్బారావును బ్రిటీష్‌ ప్రభుత్వం 1931 మార్చి 19న సస్పెండ్‌ చేసింది. 

అమరం ఆంధ్రుల చరితం

మారువేషాల్లో పోరు మంటలు

‘‘అప్పుడు నా వయస్సు 11 ఏళ్లు. కర్ణాటకలోని ధార్వాడ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాను. స్వాతంత్య్ర వీరులకు మా ఇల్లు కేంద్రంగా ఉండేది. పోరాటాల్లో పాల్గొనే చాలామంది మారువేషాల్లో మా ఇంటికి వచ్చేవారు. కర్మోకర్‌ అనే వ్యక్తి స్త్రీ వేషంలో, దివాకర్‌ అనే వ్యక్తి రైతు వేషంలో వచ్చారు. 

వీరు ఇంట్లో ఉంటే... బయట బ్రిటిష్‌ పోలీసులు తుపాకులతో తిరుగుతుండేవారు. 1939 నాటి ప్రపంచ యుద్ధ పరిస్థితుల్లో  బియ్యం, కంది పప్పు, ఇతరత్రా వస్తువులు లేక పస్తులు గడిపాం. క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటైంది. సొంతంగా మేమే దుస్తులు నేసేవాళ్లం. 1947 ఆగస్టు 15న ఉదయం 7 గంటలకు  ధార్వాడ పాఠశాలలో,  పురవీధుల్లో మిఠాయిలు పంచుతూ జాతీయ జెండాను ఎగరేసి  సంబరాలు చేసుకున్నాం’’ 

- వాదిరాజ రాఘవేంద్రాచార్య పంచముఖి రాష్ట్రపతి అవార్డు గ్రహీత


సత్యాగ్రహుల రహస్య స్థావరం

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సమీపాన పెన్నానది ఒడ్డున సత్యాగ్రహుల రహస్య స్థావరం ‘సేవా మందిరం’. మహాత్మాగాంధీ పిలుపు మేరకు వ్యాపారవేత్త ఏఎం లింగణ్ణ ఏర్పాటుచేసిన ఈ మందిరం జాతీయోద్యమ మలుపులకు నిలువెత్తు సాక్షి. కర్ణాటకలోని తుమకూరు జిల్లా పట్టనాయకనహళ్లిలో అట్టెన్న, మాద్దెమ్మ దంపతులకు 1905 డిసెంబరు 10న ఏఎం లింగణ్ణ జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో జైలుశిక్ష అనుభవించారు. 1942లో సేవా మందిరం ఏర్పాటుచేశారు. రాజాజీ చేతులమీదుగా ఈ మందిరం ప్రారంభించారు. జాతీయోద్యమంలో రహస్య జీవితం గడుపుతున్న నాయకులకు ఈ మందిరం ఆశ్రయమిచ్చింది. 1947లో మైసూరు సంస్థానం స్వాతంత్య్ర పోరాటం కోసం పౌరవాణి పత్రికను స్థాపించింది. అప్పటి మద్రాసు, మైసూరు పరిధిలో 14 రహస్య శిబిరాలను ఏర్పాటుచేసి పత్రికను జనంలోకి తీసుకెళ్లగా, ఈ కార్యకలాపాల ప్రధాన కేంద్రంగా సేవామందిరం ఉండేది. స్వాతంత్ర్యానంతరం మద్రాసు రాష్ట్ర ప్రెసిడెన్సీ హోదాలో రాజాజీ ఇక్కడ జాతీయ జెండా స్థూపాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ, నెహ్రూ వంటి నేతలు సేవామందిరాన్ని సందర్శించి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల తమ సంతృప్తిని సందేశాలుగా లిఖించారు. ఈ మందిరాన్ని 1944లో మరింత విస్తరించి పాఠశాలను కూడా లింగణ్ణ ప్రారంభించారు.

అమరం ఆంధ్రుల చరితం

పురి విప్పిన చైతన్యంపై ‘ఉరి’కొయ్య

అల్లూరి సీతారామరాజు రగిలించిన విప్లవాగ్ని ఏజెన్సీ ప్రాంతాలను మండించింది. అల్లూరి పోరాటాలకు ప్రభావితమైన పార్వతీపురం స్వాతంత్ర్యోద్యమ గడ్డగా మారింది. దీంతో పార్వతీపురం కేంద్రంగా బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని అమలుచేసింది. ఈ క్రమంలో ఇక్కడ సబ్‌జైలును ఏర్పాటుచేసింది. ఉరి తీయడానికి వేదికను కూడా ఈ జైలులో నెలకొల్పారు. గిరిజన గూడేల్లోని ప్రజలను, గూడేల పెద్దలను పట్టుకుని వచ్చి హించించి, రాజద్రోహ అభియోగాలు మోపి ఈ జైలులో ఉరి తీసేవారట! గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాలకొండ, సీతంపేట నుంచి పదుల సంఖ్యలో ఉరికంపాలు ఎక్కారు. పార్వతీపురంలో నిర్బంధం తీవ్రస్థాయిలో అమలవుతున్న దశలో.. అక్కడకు వెళ్లడానికి మహాత్మాగాంధీ, నెహ్రూ పలు దఫాలు ప్రయత్నించి వీలు కాక వెనుదిరగాల్సి వచ్చింది. పార్వతీపురం సబ్‌జైలును 1935 తర్వాత సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఇక్కడి కట్టడాలు, భవనాలు నిరుపయోపంగా పడి ఉన్నాయి.


అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు 1923లో కాకినాడలో జరిగాయి. ఈ సభలకు హాజరైన మహాత్మాగాంధీకి కొందరు దేశభక్తులు పొందూరు నుంచి తెచ్చిన ఖద్దరు కండువా బహూకరించారు. గాంధీ పర్యటనలో విరాళంగా వచ్చిన ఆభరణాలు, బహుమతులను అక్కడికక్కడే వేలం వేయడం ఆనవాయితీ. ప్రముఖ సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు (గోరా) తండ్రి, అప్పటి కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారిగా పనిచేసే గోపరాజు సుబ్బారావు రూ.100కు ఈ కండువాను దక్కించుకున్నారు. ఆ విషయం తెలిసి బ్రిటిష్‌ పాలకులు కొద్దిరోజులు ఆయనను సస్పెండ్‌ చేశారు. ఆయన కుమార్తె రాచర్ల సామ్రాజ్యం, ఆమె తదనంతరం మనుమడు రాచర్ల మహేశ్‌ ఆ కండువాను భద్రపరుస్తూ వస్తున్నారు. కండువాపై ఖద్దరుతో నేసిన శ్లోకం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

అమరం ఆంధ్రుల చరితం

తూటాలకు తల వొగ్గక.. తెగువకు తోరణం రణరంగం చౌక్‌

తెల్లదొరలు దేశం విడిచి వెళ్లాలంటూ 1942లో అఖిల భారత కాంగ్రెస్‌ ఇచ్చిన క్విట్‌ ఇండియా పిలుపుతో తెనాలి అట్టుడికింది. ముంబైలో ఆగష్టు 8న జరిగిన క్విట్‌ ఇండియా కార్యక్రమ సన్నాహాల సమావేశంలో తెనాలి నుంచి కల్లూరి చంద్రమౌళి, వెలువోలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు, అవుతు సుబ్బారెడ్డి, శరణం రామస్వామి పాల్గొన్నారు. తెనాలి తిరిగి వచ్చాక ఆగస్టు 11న ఉద్యమానికి అడుగులు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇంతలో గాంధీజీ అరెస్టు వార్త తెనాలిని దావానలంగా మండించింది. నిరసనగా ఆగస్టు 12న తెనాలి బంద్‌లో జనం ఆగ్రహావేశాలు ఎగసిపడ్డాయి. రైల్వేస్టేషన్‌ లోపలకు దూసుకెళ్లి దుకాణాలను ధ్వంసం చేశారు. నార్త్‌ క్యాబిన్‌ దగ్గర ఆయిల్‌ ట్యాంకర్‌కు నిప్పంటించారు. గూడ్స్‌ వ్యాగన్లలో సామగ్రిని తగలబెట్టారు. విదేశీ మద్యం వ్యాగన్‌ను, రైల్వే బుకింగ్‌ ఆఫీ్‌స సామగ్రిని భస్మీపటలం చేశారు. 


బ్రిటిష్‌ ప్రభుత్వం ఉలిక్కిపడింది. రైల్వే స్టేషన్‌ నుంచి సబ్‌ట్రెజరీ కార్యాలయం వైపు సమూహాలుగా కదులుతున్న ఉద్యమకారులను పాత బస్టాండ్‌ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కాల్పులకు తెగబడ్డారు. అయినా.. వెరవకుండా తూటాలకు సత్యాగ్రహులు గుండె చూపారు. వారి రక్తంతో పాత బస్టాండ్‌ ప్రాంతం ఎరుపెక్కింది. కాల్పుల్లో భాస్కరుని లక్ష్మీనారాయణ, మజేటి సుబ్బారావు, శ్రీగిరి లింగం, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, జాస్తి అప్పయ్య, ప్రయాగ రాఘవయ్య నేలకొరిగారు. వారు ప్రాణాలర్పించిన ప్రాంతానికి రణరంగం చౌక్‌గా నామకరణం చేశారు. 1959లో అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ ఆలపాటి వెంకటరామయ్య వరుసగా ఏడు స్థూపాలను ప్రతిష్ఠించారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు కామరాజ్‌ నాడార్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆవిష్కరించారు. ఏటా ఆగస్టు 12న రణరంగం చౌక్‌ వద్ద స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

కఠెవరం బాంబు కేసు..

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమాల్లో తెనాలి కూడా భాగం పంచుకుంది. తెనాలి పక్కనే ఉన్న కఠెవరం, దగ్గర్లోని గ్రామాల యువకులు  బాంబుల తయారీలో శిక్షణ తీసుకున్నారు. చెన్నై-ఢిల్లీ రైలు మార్గం పేల్చివేతకు పఽథకం వేశారు. 1909 ఏప్రిల్‌ 2న కఠెవరం కట్టపై పెట్టిన టెంకాయ బాంబు పేలటంతో పశువుల కాపరి మరణించటం సంచలనం కలిగించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం విచారణ నిర్వహించింది. లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్యలకు పదేళ్ల జైలు, చుక్కపల్లి రామయ్యకు ద్వీపాంతరవాస శిక్ష విధించింది. 

అమరం ఆంధ్రుల చరితం

శాంతి శిక్షణాలయం

బ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యం అనే సత్యాగ్రహి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి 25 కిలోమీటర్ల దూరంలోని సీతానగరంలో గౌతమి సత్యాగ్రహాశ్రమం నిర్మించారు. సుబ్రహ్మణ్యం ప్రముఖ వైద్యుడు. స్వాతంత్య్ర సందేశాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లి.. ప్రజలను ఉద్యమంలోకి తీసుకురావాలన్న గాంధీజీ మాటలను గుండెల నిండా నింపుకున్న యువకుడు ఆయన. అల్యూమినియమ్‌ వ్యాపారి శేట్‌ జీవన్‌లాల్‌ అందించిన ఆర్థిక సహాయంతో 1924 నవంబర్‌ 9న గౌతమి సత్యాగ్రహాశ్రమం స్థాపించారు. సత్యాగ్రహులకు ఈ ఆశ్రమం తర్ఫీదు ఇచ్చేది. గాంధీజీ సతీమణి కస్తూర్బాగాంధీ మరణించిన తర్వాత.. కస్తూర్బాగాంధీ ఆశ్రమంగా పేరు మార్చారు. 

అమరం ఆంధ్రుల చరితం

కొల్లాయి కడితేనేమీ..

బాపట్ల జిల్లా రేపల్లెలోని కావూరు గ్రామానికి చెందిన తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు మహాత్ముడికి విరాళంగా 50 ఎకరాల భూమిని దానం చేశారు. ఈ స్థలంలోనే అనంతరకాలంలో వినయాశ్రమం ఏర్పాటయింది. విరాళం అందుకోవడానికి వచ్చిన సందర్భంలో 1933 డిసెంబరు 23న ఇక్కడ గాంధీజీ అశ్వద్ధ వృక్షాన్ని నాటారు. ఈ మొక్క ఇప్పుడు మహా వృక్షమై చారిత్రక స్థలిగా మారింది. 

అమరం ఆంధ్రుల చరితం


అమరం ఆంధ్రుల చరితం

బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలోని వేటపాలేనికి 1929లో గాంధీజీ వచ్చారు. వేటపాలెంలోని లైబ్రరీని సందర్శించి ఓ గదికి శంకుస్థాపన చేసే క్రమంలో జరిగిన తోపులాటలో ఆయన చేతికర్ర విరిగింది. దానిని లైబ్రరీకి తన గుర్తుగా ఆయన బహూకరించారు. కొద్దిపాటి మరమ్మతులు చేసి లైబ్రరీలో గాంధీజీ చేతికర్రను అప్పటినుంచి ప్రదర్శనకు ఉంచారు.


బాపట్ల జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన 12మంది సత్యాగ్రహులు గాంధీజీతో పాటు జైలు జీవితం అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం వారంతాకలిసి 1956లో ఏర్పాటుచేసిన విజయ స్తూపం ఇది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ స్తూపాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.


సమరయోధుల ‘సర్వోదయం’

స్వాతంత్ర్యోద్యమంలో తెగించి పోరాడిన విజయవాడ రెండు ఘనతలను సొంతం చేసుకుంది. జాతీయోద్యమ యోధులంతా ఈ నగరం వేదికగానే సంఘం ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం పరిధిలో జరిగిన తొలి మహాసభలకు కూడా విజయవాడే ఆతిథ్యం ఇచ్చింది. అన్నే అంజయ్య అధ్యక్షుడిగా, కాట్రగడ్డ మధుసూదనరావు చైర్మన్‌గా, తంగిరాల వీరరాఘవరావు ప్రధాన కార్యదర్శిగా 1974లో కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం బెజవాడలో ఏర్పడింది. మరుసటి ఏడాది బందరు లాకులకు సమీపాన 48 సెంట్ల స్థలం సమకూరింది. ఈ స్థలంలోనే  స్వాతంత్య్ర సమరయోధుల భవనం రూపుదిద్దుకుంది.  స్వరాజ్యం సిద్ధించాక ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్య్ర సమరయోధుల మహాసభను 1988లో బెజవాడలో నిర్వహించారు. నాటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ హాజరయిన ఈసభకు వేలమంది తరలిరావడం అప్పట్లో సంచలనం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.