Advertisement

మౌనం మలచిన చరిత్ర

Jul 14 2020 @ 01:07AM

ప్రాచీన మగధలో ఆర్య చాణక్యుడు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాట్లను సంఘటించాడు. అయితే ఆధునిక తెలుగుసీమలో ఆధిపత్య భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పీవీ అటువంటి సాహసాలకు పూనుకోలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు రాజీనామా చేసినప్పటికీ పీవీ మౌనంగా ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది పూర్తిగా భూస్వామ్య వర్గాల చేతుల్లోకి పోతుందని పీవీకి తెలుసు. అటువంటి తెలంగాణ రాజకీయాలలో ఆయనకు ఎటువంటి పాత్ర వుండబోదు. కనుకనే పీవీ మౌన రాజకీయవేత్తగా వ్యవహరించారు.


చాలాసంఘటనలు చరిత్రకారుల దృష్టిలోకి రావు. వారు సాధారణంగా ‘చరిత్రాత్మక’ సంభవాలనే పరిగణనలోకి తీసుకుంటారు. పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ) రాజకీయ ప్రస్థానం, ప్రధానమంత్రిగా దేశ పాలన, ఆర్థిక రంగాలలో ఆయన తీసుకువచ్చిన మౌలిక మార్పుల గురించి విశ్వవిద్యాలయాలలో నిశిత, సమగ్ర అధ్యయనాలు జరగలేదు. అసలు డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా పీవీకి చాలామంది విద్యావేత్తలు ఇవ్వడం లేదన్నది ఒక నిష్ఠుర సత్యం. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మళ్ళీ మన స్మృతి పథంలోకి పీవీని తీసుకువచ్చారు. ఏ రాజకీయ వేత్త అయినా చారిత్రక ఘట్టాలు, చరిత్ర నిర్మాతల గురించి మాట్లాడుతున్నాడంటే అది సంబంధిత ఘటనల, వ్యక్తుల యోగ్యతను బట్టి గాక, తన రాజకీయ అవసరాల దృష్ట్యానే అని చెప్పక తప్పదు. అయితే పీవీని స్మరించుకోవడం అనివార్యం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. అందునా తెలుగు వాడు. తెలుగు వారందరూ నేర్చుకోవల్సిన పాఠాలు ఆయన జీవితంలో ఉన్నాయి.


హైదరాబాద్ సంస్థానంలో జాతీయోద్యమం విస్తరిస్తున్న దశలో పీవీ యువకుడుగా ఉన్నారు. ఆయన కేవలం పట్వారీ కుటుంబం నుంచి వచ్చిన వాడు మాత్రమేకాదు, వతన్ దార్ వంశస్థుడు కూడా. తొలి నాటినుంచీ నిజాం నవాబుకు అనుకూలంగా వ్యవహరించిన కులీనులు వతన్ దార్లు. అయితే పీవీని ఆయన విద్యార్థి జీవితంలోనే భారత జాతీయోద్యమం విశేషంగా ప్రభావితం చేసింది. తెలంగాణ ప్రాంతంలో నవ జాగృతికి దోహదం చేసిన ఆంధ్ర మహాసభ స్ఫూర్తి ఆయన వ్యక్తిత్వంలో అంతర్భాగమయింది.


హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో పీవీ రాజకీయ జీవితం ప్రారంభమయింది. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా కౌలుదారులు, వ్యవసాయ కూలీలు చేస్తున్న పోరాట ఫలితంగా క్లిష్ట పరిస్థితుల నెదుర్కొన్న గ్రామీణ పెత్తందారుల పట్ల పీవీకి సానుభూతి ఉండేది. నిజాం రాచరిక వ్యవస్థను పూర్తిగా కూలదోయడం కాకుండా హైదరాబాద్ సంస్థానంలో ‘బాధ్యతాయుత ప్రభుత్వం’ను అంటే రాజ్యాంగబద్ధ రాచరిక వ్యవస్థ నేర్పాటు చేయాలన్నదే స్టేట్ కాంగ్రెస్ లక్ష్యంగా ఉన్నది. తెలంగాణలోని ఈ ప్రత్యేక రాజకీయ వాతావరణం నుంచి పీవీ ప్రభవించారు. తెలంగాణ రైతాంగ పోరాటం లక్ష్యించిన మౌలిక సామాజిక పరివర్తనను గాక పార్టీ రాజకీయాలు వర్థిల్లాలని కోరుకుంటున్న రాజకీయ వాతావరణమది. రైతాంగ పోరాటకారుల ఉద్యమం తమను చరిత్ర చెత్తబుట్టలోకి పారవేయవచ్చని ఆ యువ కాంగ్రెస్ నాయకుడు భయపడ్డారు. అయితే ఎన్నికల సంస్కరణల ద్వారా ప్రజాస్వామిక పాలనను నెలకొల్పాలని పీవీ ప్రగాఢంగా ఆశించారు. ఆంధ్ర మహాసభ సాహిత్య సంస్కృతి ఆయన్ని అమితంగా ప్రభావితం చేసింది. తెలుగు జాతీయ వాద లక్షణాలనన్నిటినీ ఆయన పుణికి పుచ్చుకున్నారు. చివరివరకు ఆయనలో ఆ జాతీయ జాగృతి స్ఫూర్తి నిండుగా వెలుగొందుతూనే ఉన్నది. పీవీ పరిపూర్ణంగా ఒక అచ్చమైన తెలుగు బిడ్డ.


ఆంధ్రప్రదేశ్ (తెలుగు ప్రజల సమైక్య రాష్ట్రం) పాలనలో కులం పాత్రను ఒక రాజకీయ వేత్తగాపీవీ అర్థం చేసుకున్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంత ఆధిపత్య భూస్వామ్య సామాజిక వర్గం వారైన రెడ్లు ఆంధ్రప్రదేశ్ పాలనాధికారాలను స్వాయత్తం చేసుకొని గుత్తాధిపత్యం చెలాయించసాగారు. 1960ల తొలినాళ్ళలో ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య, తెలంగాణలో భూ సంస్కరణలు లేదా పరిమితులను అమలుపరచడం, ఇతర వెనుకబడినవర్గాల (ఓ బీసీ) వారికి రిజర్వేషన్లు అమలుపరచడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆ పెత్తందారీ సామాజిక వర్గాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో ఓబీసీ జనాభా అత్యధిక సంఖ్యలో ఉన్నందున ఆ వర్గాల వారు, తాను తలపెట్టిన రాజకీయ మార్పును సుసాధ్యం చేయడంలో నిర్ణయాత్మక పాత్ర వహించగలరని సంజీవయ్య ఆశించారు. తెలంగాణలో ఆ భూస్వామిక వర్గం వారిని అదుపు చేసేందుకు, రాజకీయ పోరాటాలలో ఓ బీసీలను క్రియాశీలమూ, కీలక శక్తులుగా చేసేందుకు ప్రయత్నిస్తున్న పీవీ, సంజీవయ్య విధానాన్ని అంగీకరించారు, అనుసరించారు. అయితే పీవీ ఆశించిన విధంగా ఆధిపత్య భూస్వామ్య కులాల పెత్తందారీ తనాన్ని తోసిపుచ్చడమనే చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు కలిసిరావడంలో తెలంగాణలోని వెనుకబడిన వర్గాల వారు విఫలమయ్యారు. నీలం సంజీవరెడ్డి రాజకీయ క్రీడలలో పావులయ్యారు. ఫలితంగా పీవీ తన రాజకీయ పునాదులను సుస్థిరం చేసుకోలేక పోయారు. పర్యవసానంగా మౌనమే ఆయన రాజకీయ వ్యూహమయింది. తెలంగాణ విద్యావంతులు, ప్రభుత్వోద్యోగులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీసుకురావడంతో భూస్వామ్య కులాల ఆధిపత్యాన్ని కూలదోసే విషయం ఉపేక్షింపబడింది. ఆంధ్ర రాజకీయ వేత్తల శక్తి సామార్థ్యాలేమిటో పీవీకి బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వారిది ఉడుంపట్టు కావడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు.


తెలంగాణలోని ఇటువంటి రాజకీయ వాతావరణంలో, పోరాడి కాకుండా మౌనం వహించడం ద్వారానే పీవీ రాజకీయంగా ఎదిగారు. ప్రాచీన మగధలో ఆర్య చాణక్యుడు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాట్లను సంఘటించాడు. అయితే ఆధునిక తెలుగుసీమలో ఆధిపత్య భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పీవీ అటువంటి సాహసాలకు పూనుకోలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు రాజీనామా చేసినప్పటికీ పీవీ మౌనంగా ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది పూర్తిగా భూస్వామిక సామాజిక వర్గమైన రెడ్ల చేతుల్లోకి పోతుందని పీవీకి తెలుసు. అటువంటి తెలంగాణ రాజకీయాలలో ఆయనకు ఎటువంటి పాత్ర వుండబోదు. కనుకనే పీవీ మౌన రాజకీయవేత్తగా వ్యవహరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో 1957 నుంచి 1977 వరకు పీవీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో విజయం సాధిస్తూ వచ్చారు. 1962–-73 మధ్య మంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేకపోయారు. అప్రధాన రాజకీయవేత్తగా ఉండిపోవడమే ఆయన రాజకీయమైపోయింది.. కుటుంబం, బ్రాహ్మిణ్, భూస్వామి, విద్యాధికుడు నేపథ్యాలు ఆయన్ని రాజకీయాలలోకి తీసుకువచ్చాయి. అవే ఆయన రాజకీయ జీవితాన్ని కాపాడాయి. ఆయన సంతృప్తి పడ్డారు. పీవీ ఒక సంప్రదాయ భూస్వామ్య రాజకీయవేత్త. రాజకీయ ఉన్నతికి ఆయన ఆరాటపడకపోలేదు. ఆశించింది లభిస్తే మంచిదే, లభించకపోతే పోయేదేమీ లేదనేదే ఆయన వైఖరి. అవకాశాలకోసం ఆరాటపడడం కంటే అవి తన వద్దకు వచ్చేదాకా ఆయన వేచివున్నారు. అలా మౌనంగా ఉండిపోవడమనే వ్యూహమే పీవీ 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేసింది. తెలంగాణ ప్రాంతీయుడు కావడంతోపాటు విశాలాంధ్ర వాది కావడం కూడా ఆయనికి కలిసివచ్చింది.


రెడ్డి కులస్థుల భూస్వామ్య ఆధిపత్యాన్ని అదుపు చేయడం, వెనుకబడిన వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించడమనే సంజీవయ్య విధానాన్ని అనుసరించడం ద్వారా విశాలాంధ్ర ప్రజాస్వామిక ఎజెండాను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రిగా పీవీ ప్రయత్నించారు. ఈ లక్ష్య పరిపూర్తికి ఆంధ్ర ప్రాంత ప్రజల మద్దతును పొందడంలో ఆయన విఫలమయ్యారు. ఆంధ్ర రాజకీయ వేత్తల నుంచి పీవీకి పదవీ గండం ఏర్పడింది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. 1970ల నాటికి కొత్త రాజకీయవర్గం ప్రభవించింది. ఎలాగైనాసరే అధికారాన్ని స్వాయత్తం చేసుకోవడమే ఈ కొత్త రాజకీయ వర్గాల లక్ష్యమైపోయింది. స్థానిక రాజకీయాల వాతావరణం ఆయనకు ఇంకెంత మాత్రం అనుకూలంగా లేకుండా పోయింది. ఈ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పీవీ తన మనుగడను కోల్పోయారు. 1977లో పీవీ పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. దరిమిలా వరుసగా ఆరు సార్వత్రక ఎన్నికలలో (రెండు సార్లు మాత్రమే హన్మకొండ నుంచి) విజయం సాధించారు. 1975-–80 మధ్య ఇందిరాగాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమెకు తిరుగులేని మద్దతుదారుగా పీవీ నిలిచారు. తద్వారా కాంగ్రెస్ జాతీయ రాజకీయాలలో ఆయన సుస్థిరంగా నిలదొక్కుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ స్థాయిలో రాజకీయ అనుభవాలు, నెహ్రూవియన్ ప్రజాస్వామిక ఆదర్శాలకు నిబద్ధత, భూసంస్కరణలు, మరీ ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల వారికి రాజకీయ అధికారాల బదిలీ మొదలైనవి 1980ల్లో ఇందిరకు పీవీని మరింత ఉపయుక్తుడిని చేశాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఆహ్వానించవలసిన రాజకీయ ఆవసరాలను, ప్రైవేటీకరణ విధానాల అనివార్యతను ఈ కాలంలో పీవీ బాగా అవగతం చేసుకున్నారు. తత్కారణంగానే రాజీవ్ గాంధీ హత్యానంతరం కేంద్రంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు ఆయన అర్హుడయ్యారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, దేశీయ వ్యాపార సంస్థలపై నియంత్రణలను ఎత్తివేయడం మొదలైన చర్యలతో దేశ ఆర్థిక వ్యవ్థను సురక్షితంగా దరిచేర్చడంలో పీవీ సఫలమయ్యారు. ఆర్థిక వ్యవహారాలు, దేశ భద్రత, విదేశీ వ్యవహారాలలో సమర్థులైన నిపుణులు సహాయ సహకారాలతో ఆయన ఐదేళ్ళ పాటు దేశాన్ని పాలించారు. పాలనలో నిపుణులపై ఆధారపడడమనేది నెహ్రూవియన్ సంప్రదాయం. అయోధ్యలోని బాబ్రీమసీదు వ్యవహారంలో పీవీ రాజకీయ దక్షత ఏమిటో మనకు స్పష్టమవుతుంది. మసీదు కూలిపోతే ఆ సమస్య ఎటు వంటి మతపరమైన భావోద్వేగాలకు తావులేకుండా శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అసంగతమైపోతుందని ఆయన భావించారు. అయితే బాబ్రీమసీదు కూల్చివేత వ్యవహారం బీజేపీకి అదనపు రాజకీయ లబ్ధినే సమకూర్చింది. అయితే మసీదును వేరే ప్రదేశానికి మార్చాలన్న విషయాన్ని పునరుద్ఘాటించడం ద్వారా సుప్రీంకోర్టు ఆ సమస్యను పీవీ భావించిన విధంగానే పరిష్కరించింది.

ఇనుకొండ తిరుమలి

చరిత్రకారుడు

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.