కళ్లలో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి

ABN , First Publish Date - 2022-08-15T06:33:38+05:30 IST

భూవివాదంలో అన్న చేతిలో తమ్ముడు హతమయ్యాడు. నడిగూడెం మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు, బంధువులు, ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

కళ్లలో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి
వీరబాబు (ఫైల్‌ ఫొటో)

అన్న చేతిలో తమ్ముడి హతం ఫ సహకరించిన వదిన

తమపైనే దాడి చేశాడని పోలీసులను ఆశ్రయించిన భార్యాభర్తలు

నడిగూడెం, ఆగస్టు 14: భూవివాదంలో అన్న చేతిలో తమ్ముడు హతమయ్యాడు. నడిగూడెం మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు, బంధువులు, ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లాపురం గ్రామానికి చెందిన కోపెర శీనివాస్‌, భద్రయ్య, వీరబాబు(39) అన్నాదమ్ముళ్లు. వీరికి గ్రామం లోని సర్వే నెం.397, 398లలో వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల భూమి ఉంది. ముగ్గురు అన్నాదమ్ముళ్లకు ఒక్కొక్కరికి 30 కుంటల చొప్పున తండ్రి పంచి ఇచ్చారు. శ్రీనివాస్‌ గతంలో మృతి చెందగా, భద్రయ్య బాగా అప్పులు చేసి తీర్చలేక నాలుగేళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లాడు. సోదరుడు చేసిన అప్పులన్నీ తమ్ముడు వీరబాబు తీర్చి భద్రయ్య పేరిట ఉన్న 30కుంటల భూమిని తన పేరుపై పట్టా చేయించుకున్నాడు. రెండేళ్ల క్రితం గ్రామానికి వచ్చిన భద్రయ్య తన వాటా భూమి తనకు ఇవ్వాలని పెద్దలు, పోలీసులను ఆశ్రయించాడు. అన్న చేసిన అప్పులు చెల్లించినందున ఆ భూమి వీరబాబుదేని వారు నిర్ధారించారు. భూమిలేని భద్రయ్యకు తండ్రి రెండేళ్ల  క్రితం 12 కుంటల భూమిని ఇచ్చాడు. ఈ భూమిలో కూడా తనకు వాటా వస్తుందని వీర బాబు పేచీ పెట్టాడు. రెండేళ్లుగా అన్నాదమ్ముళ్ల మధ్య ఈ వివాదాలు కొన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలం పనుల్లో ఉన్న వీరబాబును  భద్ర య్య-సరోజిని దంపతులు కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడి చేసి హత్య చేసి చెరుకు తోటలో పడేశారు. ఏమీ ఎరుగనట్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ్ముడు వీరబాబు తమపై దాడి చేశారని భద్రయ్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక చికిత్స కోసం పోలీసులు భద్రయ్య దంపతులను నడిగూడెం లోని ఆస్పత్రికి పోలీసులు తీసుకువెళ్లారు. పొలాల్లో వీర బాబు మృతదేహం ఉందని గొర్రెల కాపరులు పోలీసు లకు సమాచారం ఇవ్వటంతో భద్రయ్య దంపతులను ఆస్పత్రి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారిస్తున్నారు. కోదాడ డీఎస్పీ వెంకటే శ్వరరెడ్డి, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ ఏడుకొండలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరబాబు మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరబాబుకు భార్య పద్మ, ఏడేళ్ల కుమారుడు గణేష్‌, ఐదేళ్ల కుమార్తె దీక్షిత ఉన్నారు. గ్రామంలో అవాంఛ నీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. బావ భద్రయ్య, సరోజిని దంపతులు, బంధువులు పార్వతిభద్రమ్మ, నవ్య, వీరప్రసాద్‌లు తన భర్తను హత్య చేశారని వీరబాబు భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు.




Updated Date - 2022-08-15T06:33:38+05:30 IST