అది 1822, ఆగస్టు 10... క్షణాల్లో గాల్లో కలిసిన వేల ప్రాణాలు... చరిత్ర మరువలేని సంఘటన!

ABN , First Publish Date - 2022-08-10T14:53:13+05:30 IST

ప్రపంచ చరిత్రలో భూకంపాలు పలు నగరాలను...

అది 1822, ఆగస్టు 10... క్షణాల్లో గాల్లో కలిసిన వేల ప్రాణాలు... చరిత్ర మరువలేని సంఘటన!

ప్రపంచ చరిత్రలో భూకంపాలు పలు నగరాలను నాశనం చేసిన ఉదంతాలు చాలా చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రతతో ఒకేసారి వేలాది మంది ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయిన ఘటనలు కూడా ఉన్నాయి. 1822 ఆగస్టులో చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే భూకంపం సంభవించింది.  ఆ ఏడాది ఆగష్టు 10-13 తేదీల మధ్య సిరియాలో అత్యంత భీకరమైన భూకంపం సంభవించింది, దీని కారణంగా  ఏకంగా 20 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే 60 వేల మంది వరకూ మరణించి ఉండవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. 


1822లో ఆగస్టు 5 నుండి సిరియా చుట్టుపక్కల ప్రాంతాలలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ప్రారంభమయ్యింది.  ఆగస్టు 13 నాటికి, అవి పెద్ద ప్రకంపనలుగా మారాయి. ఏకంగా 40 సెకండ్ల పాటు భూకంపం సంభవించింది. 8 నిమిషాల వ్యవధిలో దాదాపు 30 ప్రకంపనలు సంభవించాయి. భూకంపం టర్కీలోని గాజియాంటెప్ నుండి అంటాక్యా వరకు, సిరియాలోని అలెప్పో నుండి ఖాన్ షెఖున్ వరకు విస్తరించింది. ఈ ప్రాంతంలో తీవ్రమైన నష్టం సంభవించింది. ఆ సమయంలో భూమి భారీగా బీటలువారింది. భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఒరోంటెస్ నది వంతెనలు పూర్తిగా కూలిపోయాయి. నదిలోని నీరు పైకి ఉబికివచ్చింది. హరేమ్, అర్మానాజ్‌లలో తీవ్ర నష్టం సంభవించింది. చాలా చోట్ల నదిలో కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. ఇస్కెండూరులో పలు ఇళ్లు నీటమునిగాయి. పాయస్‌లో కొన్ని ఇళ్లు భూమిలోకి కూరుకుపోయాయి. లటాకియాలో మూడింట ఒక వంతు ధ్వంసమైంది. ఈ భూప్రకంపనలు చాలా రోజులు కొనసాగాయి. ఈ భూకంపాలలో మరణించిన వారి సంఖ్య దాదాపు 60 వేలకు చేరువలో ఉన్నట్లు చెబుతుంటారు. 



Updated Date - 2022-08-10T14:53:13+05:30 IST