Advertisement

చరిత్ర నిధులు, సత్యశోధకులు

Jan 24 2021 @ 01:01AM

సరిగ్గా ఏడాది క్రితం న్యూఢిల్లీలోని ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ’ (క్లుప్తంగా నెహ్రూ లైబ్రరీ)లో ఉన్నాను. నా పరిశోధనా వ్యాసంగం నిమిత్తం అక్కడకు వెళ్ళాను. ఆధునిక భారతదేశ చరిత్ర గురించిన ప్రైవేట్ పత్రాలు, పత్రికలు, మైక్రోఫిల్మ్‌లను సంగ్రహించి భద్రపరిచిన విస్తృత భాండారమది. ఆ అద్భుత చారిత్రక పత్రాల భాండాగారాన్ని నేను తొలుత 1980 దశకం తొలినాళ్ళలో సందర్శించాను. నేను ఢిల్లీలో నివశించిన కాలంలో 1988 నుంచి 1994 వరకు ‘నెహ్రూ లైబ్రరీ’ని అధ్యయనాలు, పరిశోధనలకు పరిపూర్ణంగా ఉపయోగించుకున్నాను. ఆ కాలంలో నేను వారంలో రెండు రోజులు పూర్తిగా ఆ భాండాగారంలో గడిపేవాణ్ణి. ఆధునిక భారతదేశ చరిత్ర నిర్మాతలు అయిన అగ్రనాయకులు, ఉప నాయకులు, సంస్కర్తలు, సాహితీవేత్తలు మొదలైన వారి వ్యక్తిగత పత్రాలు; పాతపత్రికల సంపుటాలను నా పరిశోధనల నిమిత్తం శోధించాను.


1994లో నేను బెంగలూరులో స్థిరపడ్డాను. ఏటా నాలుగు సార్లు ప్రత్యేకంగా న్యూఢిల్లీ వెళ్ళి నెహ్రూ లైబ్రరీలో నా అధ్యయనాలు కొనసాగిస్తుంటాను. సాధారణంగా జనవరి, ఏప్రిల్, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో నేను న్యూఢిల్లీలో వారం లేదా పదిరోజుల పాటు బస చేస్తుంటాను. ‘నెహ్రూ లైబ్రరీ’కి సమీపంలోని ఒక వసతి గృహంలో మకాం చేసి ప్రతి ఉదయం 9 గంటలకు ఆ లైబ్రరీలోని రాతప్రతుల విభాగానికి వెళతాను. అక్కడ ఒక కిటికీ పక్కనే ఉన్న డెస్క్ వద్ద కూర్చుని నాకు కావలసిన ఫైళ్ళను తెప్పించుకుని నా పనిలో నిమగ్నమవుతాను. మధ్యాహ్న భోజనానికి, రెండుసార్లు తేనీరు సేవనానికి మినహా సాయంత్రం 5 గంటల వరకు నేను నా డెస్క్ వద్దనే అధ్యయనంలో ఉండిపోతాను. మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ అదే దినచర్య.


ప్రపంచవ్యాప్తంగా నేను అనేక పురాపత్రాల భాండాగారాలలో నా పరిశోధనా వ్యాసంగాలు జరిగాయి. అయితే ‘నెహ్రూ లైబ్రరీ’ మాత్రమే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. పరిశోధనలకు ఎంతో అనువైన, ఆహ్లాదకరమైన నెలవు అది. మన దేశ ఆధునిక చరిత్రకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు అన్నీ అక్కడ విస్తృత స్థాయిలో లభ్యమవుతాయి. సిబ్బంది సమర్థులు. సదా సహాయకారులు. తమ పరిశోధనల నిమిత్తం అక్కడకు వచ్చే అనేకానేక మంది విద్వత్ పరులతో పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు ఏర్పడడమూ కద్దు. న్యూఢిల్లీలోని ‘నెహ్రూ లైబ్రరీ’ చారిత్రక పరిశోధకుల పుణ్యక్షేత్రం. గత పాతికేళ్ళుగా నేను ఏటా ఆ అద్భుత చారిత్రక పత్రాల భాండాగారాన్ని కనీసం నాలుగు పర్యాయాలు, కొన్ని సందర్భాలలో ఐదు, అవసరమైతే ఆరు సార్లు పరిశోధనల నిమిత్తం సందర్శిస్తుంటాను. 2020 జనవరిలో వెళ్ళినప్పుడు, పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయన్న ఆలోచనే నాకు కలుగలేదు. కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో నేను బెంగలూరులోనే కాలం వెళ్ళబుచ్చవలసివచ్చింది. 


అయితే ఆ అద్భుత చారిత్రక పత్రాల భాండాగారం ఒక విధంగా నా చెంతనే ఉంటూ వస్తోంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న విదేశీయుల గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. గతంలో ‘నెహ్రూ లైబ్రరీ’లో నేను నిర్వహించిన పరిశోధనలే ఈ కొత్త పుస్తకానికి ఆధారాలు అని మరి చెప్పనవసరం లేదు. ఈ గ్రంథ రచనతో పాటు, ‘నెహ్రూ లైబ్రరీ’పై ఆధారపడిన యువ పరిశోధకుల (ఇంకా ప్రచురితంకాని) పుస్తకాల రాతప్రతులను కూడా చదివాను. 2020 గ్రీష్మ, శిశిర రుతువులలో రాహుల్ రామగుండం రాసిన సోషలిస్టు నేత జార్జి ఫెర్నాండెజ్ జీవితచరిత్ర, అభిషేక్ చౌదరి రాసిన వాజపేయి జీవిత కథ రాతప్రతులను చదివాను. జయప్రకాష్ నారాయణ్ కొత్త జీవితచరిత్ర రాస్తున్న అక్షయ ముకుల్‌తో సుదీర్ఘ సమాలోచనలు జరిపాను.


ఈ మూడు కొత్త రచనా ప్రాజెక్టుల మధ్య నాలుగు ఉమ్మడి అంశాలు ఉన్నాయి. అవి: ఒకటి- ఆ పుస్తకాలు ప్రచురితమయినప్పుడు సంబంధిత నేతల ప్రామాణిక జీవితచరిత్రలుగా పేరు పొందే అవకాశముంది; రెండు- ఇవి, చాలా ముఖ్యమైన, అంతేకాదు వివాదాస్పద నాయకుల జీవిత చరిత్రలు అయినందున విస్తృతస్థాయిలో పాఠకులను తప్పక ఆకట్టుకుంటాయి; మూడు- ఈ జీవితచరిత్రల కథానాయకులు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ మహా నాయకుడు జవహర్ లాల్ నెహ్రూకు వ్యతిరేకులు; నాలుగు- ఫెర్నాండెజ్, వాజపేయి, జయప్రకాష్ నారాయణ్‌ల ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి పేరిట ఉన్న చారిత్రక పత్రాల భాండాగారాన్ని ఉపయోగించుకోకుండా ఆ యువ పరిశోధకులు తమ పుస్తకాలను రచించడం సాధ్యమయ్యేదికాదు. ఇవేమీ యాదృచ్ఛికం కాదు. నెహ్రూ స్మృతిని గౌరవించేందుకే ఆ లైబ్రరీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ సంస్థ తన విధ్యుక్తధర్మ నిర్వహణలో పక్షపాత వైఖరి ఎప్పుడూ చూపలేదు. వివక్షకు తావులేకుండా విశాల వైఖరితో విద్వత్ పరులకు సేవలు అందిస్తోంది. కనుకనే నెహ్రూకు వ్యతిరేకులైన శ్యామప్రసాద్ ముఖర్జీ, రాజగోపాలాచారి లాంటి నాయకుల జీవితచరిత్రల రచనకు సైతం ఆ భాండాగారంలో తప్పనిసరిగా పరిశోధనలు నిర్వహించవలసివున్నది.


నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని ప్రతిష్ఠాత్మక సంస్థగా అభివృద్ధిపరచడంలో ఆ సంస్థ మొదటి ఇద్దరు డైరెక్టర్లు బి ఆర్ నందా, రవీంద్రకుమార్ పాత్ర విశిష్టమైనది ఇరువురూ ఎంత విలక్షణ విద్వత్‌పరులో అంతగా పాలనాదక్షులు. నందా, కుమార్‌ల నేతృత్వంలో చారిత్రక పత్రాల సంరక్షకులు (ఆర్కివిస్ట్స్) ప్రశస్త కృషి ఫలితమే ‘నెహ్రూ లైబ్రరీ’. రాత ప్రతులను వర్గీకరించడం, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలనుంచి వార్తాపత్రికలను సేకరించి, భద్రపరిచి, పరిశోధకులకు అనువైన రీతిలో వారికి అందించే ఏర్పాట్లు చేయడంలో ఆ ఆర్కివిస్ట్స్ కృషి అవిస్మరణీయమైనది. గత ఐదు దశాబ్దాలుగా ‘నెహ్రూ లైబ్రరీ’లో నిర్వహించిన అధ్యయనాల ప్రాతిపదికన ఎంతోమంది ఎన్నో పుస్తకాలు, సిద్ధాంత వ్యాసాలు వెలువరించారు. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన ఏ అంశంపైన అయినా పరిశోధన చేసేవారు విధిగా అధ్యయనం చేయవలసిన చారిత్రక పత్రాలను అందుబాటులో ఉంచే గొప్ప గ్రంథాలయం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ. మీరు దేశీయులైనా లేదా విదేశీయులైనా, యువ లేదా మధ్య వయస్కులైనా లేదా వృద్ధులైనా ఆధునిక భారతదేశ చరిత్ర గురించిన పరిశోధనలకు ఇక్కడకు రావలసిందే. మీరు సామాజిక లేదా ఆర్థిక లేదా సాంస్కృతిక చరిత్రకారులైనా, సినిమా, మీడియా చరిత్రకారులైనా; స్రీవాద, పర్యావరణ ఉద్యమాల పరిశోధకులైనా లేక సామ్యవాదం, మతతత్వం గురించి రాస్తున్నా మీ పరిశోధనలు ‘నెహ్రూ లైబ్రరీ’లో ప్రారంభమయి, ఆ గ్రంథాలయంలోనే ముగుస్తాయి.


అంతర్జాతీయ విద్వత్ ప్రపంచంలో ఒక ప్రతిష్ఠాత్మక సంస్థగా ‘నెహ్రూ లైబ్రరీ’ని తీర్చి దిద్దిన ప్రాజ్ఞులు, విదుషీమణులలో ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా (మిగతా వారిని పరిపూర్ణంగా గౌరవిస్తూనే) ప్రస్తావిస్తాను. ‘నెహ్రూ లైబ్రరీ’ స్ఫూర్తి, విశిష్టతలకు ఆయన ఒక మూర్తీభవించిన ప్రతీక. ఆ విద్వన్మణి డాక్టర్ హరిదేవ్ శర్మ. పంజాబ్‌కు చెందిన ఈ చరిత్రకారుడు 1966లో ‘నెహ్రూ లైబ్రరీ’లో చేరి మూడున్నర దశాబ్దాల పాటు ఆ సంస్థకు అంకితమయ్యారు. ఆ భాండాగారంలోని అనేకానేక చారిత్రక పత్రాల సేకరణ హరిదేవ్ నిస్వార్థ కృషి వల్లే సాధ్యమయింది. ఇంతకు మందే ప్రస్తావించిన ఫెర్నాండెజ్, జయప్రకాశ్, రాజాజీ పేపర్స్‌తో పాటు మహాత్మా గాంధీకి సంబంధించిన విలువైన దస్తావేజులు ఎన్నిటినో ఆయన తన సంస్థకు సాధించగలిగారు. ‘నెహ్రూ లైబ్రరీ’ ప్రతిష్ఠాత్మక మౌఖిక చరిత్రల ప్రాజెక్టుకు తొలుత ఆయనే మార్గదర్శకత్వం వహించారు. హరిదేవ్ స్వయంగా పలువురు స్వాతంత్ర్య సమర యోధులను ఇంటర్వ్యూ చేసి చరిత్ర రచనకు విలువైన ఆధారాలను సమకూర్చారు. 


2020 ఫిబ్రవరి, డిసెంబర్ మధ్యకాలంలో ఆ మహా సంస్థకు ఎంతో సుదూరంలో ఉన్నప్పటికీ నేను చదివిన రాతప్రతుల ద్వారా ‘నెహ్రూ లైబ్రరీ’తో ఆత్మిక సంబంధాన్ని కొనసాగించాను. రాహుల్ రామగుండంతో ఫెర్నాండెజ్ గురించి, అభిషేక్ చౌదరితో వాజపేయి గురించి, అక్షయ ముకుల్‌తో జయప్రకాశ్ గురించి చర్చిస్తున్నప్పుడు నా మదిలో తరచు హరిదేవ్ శర్మ మెదులుతుండేవారు. ఈ యువ పరిశోధకులకు ఆయన తెలిసి ఉండే అవకాశం లేదు. అయితే హరిదేవ్ కృషి ఫలితంగానే తమ పరిశోధనలు సుసాధ్యమయ్యాయన్న విషయం వారికి బాగా తెలుసు. హరిదేవ్‌తో పరిచయం ఉండడమేకాకుండా ఆయన అపార చారిత్రక పరిజ్ఞానంతో నేరుగా లబ్ధి పొందిన అదృష్టం నాకు లభించింది. 


హరిదేవ్‌జీ పొట్టిగా, బొద్దుగా ఉండేవారు. సదా ధవళ కాంతితో మెరుస్తుండే ఖాదీ కుర్తా, పైజమా ధరిస్తుండేవారు. సొంత స్కూటర్ పైనే ఇంటికి, తాను పనిచేసే సంస్థకు మధ్య ఆయన రాకపోకలు సాగిస్తుండేవారు. నాకు అవసరమైన ఫైళ్ళను చిటికెలో ఇవ్వగలగడమేకాకుండా, వివిధ అంశాలపై నా అవగాహనను ఆయన సునిశితం చేసేవారు. కొత్త విషయాలను చెబుతుండేవారు. మహాత్ముని మరణానంతరం ఆయన సన్నిహిత శిష్యులు ఏమి చేశారో తెలుసుకోదలుచుకున్నారా అని హరిదేవ్‌జీ అడిగేవారు. ఆర్థికవేత్త జెసి కుమారప్ప పేపర్స్‌ను, ముఖ్యంగా వినోబా భావే, మీరా బెన్‌లతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాల ఫైళ్ళను నాకు అందిస్తుండేవారు. అలాగే గాంధీజీ జీవిత చరిత్రకారుడు డిజి టెండూల్కర్, కమల్ నయన్ బజాజ్ పేపర్స్‌లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు సంబంధించిన సమాచారాన్నీ అందించేవారు. హరిదేవ్‌జీ సలహాలు, సూచనలు నా పరిశోధనలకు ఇతోధికంగా దోహదం చేశాయని మరి చెప్పాలా? 


‘నెహ్రూ లైబ్రరీ’ డిప్యూటీ డైరెక్టర్‌గా హరిదేవ్ శర్మ 2000 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశారు. విశ్రాంత జీవితంలోకి ప్రవేశించిన కొద్దినాళ్ళకే ఆయన విగతుడు అయ్యారు. దరిమిలా నేను ఎప్పుడు ఆ మహాసంస్థకు వెళ్ళినా తొలుత నాకు జ్ఞాపకం వచ్చేది హరిదేవ్‌జీనే. గత 11 నెలలుగా నేను ‘నెహ్రూ లైబ్రరీ’ని ప్రత్యక్షంగా చూడలేదు. 2021లో నైనా చూస్తానో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవలి సంవత్సరాలలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఒక పతన దశలోకి ప్రవేశించింది. అది క్రమేణా క్షీణించిపోతోంది. బహుశా, పూర్వ ప్రకాస్తి దానికి మళ్ళీ సిద్ధించకపోవచ్చు. ప్రతిష్ఠాత్మక ‘నెహ్రూ లైబ్రరీ’ ప్రఖ్యాతి నిరుడు కురిసిన హిమసమూహమే కావడం వర్తమాన మేధా భారత విషాదం.


హరిదేవ్‌జీ లాంటి ఉత్కృష్ట చారిత్రక పత్రాల భాండాగారికుల (ఆర్కివిస్ట్స్) ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన స్థానాలను మళ్ళీ భర్తీ చేయడం లేదు. సుప్రసిద్ధ భారతీయుల నుంచి సేకరించిన చారిత్రక పత్రాలను వర్గీకరించి, పరిశోధనలకు అందుబాటులో ఉంచే కృషి నిలిచిపోయింది. ఆ విలువైన చారిత్రక పత్రాలపై దుమ్మూ ధూళి దట్టంగా పేరుకునిపోతోంది. హరిదేవ్‌శర్మ లాంటి ఆర్కివిస్ట్స్ కృషితో వినుతికెక్కిన ఈ ఉత్కృష్ట మేధో కేంద్రం ఒకప్పుడు అన్ని తరాల, భావజాలాల, దేశదేశాల ప్రాజ్ఞులు, పండితులను ఆహ్వానించి, ఆదరించింది. అయితే ఇప్పుడు దీనస్థితిలోకి జారిపోయింది. ఆ మహా సంస్థలో ఇప్పుడు సృజనాత్మక ప్రతిభా పాటవాలు వికసించడం లేదు, వర్థిల్లడం లేదు. స్వీయ పునర్నవీకరణ సామర్థ్యం దానికి పూర్తిగా కొరవడిపోయింది. ఆ మహాసంస్థ ఉజ్వల స్థితి నాకు స్వయంగా తెలుసు. ఆ కాలంలో నేను అక్కడ జరిపిన అధ్యయనాలే ఇప్పటికీ నా పరిశోధనలకు ఆలంబనగా ఉన్నాయి. నేను అదృష్ట వంతుణ్ణి. అయితే యువ పరిశోధకులు, ఇంకా పుట్టని మేధావులు చారిత్రక సత్యశోధనలో ఆ మహా సంస్థ నుంచి నా వలే లబ్ధి పొందలేరు కదా అనే భావన నన్ను ఎంతో విచారగ్రస్తుడిని చేస్తోంది.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.